close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

మీకు మీరే.. కావొద్దు భారం

వేధిస్తున్న ఊబకాయం
తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమవుతున్న సమస్య
జీవనశైలి, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం
నిర్లక్ష్యం చేస్తే.. పలు వ్యాధులకు ఆస్కారం
ఈనాడు, హైదరాబాద్‌

ఏంటీ...ఈ మధ్య కాస్త ఒళ్లు చేశావ్‌.. బుగ్గలు, పొట్ట పెంచావ్‌... ఇలా ఎవరైనా అనగానే ప్రశంస అనుకుంటే పొరపాటే. అది మీలో పెరుగుతున్న అనారోగ్య సమస్యకు సంకేతంగా భావించండి. ఊబకాయానికి దారి తీసే తొలి మెట్టు అదే. ఆహారపు అలవాట్లు.. జీవనశైలిలో మార్పులతో తెలుగు రాష్ట్రాల్లో ఇది తీవ్ర సమస్యగా మారుతోంది.

జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) అధ్యయనం ప్రకారం గ్రామీణ ప్రాంతాల జనాభాతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో ఉండే వారిలో ఎక్కువ శాతం మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి వ్యక్తికి వయసుకు తగ్గట్టుగా బరువు ఉండాలి. అంతకంటే కిలో పెరిగినా అది అధికమే. ఇది ఊబకాయానికి దారి తీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రాథమిక స్థాయిలోనే దీనికి అడ్డుకట్ట వేయడం ముఖ్యం. నిర్లక్ష్యం చేస్తే...తర్వాత తగ్గించుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ. వ్యాయామం చేయడం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా కొంతవరకు నియంత్రించవచ్చు. అయితే 70 కిలోలు ఉండాల్సిన వ్యక్తి 100-120 కిలోలకు చేరితే ఈ జాగ్రత్తల వల్ల ప్రయోజనం లేదు. మహా అయితే 4-5 కిలోలు బరువు తగ్గడానికి మాత్రమే దోహదం చేస్తుందని చెబుతున్నారు. ఊబకాయ దశకు చేరక ముందే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

అన్ని జబ్బులకు..అదే ‘మూలం’

బకాయం వల్ల అధిక రక్తపోటు, వివిధ రకాల క్యాన్సర్లు  వస్తాయి. మహిళల్లో రొమ్ము, అండాశయ క్యాన్సర్లకు ఒబెసిటీ ఓ కారణం. దీనిని నియంత్రించడం వల్ల ఎన్నో రోగాలకు పరిష్కారం దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు. యాంత్రిక జీవనం, శారీరక శ్రమ తగ్గడం, అధిక కేలరీలున్న ఆహారం కొన్ని కారణాలు. చిన్నప్పటి నుంచి వ్యాయామం ఉండటం లేదు. హైదరాబాద్‌ లాంటి చోట్ల 60 శాతం పాఠశాలల్లో ఆటస్థలాలే లేవు. చాలా మేరకు ర్యాంకుల చదువుకే ప్రాధాన్యం ఇస్తున్నాయి.

బయటి తిండికే మొగ్గు...

భార్యాభర్తలు ఉద్యోగాలు చేయడం.. మారుతున్న జీవనశైలితో పట్టణాల్లో చాలా కుటుంబాలు వారానికి 2-3 సార్లు బయట తిండికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. హోటల్‌ నిర్వాహకులు పదార్థాల్లో రుచి కోసం అధిక శాతం నూనెలు, చక్కెర ఇతర పదార్థాలు వినియోగిస్తుంటారు. కేలరీలు కూడా ఎక్కువ. ఒక పెద్ద సమోసాలో 120-150 గ్రాములు, 650 మిల్లీ లీటర్ల కోలాలో 120 వరకు కేలరీల శక్తి ఉంటుంది. తిన్న తర్వాత ఎలాంటి శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఇవన్నీ శరీరంలోని వివిధ ప్రాంతాల్లో పేరుకుపోతాయి. పొట్ట, పిరుదులు, భుజాలు వద్ద కొవ్వు ఏర్పడి ఊబకాయానికి దారి తీస్తుంది.

