ఆక్వా సమావేశం రసాభాస
eenadu telugu news
Published : 24/10/2021 05:07 IST

ఆక్వా సమావేశం రసాభాస

అధికారులను ప్రశ్నిస్తున్న ఆక్వా రైతు

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: భీమవరం పురపాలక సంఘ సమావేశ మందిరంలో శనివారం జరిగిన ఆక్వా రంగ భాగస్వాముల సమావేశం రసాభాసగా మారింది. మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు నాగలింగాచారి అధ్యక్షతన ఆక్వా రంగంలో వివిధ సమస్యలు వాటి పరిష్కారాలపై చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు కిందిస్థాయి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వా చెరువు తవ్వేందుకు, పాత వాటి అనుమతుల పునరుద్ధరణకు సంబంధించిన నిబంధనలను అధికారులే పాటించడం లేదని విమర్శించారు.మీరు ఇచ్చే నివేదికలో తప్పులు ఉంటున్నాయని, ఇలా ఎందుకు జరుగుతోందని నిలదీశారు. మత్స్యశాఖాధికారులు, ఆక్వా రంగ నిపుణులు ఆ రంగంలో ఎదురవుతున్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆక్వా మేతలు ఎమ్మార్పీ ధర కంటే తక్కువగా అందించనున్నట్లు మత్స్యశాఖ ఉప సంచాలకుడు చంద్రశేఖర్‌ వెల్లడించారు. ఆక్వా ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకందారులు, ప్రాసెసింగ్‌ పరిశ్రమల, ఇతర విభాగాల ప్రతినిధులు నామమాత్రంగా హాజరయ్యారు. సమావేశం గురించి పూర్తి సమాచారం ఇవ్వకపోవడం వల్ల హాజరైన రైతుల సంఖ్య రెండంకెలు కూడా లేదని పలువురు విమర్శించారు. మత్స్యశాఖ సహాయ సంచాలకుడు హెన్రీ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్‌, అమరనేని శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని