వరద కాల్వల్లో బురద మేటలు
eenadu telugu news
Published : 28/09/2021 04:03 IST

వరద కాల్వల్లో బురద మేటలు

రోడ్లను ముంచెత్తుతున్న నీరు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ వ్యాప్తంగా చిన్నా పెద్ద కలిపి వరద నీటి పైపులు, కాల్వలు 7500 కిలోమీటర్ల మేర ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఇవి కబ్జాకు గురి కావడంతో కుంచించుకుపోయాయి. వీటి నిర్వహణను జీహెచ్‌ఎంసీ గాలికొదిలేసింది. దీంతో వీటిలో ఇసుక మేటలు పేరుకుపోయి ప్రవాహ వేగం తగ్గిపోతోంది. వరద నీటి పైపులపై లక్షన్నర వరకు మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. వీటి నిర్వహణనూ పెద్దగా పట్టించుకోవడం లేదు. చాలా ప్రాంతాల్లో ఇవి భూమిలోకి కుంగిపోయాయి. దీంతో వరద నీరు మ్యాన్‌హోళ్ల ద్వారా బయటకు ఉప్పొంగి రోడ్లు, సమీప కాలనీలు, బస్తీల్లోకి పోటెత్తుతోంది. సోమవారం కురిసిన వానకు చాలా ప్రాంతాల్లో వరద నీరు రోడ్లను ముంచెత్తింది. ఖైరతాబాద్‌ మెట్రో పరిధిలో వరద నీరు నిల్వ చేరి దాదాపు ఆరేడు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రాజ్‌భవన్‌ రోడ్డులో వరద నీరు ముందుకు కదలక అదే పరిస్థితి ఏర్పడింది. యూసుఫ్‌గూడ ప్రాంతంలో వరద నీరు ముందుకు కదలక ఇళ్లలోకి చేరింది. నాంపల్లిలోని కొన్ని అపార్టుమెంట్లలోకి వరద నీరు భారీగా చేరింది. బీఎన్‌రెడ్డి నగర్‌లోని గాంధీనగర్‌ పరిసర కాలనీల్లో మోకాళ్ల లోతు నీరు చేరింది. రాజేంద్రనగర్‌లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో కాటేదాన్‌ సబ్‌స్టేషన్‌ వరద నీటిలో మునిగిపోయింది. నాగారం రామ్‌పల్లి చౌరస్తాలో వరద పోటెత్తడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.

ఏం చేయాలంటే..?

* ఏటా వర్షా కాలానికి ముందు గ్రేటర్‌ వ్యాప్తంగా వరద నీటి కాల్వలు, మ్యాన్‌హోళ్ల మరమ్మతులు చేయాలి. వర్షపు నీటి ప్రవాహ వేగానికి అడ్డంకులు లేకుండా ఎప్పటికప్పుడు వీటి నిర్వహణను జీహెచ్‌ఎంసీ చేపట్టాలి.

* చాలా ప్రాంతాల్లో పాత వ్యవస్థలను పునరుద్ధరించడంతో పాటు అక్కడ వాన నీటి ప్రవాహాన్ని అంచనా వేసి కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

* పైపుల్లో తొలగించిన చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలు అక్కడే వేయకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని