close

ఆదివారం, అక్టోబర్ 20, 2019

ప్రధానాంశాలు

ముంచుతున్న నిర్లక్ష్యం 

 కోనసీమలోనూ ప్రమాదకరంగా పడవ దాటింపులు
 పర్యవేక్షణ లోపంతో తరచూ ప్రమాదాలు

2018 జూలై 14న పశువుల్లంక మొండిరేవులో ప్రమాదానికి గురై 
ఏడుగురుని పొట్టన పెట్టుకున్న పడవ ఇదే

ముమ్మిడివరం, ఐ.పోలవరం, న్యూస్‌టుడే: దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో పర్యాటక బోటు మునిగిపోయిన ప్రమాదం తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. ఈ సంఘటనతో కోనసీమలోని లంక గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ప్రమాదం అంచున పడవ ప్రయాణం సాగుతున్నా ఎవరూ పట్టించుకోకపోతుండటంతో ఇటువంటి ఘోరమైన సంఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. కోనసీమలో వశిష్ఠ, వైనతేయ, గౌతమి, వృద్ధగౌతమి పాయలు ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాల వాసులు బాహ్యప్రపంచానికి రావాలంటే నిత్యం పడవ ప్రయాణం తప్పనిసరి. కొన్ని గ్రామాలకు రోడ్డు మార్గం ఉన్నా.. దూరాభారం తగ్గించుకోవడానికి పడవలు, పంట్లలో గోదావరిని దాటి వస్తున్న పరిస్థితులున్నాయి. ఐ.పోలవరం మండలంలో అధికంగా కేశనకుర్రు, కుండలేశ్వరం, పల్లంకుర్రు, పశువుల్లంక-సలాదివారిపాలెం, జి.మూలపొలం-ఎర్రగరువు, ధరియాలతిప్ప-గోగుల్లంక, గుత్తెనదీవిల్లో గోదావరి రేవుల్లో పడవ ప్రయాణం సాగుతోంది. మామిడికుదురు మండలం పెదపట్నం, సఖినేటిపల్లి మండలం కరవాక, అల్లవరం మండలం గోగన్నమఠం, ఓడలరేవు, బెండమూర్లంక, పి.గన్నవరం మండలం కె.ముంజవరం, కాట్రేనికోన మండలంలో బలుసుతిప్ప-మాగసానితిప్ప, ముక్తేశ్వరం-కోటిపల్లి వద్ద నిత్యం ప్రజలు పడవ ప్రయాణం చేస్తారు. ఇవి కాకుండా అనధికారికంగా ముమ్మిడివరం మండలం గురజాపులంక, తాళ్లరేవు మండలంలో సీతారామపురం-పాతకోరంగితో పాటు వరదల సమయాల్లో బెల్లంపూడి, ఊడిమూడిలంక, కనకాయలంక, లంక ఆఫ్‌ గేదెల్లంక, కూనాలంక తదితర ప్రాంతాల్లో ప్రజారవాణాకు పడవలను ఏర్పాటు చేసి తరలిస్తున్నారు. గత ఏడాది జులై 14న పశువుల్లంక-సలాది వారిపాలెం వద్ద రేవులో పడవ మునిగి ఆరుగురు విద్యార్థులు, ఓ మహిళ మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడ పంటు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ రావడంతో జిల్లా అధికారులు ఆరు చోట్ల పంట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ముక్తేశ్వరం-కోటిపల్లి, గోగన్నమఠం వద్ద ఎప్పటి నుంచో పంటు ద్వారా ప్రయాణికులను దాటిస్తుండగా.. కొత్తగా పశువుల్లంక రేవు వద్ద మాత్రమే పంటు  ఏర్పాటు చేశారు. మిగిలిన చోట్ల నాటు పడవలు, ఇంజిను పడవల ద్వారా ప్రజలను తరలిస్తున్నారు.


కళ్ల ముందు కదలాడుతున్నా.. 
2018 జులై 14న ఐ.పోలవరం మండలం పశువుల్లంక మొండిరేవులో పడవ ప్రమాదానికి గురై ఏడుగురు మృత్యవాత పడ్డారు. ఇందులో ఆరుగురు విద్యార్థులుండటం తెలిసిందే. ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం కాలేదు. కేవలం మరమ్మతులకు గురైన పడవను వినియోగించడంతో ఈ ప్రమాదం జరిగింది. తరువాత రెండు నెలల కాలానికే దేవీపట్నంలో పడవ ప్రమాదం సంభవించి 19మంది మృత్యవాత పడ్డారు. యానాం-ఎదుర్లంక రేవులో 2001 ఏప్రిల్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పంటుపైకి కారు ఎక్కిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఉన్న ఇద్దరు జలసమాధి అయ్యారు. 1994లో గోగుల్లంక-భైరవలంక గ్రామాల మధ్య చింతేరుపాయపై పడవ మునిగి ఇద్దరు ఉపాధ్యాయులు మృత్యువాతపడ్డారు. 1991లో కేశనకుర్రు-కొత్తల్లంక రేవులో పడవ మునిగి ఎనిమిది మంది ప్రాణాలు నీటిలో కలసిపోయాయి. గోగుల్లంక, పశువుల్లంక మొండిరేవుల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. త్రుటిలో ప్రమాదాల నుంచి బయటపడుతున్న సంఘటనలు అనేకం. ఇన్ని జరుగుతున్నా.. కోనసీమలోని నదీపాయలతో పాటు జిల్లాలోని రేవుల్లో ప్రజారవాణాకు సంబంధించి రక్షణ చర్యల విషయంలో పట్టనట్టు వ్యవహరిస్తున్న ధోరణి కనిపిస్తోంది. కొన్ని చోట్ల నాటు పడవలను వినియోగిస్తున్నారంటే అక్కడ ప్రజలకు భద్రత ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. రేవుల్లో పంట్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. వాటిని పూర్తి స్థాయిలో ఎక్కడా ఏర్పాటు చేయలేదు. 

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.