close

మంగళవారం, అక్టోబర్ 15, 2019

ప్రధానాంశాలు

‘బడి’కి జ్వరమొచ్చింది

జ్వరాల తీవ్రతతో పాఠశాలల్లో తగ్గిన హాజరు శాతం
వ్యాధులకు కారణమవుతున్న అపరిశుభ్రత
జగిత్యాల పట్టణం, మెట్‌పల్లి పట్టణం, న్యూస్‌టుడే

తీవ్రజ్వరంతో మంచానికే పరిమితమైన ఈ విద్యార్థి అభిషేక్‌. నూతన ఉన్నత పాఠశాలలో 7వతరగతి చదువుతున్నాడు. గత వారం నుంచి విషజ్వరం బారినపడ్డాడు. నిత్యం ఆసుపత్రి వెళ్లి వైద్యుడిని సంప్రదిస్తూ మందులు వాడుతున్నా జ్వరం నయం కావడంలేదు. ఇప్పటి వరకు బాలుడి చికిత్స కోసం తల్లిదండ్రులు రూ.10 వేలు ఖర్చు చేశారు. అభిషేక్‌ తల్లి బీడీలు చుడుతూ ఉండగా తండ్రి మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

మెట్‌పల్లి చావిడి ప్రాంతం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆరో తరగతి విద్యార్థులు వీరు. తరగతిలో మొత్తం 18 మంది విద్యార్థులకు కేవలం 8 మంది మాత్రమే గురువారం హాజరయ్యారు. మిగిలిన పది మంది బాలలు జ్వరంతో బాధపడుతున్నారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కలిపి ఈ పాఠశాలలో 113 మంది విద్యార్థులుంటే ఇందులో 84 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ పాఠశాలలో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు జ్వరంతో మంచం పట్టారు.

పై రెండు ఉదంతాలు జిల్లా వ్యాప్తంగా జ్వరాల తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఇంట్లో చూసినా జ్వరపీడితులే ఉన్నారు. వైరల్‌ జ్వరాలే జనాన్ని అధికంగా పీడిస్తున్నాయి. గత నెల రోజులుగా జిల్లాను వణికిస్తున్న జ్వరాలతో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం గణనీయంగా తగ్గింది. ఏ పాఠశాలను పరిశీలించినా 20 నుంచి 30 శాతం విద్యార్థులు జ్వరాలతో ఇంటిపట్టునే ఉంటున్నారు. జిల్లావ్యాప్తంగా 509 ప్రాథమిక, 85 ప్రాథమికోన్నత, 187 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇవికాకుండా మరో 354 వివిధ రకాల పాఠశాలలు, కస్తూర్బా, గురుకులాలున్నాయి. మొత్తం 54,898 మంది విద్యార్థులున్నారు. ఆగస్టులో హాజరుమాసోత్సవంతో విద్యార్థుల హాజరుశాతంలో కొంత పురోగతి కనిపించినా ఇదే నెల చివరి నుంచి జ్వరాలు విజృంభించాయి. దీంతో అన్ని పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులాల్లో విద్యార్థులు జ్వరాల బారినపడి ఇంటికి వెళ్లి చికిత్స పొందుతున్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లోనూ జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులున్నారు. ఎంతకూ తగ్గని జ్వరాలతో విద్యార్థులు బడికి దూరమవుతున్నారు. ‘న్యూస్‌టుడే’ గురువారం మెట్‌పల్లి, రాయికల్‌ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించగా విద్యార్థులు పరిమితంగా హాజరైన దృశ్యాలు కనిపించాయి.

అపరిశుభ్రతా కారణమే..
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపించడంతోపాటు పాఠశాలల్లో నెలకొన్న అపరిశుభ్ర పరిసరాలు విద్యార్థులు జ్వరాల బారినపడటానికి కారణమవుతున్నాయి. పాఠశాలల చుట్టూ పిచ్చిమొక్కలు పెరగడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. మరుగుదొడ్లు, మూత్రశాలల వద్ద నీరు నిలిచి దుర్గంధం వ్యాపిస్తుండటంతో ఇది దోమలకు నిలయంగా మారుతోంది. భోజనానంతరం విద్యార్థులు ప్లేట్లు కడిగే ప్రదేశంలోనూ బురద నీటి గుంతలుండటంతో వివిధ రకాల దోమలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు పలు పాఠశాలల్లో ప్రహరీ లేక పందులు సంచరిస్తున్నాయి. ఇలాంటి అపరిశుభ్రత వాతావరణంలో పిల్లలు తిరిగితే వివిధ రకాల జ్వరాల బారిన పడక తప్పడంలేదని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మెట్‌పల్లిలో బడులు అధ్వానం..
* స్థానిక ఇందిరానగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 146 మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాలలో నిత్యం 30 మంది విద్యార్థులు జ్వరాలతో హాజరుకావడంలేదు. పాఠశాల వెనుక భాగాన పురాతన కోనేరు ఉండటంతో ఎప్పటి నుంచో నిలువ ఉన్న నీటిలో నాచు పేరుకుపోయి చెత్తాచెదారం నిండి ఉంది. చూట్టు పిచ్చిమొక్కలు సైతం పెరిగాయి. ఇలాంటి వాతావరణంలో దోమలు పెరగడం సహజమే. పురపాలక సంఘానికి సమీపంలో ఉన్న పాఠశాలలో అధికారులు కనీస పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
* స్థానిక బీజేెకాలనీ ప్రాథమిక పాఠశాలలో మొత్తం 69 మంది విద్యార్థులున్నారు. పాఠశాల చుట్టూ మురుగుకాల్వలే దర్శనమిస్తున్నాయి. పట్టణంలోని మురుగునీరంతా ఈకాల్వలోకి రావడంతో పాటు కాల్వ నిర్మాణం లేక ఇలా అధ్వానంగా మారింది. అవతలి వైపు ఉన్న విద్యార్థులు మురుగుకాల్వ దాటుకుంటూ రావాల్సిందే. నిత్యం విద్యార్థులు దోమల బారినపడి వ్యాధులు కొనితెచ్చుకుంటున్నారు. కేవలం ఈ పాఠశాలలే కాకుండా పట్టణంలో ఏ ప్రభుత్వ పాఠశాలను కదిలించినా జ్వరాలతో పాఠశాలకు రాని విద్యార్థులే ఉంటారు.
పాఠశాలల్లో పరిశుభ్రతకు చర్యలు

చేపడుతున్నాం - వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖాధికారి
అన్ని పాఠశాలల్లోనూ వారంలో ఓ రోజు స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం చేపట్టాలనే ఆదేశాలున్నాయి. పరిసరాల పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్రంగా కడుక్కోవడంపై అవగాహన చేపడుతున్నాం. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పాఠశాలల్లో అన్ని చర్యలు తీసుకోవాలని సూచనలందించాం.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.