నగరంలో నెలకు 100-150 శస్త్ర చికిత్సలు

పౌరుల్లో క్రమేణా ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. ఊబకాయులు బరువు తగ్గించుకునేందుకు అన్ని పద్ధతులు పాటించి..తదుపరి ప్రత్యామ్నాయంగా శస్త్ర చికిత్సలు ఎంచుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో పెరుగుతున్న బేరియాట్రిక్‌ సర్జరీలు ఇందుకు నిదర్శనం. గతంలో అన్ని ఆసుపత్రులలో కలిపి నెలకు 60-70 జరిగేవి. ప్రసుత్తం ఆ సంఖ్య 100-150. ఆరేడేళ్ల క్రితం నెలకు ఒకటి అరా సర్జరీలు అవ్వడమే గొప్ప విషయం. తెలుగురాష్ట్రాల్లో చాలా ప్రైవేటు ఆసుపత్రులు బరువు తగ్గే శస్త్ర చికిత్సల కోసం ప్రత్యేక విభాగాలు నెలకొల్పుతున్నాయి.

నడుం చుట్టుకొలతతో ఇబ్బందే...

బకాయుల్లో నడుం చుట్టుకొలత తెలియకుండానే పెరిగిపోతుంది. పురుషుల్లో 90, స్త్రీలలో 80 సెం.మీ కంటే ఎక్కువ దాటితే గుండెపోటుకు, మధుమేహానికి దారి తీస్తుంది. ఇవి ప్రమాదకరమైన సంకేతాలు. మీ నడుము కొలతల్లో మునుపటితో పోల్చితే ఏ మాత్రం తేడా కనిపించినా అప్రమత్తం కావాల్సిందే.

యోగాతో చెక్‌ ఇలా..

యోగాతో పలు శారీరక, మానసిక సమస్యలకు ఉపశమనం దొరుకుతుంది.   కొన్ని కీలకమైన ప్రక్రియలతో ఊబకాయానికి కూడా చెక్‌ పెట్టవచ్చునని హైదరాబాద్‌లోని యోగా నిపుణులు అరుణాదేవి తెలిపారు. అగ్నిసార క్రియ సహా  పవన ముక్తాసనం, నౌకాసనం, కపాలభాతి ప్రాణాయామం వంటివి ఉపయుక్తంగా ఉంటాయన్నారు.

అగ్నిసార.. ఓ ప్రక్రియ..

జ్రాసనంలో కూర్చొని లేదా నిలబడి కొంచెం ముందుకు వంగి చేయాలి. పూర్తిగా శ్వాసను బయటకు వదిలివేసి పొట్టను వెనుకకు, ముందుకు కదిలించాలి. ఈ స్థితిలో శ్వాస తీసుకోవడం, వదలడం చేయకూడదు. పొట్టని ఎంతసేపు కదిలించ గలిగితే అంతసేపు చేయాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. 3సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకొని వదలాలి. తిరిగి ఇలాగే నాలుగైదుసార్లు చేయాలి. ఈ క్రియ చేసేటప్పుడు పొట్టను మాత్రమే కదిలించాలి. భుజాలను ఊపరాదు.

చిన్న చిన్న పనులకు కార్లు, బైక్‌లు వాడడం సరికాదు. తక్కువ దూరాలకు నడవడం మేలు. ప్రతి పనిలో వ్యాయామం ఉండేలా చూసుకోవాలి.


విదేశాల్లో మాదిరిగా ప్రతి ఆహార ప్యాకింగ్‌పై కేలరీల విలువ తప్పనిసరిగా రాయాలి.


ప్రభుత్వ కార్యాలయాల్లోనూ 10-15 నిమిషాలు యోగా లేదా ఇతర వ్యాయామాలు చేయడం మంచిదే.  ఉద్యోగుల్లో పనితీరు మెరుగవుతుంది.
పాఠశాలల్లో కచ్చితంగా యోగా, వ్యాయామ విద్యకు అవకాశం కల్పించాలి.

బఫేల జోలికి వెళ్లొద్దు. తినాలని లేకపోయినా.. రుచులు చూసేందుకంటూ ఒకే రోజు  అధికంగా తినేస్తారు.

210 కిలోల నుంచి 85 కిలోలకు...

రెండు ఫొటోల్లో కనిపిస్తున్న వ్యక్తి ఒక్కరే అంటే నమ్మగలరా...కానీ ఇది వాస్తవం. హైదరాబాద్‌కి చెందిన సమయుద్దీన్‌ బరువు ఒకప్పుడు 210 కిలోలు. తన శరీరమే తనకు భారం. తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. ఊబకాయంతో ఆరోగ్యం అల్లకల్లోలమైంది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. తీవ్రమైన మోకాళ్ల నొప్పులు. కంటి మీద కునుకు లేని రాత్రులు ఎన్నో. అధిక రక్తపోటు, మధుమేహం సరేసరి. ఈ నేపథ్యంలో బరువు తగ్గడం ఒక్కటే తన ముందున్న అవకాశంగా సమయుద్దీన్‌ గట్టిగా నిర్ణయించుకున్నారు. 60వ పడిలో ఉన్నాసరే పట్టుదల వీడలేదు. అతని ఆశయానికి కుటుంబ సభ్యులు తోడు నిలిచారు. 2016 ఏప్రిల్‌లో సమయుద్దీన్‌ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. విజయవంతమైంది. కొన్ని రోజుల తర్వాత నుంచి బరువు తగ్గడం ప్రారంభమైంది. 6-8 నెలల్లో దాదాపు 125 కేజీల బరువు తగ్గారు. ఊబకాయం తగ్గడంతో ఇతర  సమస్యలు సమసిపోయాయి. మధుమేహం, అధిక రక్తపోటు నియంత్రణలోకి వచ్చాయి. ‘‘కాస్త ఎక్కువగా కొవ్వులు ఉన్నవి తప్ప అన్ని రకాల ఆహారం మితంగా తీసుకుంటున్నా. రోజూ గంటపాటు వ్యాయామం చేస్తా.’’ అ న్నారు.

చిన్నారుల్లో ఎక్కువే...

30 శాతం పాఠశాలల విద్యార్థుల మధ్యాహ్న భోజన డబ్బాల్లో జంక్‌పుడ్స్‌ ఉంటున్నాయి. ఉదయమే తాజాగా ఆహారం వండి పెట్టే ఓపిక లేక కేక్‌లు, బన్‌, చిప్స్‌ వంటివి పెట్టి పంపుతున్నారు. దీంతో అనవసర కొవ్వులు పెరిగిపోతున్నాయి.

తొలుత సాధారణ పద్ధతుల్లో...

బరువు తగ్గడానికి చిత్తశుద్ధితో నిరంతరం యత్నించాలి.
మద్యపానం, బయట తిండి తగ్గించాలి. అనారోగ్య  సమస్యలుంటే గుర్తించాలి.
అన్ని శాస్త్రీయ మార్గాలను పరిశీలించిన తర్వాతే ప్రత్యామ్నాయాలు  అనుసరించాలి.
బేరియాట్రిక్‌ చికిత్సకు అనుభవం ఉన్న సర్జన్‌, మంచి ఆసుపత్రి ముఖ్యం.
సాధారణ ప్రక్రియలో బరువు తగ్గడం విఫలమైనప్పుడే దీనిని ఎంచుకోవాలి.
శస్త్ర చికిత్సతో అంతా అయిపోయినట్లు కాదు. ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. అప్పుడే తిరిగి  పెరగకుండా ఉంటారు.

వాణిజ్య ప్రకటనల్లో చూపించినట్లు దగ్గర దారుల్లో(షార్ట్‌కట్‌) బరువు తగ్గిస్తామనడం నిజం కాదు.

భోజనం పళ్లెంలో ఇవి తప్పనిసరి.. 
డాక్టర్‌ లక్ష్మయ్య, జాతీయ పోషకాహార సంస్థ

ప్రధానంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పళ్లెంలోని నాలుగు భాగాల్లో.. ఒక దానిలో చిరు ధాన్యాలతో చేసిన ఆహారం, మరో భాగంలో మాంసం, చేపలు లాంటి మాంసకృత్తులు పోగా.. రెండు వంతుల్లో పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. అంటే ఒక రోజు మొత్తంలో 400 గ్రా. పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, 60-70 గ్రా. చిరుధాన్యాలతో చేసిన పదార్థాలు, 100-125 గ్రా. చేపలు, మాంసం తీసుకోవాలి. మరో 240 గ్రా.పాల ఉత్పత్తులు తీసుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు నియంత్రణలో ఉంచుకొని ఆహార జాగ్రత్తలు పాటించాలి.

