close

శనివారం, అక్టోబర్ 19, 2019

ప్రధానాంశాలు

బీసీ గురుకుల పాఠశాలలు సిద్ధం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి
భవనాల కొరతతో వేరే ప్రాంతాల్లో ఏర్పాటు
రేపు ప్రారంభించడానికి చర్యలు

మహేశ్వరం, న్యూస్‌టుడే: వెనకబడిన తరగతుల(బీసీ) సంక్షేమ గురుకుల పాఠశాలల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. నియోజకవర్గానికికొకటి చొప్పున మంజూరు చేసింది. తెలంగాణలో 119 నియోజవర్గాలకు 119 బీసీ గురుకులాలు మంజూరు కాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 16 నియోజకవర్గాలకు బీసీ గురుకులాలను మంజూరు చేసింది. ఈ నెల 17 నుంచి వీటిని ప్రారంభించనున్నారు. సొంత భవనాలు లేకపోవడంతో ఈ విద్యాసంవత్సరాన్ని అద్దె భవనాల్లో కొనసాగించాలని నిర్ణయించారు.గతంలో బాలుర గురుకులం ఉన్న చోట బాలికల గురుకులాన్ని, బాలికలు ఉన్న చోట బాలుర గురుకులాన్ని మంజూరు చేశారు. పదవీ విరమణ పొందిన ప్రిన్సిపాళ్లకు తాత్కాలికంగా నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అద్దె భవనాలను గుర్తించి వాటిల్లో తరగతులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు.
విధివిధానాలు...
కొత్తగా మంజూరైన బీసీ గురుకులాల్లో మొదటి సంవత్సరం 5, 6, 7 తరగతులను ఆంగ్లమాధ్యమంలో ప్రారంభించనున్నారు. తరగతికి 80 మంది చొప్పున 3 తరగతులకు 240 మందికి ప్రవేశం కల్పిస్తున్నారు. ఒక్కో తరగతిలో రెండు సెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. నూతన గురుకులాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో 4480 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఈ విద్యాలయాల్లో ప్రవేశానికి విద్యార్థులు అంతర్జాలంలో దరఖాస్తు చేసుకోగా ఏప్రిల్‌లో టీజీసెట్‌ ప్రవేశపరీక్ష నిర్వహించారు. అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులకు ఆయా రిజర్వేషన్ల ప్రకారం ప్రవేశాలు కల్పించనున్నారు. సీట్లు మిగిలితే రెండో కౌన్సెలింగ్‌లో పూర్తి చేయనున్నారు.
విద్యార్థులకు సౌకర్యాలు..
ప్రతి విద్యార్థికి బెడ్డింగ్‌ మెటీరియల్‌, పాఠ్యపుస్తకాలు, రాతపుస్తకాలు, 3 జతల ఏకరూప దుస్తులు, ట్రాక్‌సూట్‌, రెండు జతల షూలు, టై, బెల్ట్‌, ప్లేటు, గ్లాస్‌, అందజేస్తారు.మెనూలో పౌష్టికాహారం, కాస్మొటిక్‌ ఛార్జీలు నెలకు రూ.113 అందిస్తారు. ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన, కంప్యూటర్‌ విద్య, ప్రయోగశాలలు, విద్యార్థులకు చదువుతోపాటు, యోగ, ఆటపాటలు, అనుబంధ కార్యక్రమాలైన ఫైన్‌ఆర్ట్స్‌, సంగీతంలో శిక్షణ ఉచితంగా అందజేయనున్నారు. చదువులో ప్రతిభ చూపినవారికి ఐఐటీ, నీట్‌లలో కార్పొరేట్‌ స్థాయిలో ఉచితంగా శిక్షణ అందిస్తారు.


ఇక్కడిది.. అక్కడ..
ఆయా ప్రాంతాల్లో అద్దె భవనాలు లభించకపోవడంతో.. అక్కడ ఏర్పాటు చేయాల్సిన గురుకుల పాఠశాలలను వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసి కొనసాగించనున్నారు. గతంలోనూ ఓ నియోజకవర్గానికి మంజూరైన గురుకుల పాఠశాలను భవనాల కొరత కారణంగా మరో నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే పద్ధతి తప్పని పరిస్థితి నెలకొంది. మహేశ్వరంలోని జేజే ఇంజినీరింగ్‌ కళాశాలలో తలకొండపల్లికి చెందిన బాలుర గురుకుల పాఠశాల కొనసాగుతుంది. రాజేంద్రనగర్‌ నియోజకవర్గానికి చెందిన బాలుర గురుకుల పాఠశాల సైతం మహేశ్వరంలోనే ఏర్పాటు చేశారు. కందుకూరు మండలం రాచలూరు సమీపంలోని నిషితా ఇంజినీరింగ్‌ కళాశాలలో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బాలుర గురుకుల పాఠశాల కొత్తగా ఏర్పాటు చేశారు. కార్వన్‌, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలకు చెందిన బాలుర గురుకుల పాఠశాలలను సైతం నిషితా ఇంజినీరింగ్‌ కళాశాలలోనే ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఈనెల 17న ప్రారంభం కానున్నాయి

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.