ఇంకెవరి కోసం బతకాలి
logo
Published : 24/06/2021 03:57 IST

ఇంకెవరి కోసం బతకాలి

ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరి దుర్మరణం

రామభద్రపురం సమీపంలో ఘటన

ఘటనా స్థలంలో ఢీకొన్న వాహనాలు

రామభద్రపురం, బొబ్బిలి గ్రామీణం, న్యూస్‌టుడే: వారిద్దరూ ఇప్పుడిప్పుడే జీవితం గురించి తెలుసుకుంటున్నారు... వారి తండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు.. ఒక్కగానొక్క కుమారులు కావడంతో వారి తల్లులు అల్లారుముద్దుగా పెంచారు.. ప్రయోజకులై అందివస్తారనుకుంటే ప్రమాద రూపంలో మృత్యువు వారిని కబళించి.. ఆ మాతృమూర్తులకు గర్భశోకాన్ని మిగిల్చింది. ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన రామభద్రపురం సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. మేమెవరి కోసం ఇక బతకాలంటూ మృతుల తల్లుల రోదనలు మిన్నంటాయి. రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఏఎస్సై రమణమ్మ, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం బాడంగి మండలం గజరాయుునివలసకు చెందిన బండి వంశీకృష్ణ(22), రామభద్రపురానికి చెందిన లక్ష్మీతేజాశర్మ(21)లు ద్విచక్రవాహనాలపై వస్తూ ఎదురెదురుగా ఢీకొనడంతో లక్ష్మీతేజాశర్మ ప్రమాద స్థలంలో మృతి చెందగా, తీవ్రగాయాలైన వంశీకృష్ణను 108 వాహనంలో విజయనగరం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు.

పూజలు చేయించి వస్తుండగా...: రామభద్రపురానికి చెందిన లక్ష్మీతేజాశర్మ తండ్రి మంగాచార్యులు కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందడంతో కుటుంబ బాధ్యత శర్మపై పడింది. పౌరోహిత్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవలే చెల్లి పెళ్లి చేశారు. తల్లి సుభారాణితో కలిసి నివాసం ఉంటున్నారు. దూరప్రాంతాల్లో పౌరోహిత్యం చేసేందుకు ఇబ్బందిగా ఉండడంతో ఇటీవల ఓ ద్విచక్ర వాహనం కొన్నారు. బుధవారం ఉదయం బాడంగిలో ఆలయ శంకుస్థాపనకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కుమారుడి మృతితో తల్లి, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

అందివస్తాడనుకుంటే అనంతలోకాలకు...

బండి వంశీకృష్ణ తండ్రి త్రినాథరావు చిన్నతనంలోనే చనిపోయారు. తల్లి గీత కుమారుడితో కలిసి కన్నవారి ఇంటికి పాచిపెంటకు వచ్చి స్థిరపడ్డారు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో అల్లారుముద్దుగా పెంచి ప్రయోజకుడ్ని చేద్దామని ఎన్నో ఆశలు పెట్టుకుని హైదరాబాద్‌లో సీఏ చదివిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి వద్దే ఉంటున్నాడు. రామభద్రపురంలో ఇంటి సామాన్లు కొని తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకోవడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని