close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

ఆర్టీసీకి నష్టం.. ప్రైవేటుకు పట్టం

డిమాండ్‌ మేరకు బస్సులు నడపని అధికారులు
ఆదాయం  వస్తుందని తెలిసినా.. మీనమేషాలెందుకో..?
ప్రత్యామ్నాయం చూసుకుంటున్న ప్రయాణికులు
ఈనాడు - హైదరాబాద్‌


  1. ఇక్కడ ఈ చిత్రంలో కనిపిస్తున్న మినీ బస్సులను గమనించండి. ఏదో డిపోను తలపిస్తోంది కదా.! అయితే ఆ వాహనాలు నిలిపిన స్థలం బస్సు డిపోది కాదు.. ఆ బస్సులు వి అంతకన్నా కావు. అవన్నీ ప్రైవేటు వాహనాలు. హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌లోని పార్కింగ్‌ స్థలంలో వీటిని ఇలా ఉంచారు. ఎంఎంటీఎస్‌ రాగానే ఒక్క క్షణం ఆలస్యం లేకుండా.. వారిని ఎక్కించుకొని పరుగులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న మినీ బస్సులు. హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌ పార్కింగ్‌ స్థలాన్ని బస్టాండ్‌గా మార్చేసి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ఇంతజరుగుతున్నా.. ఆర్టీసీ అధికారులు మాత్రం మాకెందుకులే అన్నట్లు వ్యహరిస్తుండటం గమనార్హం.

* ఎంఎంటీఎస్‌ ప్రయాణికులు దశాబ్దకాలంగా హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌లో రైళ్ల వేళలకు అనువుగా బస్సులు నడపాలని విజ్ఞప్తులు చేసినా ఆర్టీసీ అధికారులు పట్టించుకోలేదు. ఎట్టకేలకు స్పందించి.. 35 బస్సులను కేపీహెచ్‌బీ, హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌ వంతెన మీదుగా సైబరాబాద్‌కు నడుపుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్లో దిగే ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితి. మెట్రో షటిల్‌ పేరిట తిరుగుతున్న బస్సులు ఇప్పుడు హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌లో దిగే ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. రైలు దిగగానే ప్రయాణికులను ఎక్కించుకొని సొమ్ము చేసుకుంటున్నాయి. ఇదే పరిస్థితి హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌లోనూ నెలకొంది. ఈ రెండు స్టేషన్ల నుంచి ఆటోలు, ప్రైవేటు వాహనాలు గిరగిరా తిరుగుతూ ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్నాయి.

ప్రతి పావుగంటకు 2 వేల మంది
సైబరాబాద్‌లో 5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పని చేస్తున్నారని అంచనా. వీరిపై ఆధారపడి పలు సేవలందిస్తున్న వారు దాదాపు లక్ష మంది వరకు ఉంటారు. నగర శివార్లను కలుపుతూ.. అతి తక్కువ టిక్కెట్‌ ధరతో అందుబాటులో ఉండే ఎంఎంటీఎస్‌ సేవలకు మంచి ఆదరణ ఉంది. మెట్రో వచ్చినా.. ఆర్టీసీ బస్సులున్నా.. ఎంఎంటీఎస్‌ ప్రయాణికుల సంఖ్య తగ్గలేదు. ప్రతి రోజు 1.70 నుంచి 2 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అయితే హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్లో ఉదయం, సాయంత్రం వేళల్లో దిగుతున్న ప్రయాణికుల సంఖ్య ప్రతి పావుగంటకు 1500 నుంచి 2 వేల వరకు ఉంటుంది. అంటే వీరిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రతి పావు గంటకు 20 నుంచి 25 బస్సులు హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌నుంచి అందుబాటులో ఉండాలి. అలాగే హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్లో ప్రతి 3 నిమిషాలకు 500 మంది ప్రయాణికులు దిగుతున్నారు. ఇక్కడి నుంచి కూడా ప్రతి మూడు నిమిషాలకు 5 నుంచి 6 బస్సులుండాలి. ఇలాంటి పరిస్థితుల్లో హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్‌ను ఆర్టీసీ గ్రేటర్‌హైదరాబాద్‌ జోన్‌ పూర్తిగా గాలికి వదిలేసింది. హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌ నుంచి మాత్రం ప్రతి 10 నిమిషాలకో బస్సు నడుపుతున్నామని ప్రకటించినా.. ఆచరణలో విఫలమైంది.

తక్కువ దూరం..  ఎక్కువ ప్రయోజనం
ఆర్డినరీ ఆర్టీసీ బస్సు నుంచి అత్యాధునిక ఎలక్ట్రిక్‌ బస్సు వరకు దేనికీ జీపీఎస్‌(బస్సు ఎక్కడుందో చెప్పే విధానం) అందుబాటులో లేదు. దీంతో బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఎక్కడ ఉందో అంతు పట్టదు. సమయపాలన అస్సలు తెలియని పరిస్థితి. హైటెక్‌ సిటీ ఎంఎంటీఎస్‌, మెట్రో స్టేషన్ల నుంచి మైండ్‌ స్పేస్‌, బయోడైవర్సిటీ పార్కు, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు ఆర్టీసీ బస్సులు నడిపితే ప్రయాణికులకు వెసులుబాటుతోపాట సంస్థకు ఆదాయం చేకూరనుంది. కానీ, ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.