చెరువులెంత భద్రం..! - Nizamabad - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

చెరువులెంత భద్రం..!

ముందుకు సాగని మిషన్‌ కాకతీయ పనులు

న్యూస్‌టుడే, కామారెడ్డి అర్బన్‌

భారీ కోతకు గురైన రామేశ్వర్‌ చెరువు కట్ట

జిల్లా వ్యాప్తంగా 1954 చెరువులు, కుంటలున్నాయి. వీటికింద 97,881 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పటివరకు కురిసిన వర్షాలతో 21 చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. 85 నిండేందుకు చేరువయ్యాయి. 217 నీటి వనరుల్లో సగం వరకు నీరు చేరగా.. 549లో 25శాతం నుంచి 50శాతం వరకు చేరింది. మిగతా 1082లో పావు భాగమైనా జలకళ లేదు.

రూ.355 కోట్లు వెచ్చించినా ఫలితం మిశ్రమంగానే ఉంది. ఈ పథకం పూర్తి చేసి 81 వేల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉండగా.. సగం ఆయకట్టుకైనా అందని పరిస్థితి ఉంది. పనులు పూర్తయిన చోట నాణ్యతాలోపం శాపంగా మారి ప్రమాదపు అంచున ఊగిసలాడుతున్నాయి.

చేసింది గోరంత.. మిగిలింది కొండంత..

చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం పనులు పూర్తి చేసేందుకు గుత్తేదారులు నత్తకే నడక నేర్పుతుండగా.. చర్యలు చేపట్టేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ పథకం ద్వారా చేపట్టాల్సిన పనుల్లో చేసింది గోరంతైతే మిగిలింది కొండంతలా ఉంది.

పొంచి ఉన్న గండం

జిల్లాలోని అనేక చెరువుల కట్టలు 2016 సెప్టెంబరులో కురిసిన కుంభవృష్టికి కొట్టుకుపోయే స్థితిలో కొనూపిరితో కొట్టుమిట్టాడాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు.. ఉపరితల ఆవర్తనాలతో అలుపెరకుండా వానలు పడుతున్నాయి. పది రోజులుగా ఎడతెరపి లేని వానలతో జిల్లా తడిచి ముద్దవుతోంది. మరో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే నిజమైతే చెరువులు నిండుకుండలే అవుతాయని సంబరపడుతున్న ప్రజానీకం.. మరోవైపు శిథిలదశకు చేరుకున్న నీటి వనరులు వరద తాకిడిని తట్టుకొని నిలుస్తాయా..? కొట్టుకుపోయి సముద్రంలో కలుస్తాయా..? అనే ఆందోళనతో కలవర పడుతున్నారు.


పూడిక పేరుకుపోయిన లింగాపూర్‌ చెరువు తూము

కుంగిన తూము ఆగేనా..

మిషన్‌ కాకతీయ కింద జిల్లా కేంద్రం పరిధిలోని లింగాపూర్‌ చెరువు కట్ట మరమ్మతులకు నోచుకొన్నా.. గతంలో వరద తాకిడిని తట్టుకోలేక తూము వద్ద బుంగ పడే పరిస్థితి ఏర్పడింది. ఇంత జరిగినా అధికారుల ఉదాసీనత వల్ల ఇప్పటికీ దానికి తిరిగి మరమ్మతులు చేపట్టలేదు. నాణ్యత లేక మళ్లీ కుంగుతోంది. గ్రామస్థులు దీని గురించి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా చర్యలు లేవు. భారీ వర్షాలు కురిస్తే ఈ చెరువుకు గండం పొంచి ఉందని గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

మరమ్మతులు చేయాలి: ఎర్రొల్ల గంగారాం, లింగాపూర్‌

* మా ఊరి చెరువు తూము కుంగుతోంది. గతంలో సార్లకు చెప్పినా పట్టించుకోలేదు. రోజురోజుకూ కట్టపై గుంతలా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు మరమ్మతులు చేపట్టాలి.

* ఇన్నాళ్లూ కరవుతో అల్లాడిన పల్లెలు నేడు నీళ్లతో కళకళలాడుతున్నాయి. వరుస వర్షాలతో కరవు నేల తడిచి ముద్దవుతోంది. చెరువులు-కుంటల్లో కొత్తనీరు వచ్చి చేరుతోంది.

* ఊరికి బలమైన చెరువు జలాన్ని ఒడిసిపట్టే పటుత్వాన్ని కోల్పోయి.. శిథిలదశకు చేరుకొని.. మరమ్మతులకు మొరపెడుతున్నా.. సకాలంలో స్పందించి చేయూతనందించే వారే కరవయ్యారు.


బలహీనంగా ఉన్న అన్నారంలోని రామేశ్వర్‌ చెరువు కట్ట

పనులు చేయకుంటే నోటీసులు: బన్సీలాల్‌, ఈఈ

మిషన్‌ కాకతీయ పనులు పూర్తి చేయని గుత్తేదారులకు నోటీసులిచ్చాం. మరోమారు నోటీసులిచ్చి పనులను రద్దు చేస్తాం. ఏమైనా సమస్యలుంటే ఈఎండీ నిధులతో మరమ్మతులు చేయిస్తాం. మిగతా చెరువులన్నీ బాగానే ఉన్నాయి. ప్రమాదకర స్థితిలో ఏవీ లేవు.

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.