close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

ప్రధానాంశాలు

కంటోన్మెట్‌ బోర్డులో పార్టీల కసరత్తు

పట్టు సాధనలో కమలదళం
ఆధిపత్య ప్రదర్శనకు తెరాస ప్రయత్నం
సత్తా చాటేందుకు కాంగ్రెస్‌ యత్నం
ఈనాడు - హైదరాబాద్‌, న్యూస్‌టుడే, కంటోన్మెంట్‌

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికలు ఇప్పుడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకం కానున్నాయి. బలపడుతున్న భాజపాకు, ఆధిపత్యం ప్రదర్శిస్తున్న తెరాసకు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతుండడం ఆనవాయితీ. తెలంగాణలో అధికారం కోసం భాజపా, ఆధిపత్యాన్ని కొనసాగించాలని తెరాస పావులు కదుపుతోంది. దేశంలోనే అతి పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరిలో విజయం సాధించిన కాంగ్రెస్‌ కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సన్నాహకంగా కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికలని భావిస్తున్నాయి. 2020 జనవరి నాటికి సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పాలకమండలి గడువు ముగుస్తుంది. ఇదే నెలలో కొత్త బోర్డు ఏర్పడాలి. అందుకుగాను వచ్చే నెల రక్షణ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయనుంది. దేశంలో 62 కంటోన్మెంట్‌ బోర్డులుండగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు అతి పెద్దది. పుణె, కిర్కీ, వారణాసి కంటోన్మెంట్‌ బోర్డులకు పార్టీ గుర్తులపై ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా పార్టీ గుర్తులపై ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఇక్కడ రాజకీయ పార్టీల నాయకులు రక్షణ శాఖ అధికారులను కోరారు. బోర్డు ఏర్పడినప్పటి నుంచి ఆధిపత్యం కొనసాగించిన కాంగ్రెస్‌ తన పూర్వ వైభవాన్ని సాధించేలా కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన భాజపా.. లోక్‌సభ ఎన్నికల నాటికి బలం పుంజుకుంది. గతంలో ఎన్నడూ లేనివిదంగా నాలుగు లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోవడం.. కేంద్రంలో పూర్తి స్థాయి ఆధిపత్యం కొనసాగించడంతో ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా రెండో స్థానంలో నిలవడమే కాకుండా.. బోర్డు పరిధిలోని రెండు వార్డులు, ఒక్క మున్సిపల్‌ డివిజన్‌లో మొదటి స్థానంలో నిలిచింది.

పట్టు నిలుపుకొనే పనిలో కాంగ్రెస్‌..
కాంగ్రెస్‌ విషయానికి వస్తే గతంలో ఉన్న నాయకులు కనుమరుగయ్యారు. కొత్త నాయకత్వంపై దృష్టి పెట్టింది. మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డికి ఈ ఎన్నికలు సవాల్‌గా మారుతున్నాయి. పార్టీలోనూ.. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలోనూ తన పట్టు సాధించుకోడానికి ఈ ఎన్నికలను వేదిక చేసుకోవాలనుకుంటున్నారు. ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇక్కడ మూడో స్థానంలో కాంగ్రెస్‌ ఉంది. పూర్వ శక్తులను కూడగట్టుకోడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్‌ - భాజపా వైపు కొంతమంది చూస్తున్నట్టు తెలుస్తోంది. ఏ పార్టీ నుంచి బరిలోకి దిగాలనే సందిగ్ధావస్థలో ఉన్న వారిని ఒడిసి పట్టుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.

ఆధిక్యం ఇచ్చిన ఉత్సాహం
లోక్‌సభ ఎన్నికల నాటికి నగరంలో ఏకైక ఎస్సీ నియోజకవర్గమైన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో భాజపాకు ఓట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నియోజకవర్గంలో తెరాస మొదటి స్థానంలో నిలువగా, భాజపా రెండు, కాంగ్రెస్‌ మూడో స్థానాల్లో నిలిచాయి. ఐదు, ఆరు వార్డులతోపాటు నియోజకవర్గంలోనే ఏకైక మున్సిపల్‌ డివిజన్‌ అయిన మోండామార్కెట్‌ డివిజన్‌లో తెరాస, కాంగ్రెస్‌లను వెనక్కు నెట్టేసిన భాజపా.. ఏకంగా మొదటి స్థానంలోనే నిలవడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలిచిన భాజపాకు తెరాస పార్టీకి చెందిన ప్రస్తుత బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదో వార్డులో 5,255 ఓట్లురాగా, తెరాసకు 4,427 ఓట్లు వచ్చాయి. తెరాస పార్టీకే చెందిన కె.పాండుయాదవ్‌ బోర్డు సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరో వార్డులో భాజపాకు 5,100 ఓట్లు రాగా, తెరాసకు 4,329 ఓట్లు వచ్చాయి. తెరాస పార్టీకి చెందిన నళినికిరణ్‌ బోర్డు సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగో వార్డులో 3,256 ఓట్లు వచ్చి తెరాస మొదటి స్థానంలో నిలువగా, కేవలం 297 ఓట్ల స్వల్ప తేడాతో భాజపా రెండో స్థానంలో నిలిచింది. ఇలా ఆయా వార్డుల్లో భాజపాకు ఓటు బ్యాంకు గణనీయంగా పెరగడంతో బోర్డు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆ పార్టీ నేతలు రెట్టింపు ఉత్సాహంతో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపట్టారు. గతంలో ఆ పార్టీకి ఈ నియోజకవర్గంలో సుమారు 22 వేలకుపైగా సభ్యులుండగా, రెండు నెలలుగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో 8 వేల మందికిపైగా చేరినట్లు నేతలంటున్నారు.

మున్సిపల్‌ మంత్రి దృష్టి..
2015లో జరిగిన ఎన్నికల్లో మొత్తం ఎనిమిది వార్డుల్లో తెరాస మద్దతుదారులు నాలుగు చోట్ల విజయం సాధించారు. తర్వాత నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ తెరాస గూటికి చేరారు. ఇలా బోర్డులో తెరాసదే ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇటీవల బోర్డు సభ్యులతోపాటు ముఖ్య నాయకులతో మున్సిపల్‌ శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్‌ పరిధిలో అభివృద్ధికి కేంద్రం అడ్డంకిగా మారిందని దుయ్యబట్టారు. తెరాస ఇక్కడ విజయం సాధిస్తే మిగతా ప్రాంతాల మాదిరే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని.. ఈ దిశగా పార్టీ పని చేయాలని సూచించారు. కంటోన్మెంట్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే.. అక్కడే నివాసం ఉంటున్న మంత్రులు మల్లారెడి, తలసాని శ్రీనివాస యాదవ్‌ ఇలా పార్టీ బలాలను లెక్కలు వేసి.. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించేందుకు తెరాస సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.