close

సోమవారం, అక్టోబర్ 21, 2019

ప్రధానాంశాలు

సవాళ్లు ఏవైనా.. సృజనాత్మక పరిష్కారం

దూసుకుపోతున్న అంకుర సంస్థలు
నగరాల అభివృద్ధిలో కీలక పాత్ర
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

ఇంట్లో పాడైన విద్యుత్‌, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలున్నాయా..  చెత్తలా బయట పడేయకండి.. ‘ఈ-వేస్ట్‌ ఎక్స్ఛేంజ్‌’ను సంప్రదించండి..

మనసుంటే మార్గమంటుంది.. అందులోనూ ఓ సమస్యపై దీక్షగా దృష్టి పెడితే సరికొత్త మార్గం దొరికి తీరుతుంది.. అలా ప్రస్తుత సమస్యలనే కాదు భవిష్యత్తు సవాళ్లను అంచనా వేసి వాటికి ఓ పరిష్కారం కనిపెట్టవచ్చు. ఇదే పంథాలో దూసుకుపోతున్నాయి అంకుర సంస్థలు. నగరాభివృద్ధికి అడ్డంకిగా మారిన సవాళ్లను ఎదుర్కొనేందుకు సృజనాత్మక ఆలోచనలతో ముందుకు వచ్చాయి కొన్ని అంకుర సంస్థలు. సమస్యలకు సృజనాత్మకతతో పరిష్కార మార్గాలను సూచించడంతో పాటు నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి చాలా సంస్థలు భాగ్యనగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు పేరుకుపోకుండా, వేడుకల్లో వ్యర్థాలను పునర్వినియోగించేలా, విద్యుత్‌ పొదుపు, నీటి వినియోగం తదితర అంశాలపై అనేక అంకుర సంస్థలు నగరంలో పని చేస్తున్నాయి. ఇలాంటి సంస్థలను ప్రోత్సహించేందుకు సిటీ ఫిక్స్‌ ల్యాబ్స్‌ ఇటీవలే పిచ్‌డే కార్యక్రమాన్ని నగరంలో ఏర్పాటుచేసింది. ఇందులో తమ కంపెనీ విధి విధానాలను ప్రదర్శించేందుకు 125 అంకుర సంస్థలు దరఖాస్తులు చేసుకోగా 10 సంస్థలు మాత్రమే ఎంపికయ్యాయి. నగర సమస్యలపై అత్యంత సృజనాత్మకంగా పనిచేయడంతో పాటు ప్రజలకు ఉపయోగపడేలా పనిచేస్తున్న కొన్ని సంస్థలు మోస్ట్‌ ఇన్నోవేషన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అవార్డులను గెలుచుకున్నాయి.

ఈ వేస్ట్‌ ఎక్స్ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌
ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల రీసైక్లింగ్‌ ప్రక్రియపై నగరంలో పనిచేస్తున్న ఈ-వేస్ట్‌ ఎక్స్ఛేంజ్‌ సంస్థ సిటీఫిక్స్‌ ల్యాబ్స్‌ కార్యక్రమానికి ఎంపికైంది. ప్లాస్టిక్‌, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతోంది. వీటితో ఏర్పడే పర్యావరణ కాలుష్యం అంతా ఇంతా కాదు.. ఇంట్లో ఉపయోగించే విద్యుత్‌ ఉపకరణాలు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు పాడైతే నిర్లక్ష్యంగా బయటపడేస్తాం. అవి భూమిలో కలవక కూడా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోంది. దీనికి చెక్‌ పెట్టేందుకు ముందుకు వచ్చింది సాన్‌షోదన్‌ ఈ వేస్ట్‌ ఎక్స్ఛేంజ్‌ అంకుర సంస్థ. నగర వాసులనుంచి ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌ యూనిట్లకు తరలించే కార్యక్రమాన్ని భుజాన వేసుకుంది. కొన్నాళ్లుగా వెబ్‌సైట్‌ ద్వారా నగరవాసుల నుంచి ఇ-వ్యర్థాలను సేకరిస్తోంది. అందుకు తగిన రుసుమును చెల్లిస్తోంది. ఇ-వ్యర్థాలను ఊరికే బయటపడేయకుండా.. ఎంతో కొంత సొమ్ము వస్తుంది కదా అని నగరవాసులు చాలా మంది ఈ వెబ్‌సైట్‌లో తమ వ్యర్థాలను అమ్మేస్తున్నారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌(డీఐపీపీ) గుర్తింపు ఈ సంస్థకు లభించింది. 2018లో స్మార్ట్‌ ఫిఫ్టీ అవార్డు, హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజ్‌ అసోసియేషన్‌ అవార్డు, స్వచ్ఛ భారత్‌ గ్రాండ్‌ ఛాలెంజ్‌ అవార్డులను దక్కించుకుంది.

ప్రతీ చుక్కకు లెక్క...
నీటిని వృథాగా పోనివ్వకుండా ఒడిసిపట్టేందుకే సరికొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చింది విఘాట్‌ యుటిలిటీస్‌. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో ఈ సంస్థ తన ఆవిష్కరణతో ప్రతీ నీటిచుక్కను ఒడిసిపడుతోంది. ఐఓటీ సాంకేతికతతో రూపొందించిన వెన్‌ఆక్వా పరికరం ద్వారా నీటి వినియోగాన్ని లెక్కిస్తున్నారు. నీటి లీకేజీని కూడా ముందే పసిగట్టి అలారం మోగడం ఈ పరికరం ప్రత్యేకత. ఉచితంగా ఈ పరికరాన్ని అందించి సాంకేతిక సహాయం కోసం కొద్ది మొత్తంలో ఛార్జీ వసూలు చేస్తుంది. నీటి మీటర్లు ఓ రకంగా ఇదే పని చేస్తున్నాయ్‌ కదా అని సందేహం రావచ్చు. దాంతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన ప్రత్యేకతలున్నాయని తెలుపుతున్నారు విఘాట్‌ ప్రతినిధులు. హైదరాబాద్‌ నగరంలో ప్రముఖ నివాస సముదాయాలైన అపర్ణ, అశోకా, హైహోమ్‌ తదితర నివాస సముదాయాల్లో ఈ సంస్థకు పెద్ద సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

మీకు తెలుసా??
*  ఈపీటీఆర్‌ఐ (ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ట్రైనింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌) నివేదిక ప్రకారం
నగరంలో  వెలువడుతున్న  ఈ- వ్యర్థాలు ఇలా..
*  2009లోనే 3,263 మెట్రిక్‌ టన్నులు.. 2021-22 నాటికి 50,330 మెట్రిక్‌ టన్నులకు చేరుతుందని అంచనా.
*  హెచ్‌ఎండీఏ పరిధిలో 2016-17లో 28,749.. ఈ ఆర్థిక సంవత్సరంలో 40,230 మెట్రిక్‌ టన్నులకు చేరుతుందని అంచనా.
హసీరుదలా సంస్థలో పనిచేస్తున్న కార్మికులు
ఉపాధితో పాటు వ్యర్థాల నిర్వహణ
నగరంలో చెత్త ఏరుకుని జీవించే కుటుంబాలు అనేకం ఉన్నాయి. వారికి జీవనోపాధి కల్పిస్తూనే నగరాన్ని స్వచ్ఛంగా తయారుచేయడం, పునరుత్పాదక ఉత్పత్తులతో వ్యర్థాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది హసీరుదలా సంస్థ. వ్యర్థాల నిర్వహణలో భాగంగా.. చెత్తను సేకరించేవారితో పని చేసేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చింది. వారికి జీవనోపాధి కల్పించడంతో పాటు వ్యర్థాలను రీసైక్లింగ్‌ యూనిట్లకు తరలించే కార్యక్రమం చేపట్టింది. చెత్తను సేకరించేవారికి మార్కెట్‌ ధర కంటే ఎక్కువగానే చెల్లిస్తూ బాసటగా నిలుస్తోంది. రోజుకు రూ.600 నుంచి రూ.750 చెల్లిస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ శేఖర్‌ ప్రభాకర్‌ తెలిపారు. పెళ్లిళ్లు, సంగీత వేడుకలు, ఐపీఎల్‌ మ్యాచ్‌ తదితర కార్యక్రమాలు జరిగేచోట వీరి ద్వారా చెత్తను సేకరించి రీసైక్లింగ్‌ యూనిట్లకు సరఫరా చేస్తున్నారు. చెత్తను సేకరించే క్రమంలోనూ కొన్ని పద్ధతులను పాటిస్తుందీ సంస్థ. 100 నుంచి 30,000 మంది హాజరయ్యే ఏ వేడుకైనా సరే ఆ కార్యక్రమ నిర్వాహకులను ముందుగా సంప్రదిస్తారు. వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తికాకుండా ముందుగానే వారికి సలహాలు, సూచనలు అందిస్తారు.  ఈ సంస్థ ఇప్పటిదాకా మొత్తం చెత్త సేకరించే 4,000మందికి పని కల్పించింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.