 సంప్రదాయ విధానాల్లో తగ్గకపోతే..!
- డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌, బేరియాట్రిక్‌ సర్జరీ నిపుణులు

* బరువు నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలి. అయినా వీలు కాకపోతే శస్త్ర చికిత్స మంచిదే. తక్కువ బరువు ఉన్నవారు వ్యాయామం, ఆహార అలవాట్లలో మార్పు వంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు.
* 100-120 కేజీలకు చేరితే సాధారణ పద్ధతులు ఫలితాలు ఇవ్వవు. బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకోవచ్చు. 99 శాతం సక్సెస్‌ రేటు ఉంది. దీని వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, గురక లాంటివి నియంత్రణలోకి వస్తాయి. మహిళలకు పీసీవోడీ తగ్గి సంతానం కలుగుతుంది.
* సర్జరీ తర్వాత ఎక్కువ ఆహారం తీసుకోలేరు. దీంతో శరీరానికి విటమిన్ల, ప్రొటీన్ల కొరత ఏర్పడుతుంది.వాటిని సప్లిమెంట్స్‌ రూపంలో బయట నుంచి అందించాలి. ఏడాదిపాటు వీటిని వాడాలి. 3-4 నెలల పాటు ప్రొటీన్లు తీసుకోవాలి. పౌడరు, బిస్కెట్లు, చాక్లెట్‌ రూపంలో ఇవి అందుబాటులో ఉంటాయి. ఇక సర్జరీతో వచ్చే సమస్యలు చాలా తక్కువ. అవి 0.1 నుంచి 0.5 శాతమే.

 ప్రకృతి వైద్యంతో చక్కటి ఫలితాలు
- డాక్టర్‌ ఎస్‌.భవాని, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ ప్రకృతి వైద్య నిలయం, అమీర్‌పేట

బకాయానికి ప్రకృతి చికిత్సాలయంలో చక్కటి వైద్యం  ఉంది.  సూర్య, అమృత ఆహార విధానాలతో ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయట పడే అవకాశముంది. సూర్యుడి గమనానికి అనుగుణంగా జీవనశైలిని మార్చుకోవాలి.  ఊబకాయంతో బాధపడే వారికి  తొలుత కౌన్సెలింగ్‌ ఇస్తాం. ఉపవాస చికిత్సలు, లివర్‌, కిడ్నీ ప్యాక్స్‌, మర్దన ప్రక్రియ, స్వేద క్రియ, తొట్టి స్నానం, మట్టిపూత వంటివి చక్కటి ఫలితాలు ఇస్తాయి. అధిక బరువున్న వారు ఈ చికిత్సా విధానంలో మొదటి నెలలో 4 కిలోలు తగ్గే వీలుంటుంది. తరువాత నెలకు 2 కిలోల చొప్పున బరువు తగ్గించవచ్చు.
-న్యూస్‌టుడే, అమీర్‌పేట

ఆయుర్వేదంలోనూ చికిత్స...
-డాక్టర్‌ ఉమా శ్రీనివాసరావు, కాయ చికిత్స విభాగం, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల

ధిక బరువుని ఆయుర్వేదంలో స్థౌల్య వ్యాధిగా పేర్కొంటారు. వీరికి  తొందరగా జీర్ణం కాని, తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఇవ్వాలి. కొన్ని రకాల ఔషధ చూర్ణాలతో ఉద్వర్తనం (నలుగు పెట్టడం) చేయాలి. పంచకర్మ విధానమైన నిరూహవస్తి ద్వారా చికిత్స చేయవచ్చు. విడంగాలు, పిప్పళ్లు, హరితకీ, విభతకీ, తదితర ఔషధాలు వైద్యుల సలహా మేరకు వాడాలి.
-న్యూస్‌టుడే, వెంగళ్‌రావునగర్‌

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.