ఆగిన ప్రేమ ప్రయాణం - Kamareddy - EENADU
close

మంగళవారం, సెప్టెంబర్ 17, 2019

ప్రధానాంశాలు

ఆగిన ప్రేమ ప్రయాణం

రైలు పట్టాలపై ఆత్మహత్య
నిజామాబాద్‌ రైల్వేకమాన్‌ సమీపంలో ఘటన
మృతులిద్దరు దోమకొండ వాసులు
 న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నేరవార్తలు, దోమకొండ

ఒకరినొకరు మనస్ఫూరిగా ఇష్టపడ్డారు... ఏడడుగులు నడవాలనుకున్నారు..  ఆనందంగా నూరేళ్ల జీవితం సాగిద్దామని కలలు కన్నారు..  అంతలోనే ఏం కష్టమొచ్చిందో ఆ పచ్చని జంటకు. ఈ లోకంలో బతకలేమని తలచి ఒక్కటిగా తనువు చాలించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలకేంద్రానికి చెందిన ప్రేమజంట నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే కమాన్‌ సమీపంలో రైలు పట్టాలపై మంగళవారం ఉదయం వీరి మృతదేహాలను గుర్తించారు.

కామారెడ్డి మండలం దోమకొండ మండలానికి చెందిన ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. నిజామాబాద్‌ నగరంలోని రైల్వేకమాన్‌కు సమీపంలో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. తొలుత మృతులు ఎవరనే విషయం తెలియక రైల్వే పోలీసులు ఆధారాల కోసం గాలించారు. చివరకు మృతులిద్దరు కూడా దోమకొండ మండలానికి చెందిన వారిగా తేల్చారు.
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చాకలివాడకు చెందిన లత్తివారి సురేశ్‌(21), అదే మండలంలోని వివేకానంద కాలనీకి చెందిన లోలపు ప్రియాంక(19) గత కొంతకాలంగా ప్రేమించుకొంటున్నారు. ఇటీవల వీరి ప్రేమ విషయం ఇంట్లో పెద్దలకు కూడా తెలిసింది. అయితే వీరి ప్రేమను పెద్దలు నిరాకరించారు. ఇదే సమయంలో తమకు ఇష్టం లేని వివాహం చేస్తారన్న భయంతో వీరిద్దరు కలిసి ఈ నెల 11న తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇదే సమయంలో ప్రియాంక అదృశ్యమైనట్లుగా కుటుంబీకులు దోమకొండ ఠాణాలో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్య కేసు నమోదు చేశారు. తదనంతరం సురేశ్‌పై అనుమానం ఉందని పోలీసులకు కుటుంబీకులు తెలిపారు. ఇంతలోనే వీరు ఆత్మహత్య చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది.

మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం
వీరిద్దరి మధ్యన మూడేళ్లకు పైగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. ప్రియాంక బీ ఫార్మసీ చదివి ప్రస్తుతం ఖాళీగా ఉంటోంది. సురేశ్‌కు ఆర్మీలో ఉద్యోగం రాగా శిక్షణ కూడా పొందుతున్నట్లు సమాచారం. శిక్షణ సమయంలో తాను ప్రేమించిన యువతితో బయటకు వెళ్లటం, ఆపై తనపై కేసులు నమోదైతే పరిస్థితి ఏమిటని ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని తెలుస్తోంది.

ఇదే బలమైన కారణమా?
వీరి ఆత్మహత్యకు కులాలు వేరు కావటం, దీంతో పెద్దలు పెళ్లికి నిరాకరించటమే బలమైన కారణంగా తెలుస్తోంది. వీరిద్దరు ఇంటి నుంచి బయటకు వెళ్లిన అనంతరం తొమ్మిది రోజుల తర్వాత నిజామాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. తమకు వేరే దారికలేనే చావు శరణ్యమని ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అర్థమవుతోంది.

ఎలాంటి ఆధారాలు దొరకకుండా..
ఆత్మహత్యకు ముందు తమ ఆధారాలు ఎవరికీ దొరకకుండా వీరు జాగ్రత్తపడ్డారు. సోమవారం రాత్రి సంఘటన జరగ్గా మంగళవారం తెల్లవారుజామున వెలుగులోకి రావటంతో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. సంఘటన స్థలంలో వీరికి సంబంధించి కేవలం రెండు చరవాణులు మాత్రమే దొరికాయి. అయితే రెండు చరవాణుల్లో కూడా సిమ్‌కార్డులు లేవు. అంటే ఆత్మహత్య చేసుకొందామని ముందుగానే వీరు సిమ్‌కార్డులను తీసివేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే ఎస్సై ప్రణయ్‌ కుమార్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.