close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

సేవా రథం.. రాయితీ పథం

రైళ్లలో ప్రయాణానికి పలు వర్గాలకు వర్తింపు

దేశవ్యాప్తంగా ఒకే విధానం

లబ్ధి పొందాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి

మణుగూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే

దేశంలో ఒక ప్రాంత ప్రజలను మరో ప్రాంత ప్రజలతో కలిపే ఏకైక రవాణా సాధనం రైళ్లు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పలు ప్రాంతాలవారు రైళ్లలో నిత్యం ప్రయాణం సాగిస్తుంటారు. కొందరు ఉపాధి కోసం, ఇంకొందరు చదువు కోసం.. మరికొందరు వైద్యం కోసం ప్రయాణిస్తుంటారు.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు రైల్వే లైన్లున్నాయి. అతి చౌక అయిన, భద్రత, సకల సౌకర్యాలతో కూడిన ప్రయాణం ఈ విభాగం సొంతం. సేవా రంగానికి చెందిన రైల్వే శాఖ పలు వర్గాలకు ప్రయాణ ఛార్జీల్లో రాయితీలను అందిస్తోంది. నిజానికి కొన్ని సందర్భాల్లో అది కల్పించే వెసులుబాట్లపై అవగాహన తక్కువగా ఉంటుంది. శారీరక వైకల్య బాధితులు, విద్యార్థులు, ముఖాముఖీలకు హాజరయ్యేవారు, రోగులు ఇలా పలు వర్గాల వారికి ఈ శాఖ ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం రైల్వే బుకింగ్‌ కౌంటర్‌లో చూపించి ఈ రాయితీ టికెట్లు పొందే వీలుంటుంది. ఏఏ సందర్భాల్లో వీటిని అందిస్తారు? అలాంటి ప్రయాణాలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం..

ఒకే మార్గంలో ప్రయాణించే వారు

ఎవరైనా ఒకే రూట్‌లో నిత్యం ప్రయాణించే వారు పక్షం రోజుల ఛార్జీలతో నెల రోజుల ప్రయాణం చేయొచ్ఛు వీటినే సీజనల్‌ టికెట్‌ అంటారు. 160 కిలోమీటర్ల లోపు ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోని జనరల్‌ బోగిల్లో రాయితీపై ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. పాస్‌లు నెల వ్యవధికి జారీ చేస్తారు. సూపర్‌ఫాస్ట్‌ రైళ్లలో ప్రయాణించాల్సి వస్తే అదనంగా సర్‌ఛార్జి టికెట్‌ కొనుగోలు చేయాలి. ఈ టికెట్లను స్థానిక రైల్వే స్టేషన్‌ బుకింగ్‌ కార్యాలయంలోనే క్షణంలో పొందే వీలుంటుంది.

క్రీడాకారులకు రైల్వే ప్రోత్సాహం

అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి టోర్నీల్లో పాల్గొనే క్రీడాకారులకు 75శాతం రాయితీతో కూడిన సాధారణ, రిజర్వేషన్‌, ఫస్ట్‌క్లాసు తరగతుల్లో టికెట్లు జారీ చేస్తారు. పర్వతారోహణ చేసే వారు కూడా రాయితీ టికెట్లు పొందొచ్ఛు సామాజిక, సాంస్కృతిక, విద్యా, వైద్య రంగాల్లో అఖిల భారత సదస్సులకు హాజరయ్యే ప్రముఖులు, వైద్యులకు 25శాతం రాయితీ లభిస్తుంది. దీనికీ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి.

వ్యాధులతో బాధపడేవారు..

క్యాన్సర్‌ రోగులు తరచూ చికిత్స నిమిత్తం ప్రయాణిస్తుంటారు. రైలు స్థాయిని బట్టి 50-100 శాతం రాయితీ కల్పిస్తారు. వారి సహాయకులకూ ఇదే వర్తిస్తుంది. తలసేమియా, కిడ్నీ, గుండె శస్త్రచికిత్సలకు వెళ్లేవారు 50శాతం రాయితీ టికెట్లు పొందవచ్ఛు చికిత్స కోసం వెళ్లే కుష్టు, హెచ్‌ఐవీ, ఎనిమియా, టీబీ బాధితులకు 50-75 శాతం రాయితీపై టికెట్లు పొందొచ్ఛు.

ప్రభుత్వ ఉద్యోగ ముఖాముఖీలకు వెళ్లేవారు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ముఖాముఖీలకు వెళ్లే నిరుద్యోగ యువతీ, యువకులకు జనరల్‌ బోగీల్లో ప్రయాణించేందుకు ఉచిత టికెట్లు జారీ చేస్తారు. రిజర్వేషన్‌ బోగీల్లో ప్రయాణించాలంటే 50శాతం ఛార్జి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు పూర్తి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.

కార్మికులు, కళాకారులు

కూరగాయల విక్రేతలు, ఇళ్లలో పాచిపనులు చేసేవారు, భవన నిర్మాణ రంగం, వ్యవసాయ కార్మికులకు 100 కిలోమీటర్ల లోపు ప్రయాణించాలంటే అతి తక్కువ ధరకే సీజన్‌ టికెట్లు జారీ చేస్తారు. దీనికి ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి. కళాకారులకు జనరల్‌, స్లీపర్‌ క్లాసులో 75శాతం, ఫస్ట్‌క్లాస్‌, ఏసీ చైర్‌కార్‌లో 50శాతం, సినీ సాంకేతిక నిపుణులు విధుల్లో ప్రయాణించే వారికి స్లీపర్‌ క్లాసులో 75శాతం, ఫస్ట్‌క్లాస్‌ ఏసీలో 50 శాతం రాయితీతో ప్రయాణించే వెసులుబాటు కలుగుతుంది.

విద్యార్థులకు ఉచిత పాస్‌లు

ఇంటర్‌లోపు చదివే విద్యార్థులు తమ నివాస ప్రాంతం నుంచి వేరే ప్రాంతంలోని కళాశాలకు వెళ్లి వచ్చేందుకు ప్యాసింజర్‌ రైలులో ఉచితంగా ప్రయాణించొచ్ఛు బుకింగ్‌ కౌంటర్‌లో దరఖాస్తు, జిరాక్స్‌ ధ్రువీకరణ పత్రాలు జతచేసి, కళాశాల ప్రధానోపాధ్యాయుడితో అటెస్టేషన్‌ చేయించి సమరిస్తే ఉచిత పాసులు జారీ చేస్తారు.

* డిగ్రీ విద్యార్థి రాయితీతో కూడిన రైల్వే పాసు పొందేందుకు విద్యాసంస్థ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ప్యాసింజర్‌ రైళ్లలో 150 కిలోమీటర్ల వ్యవధిలోనే ప్రయాణించే అవకాశం ఉంటుంది. మూడు మాసాల వ్యవధితో కూడిన పాస్‌ పొందాలనుకుంటే మరింత చౌకగా జారీ చేస్తారు.

జర్నలిస్టులకు 50 శాతం రాయితీ టికెట్లు

జర్నలిస్టులకు 50శాతంతో కూడిన రైల్వే టికెట్లను జారీ చేస్తారు. వారు పనిచేసే పత్రిక సంస్థ ధ్రువీకరణ పత్రాన్ని, జిల్లా పౌర సంబంధాల అధికారి ధ్రువీకరించిన అక్రిడేషన్‌ కార్డును రైల్వే బుకింగ్‌ కౌంటర్‌లో చూపిస్తే రైల్వే గుర్తింపు కార్డు జారీ చేస్తారు. ఏడాది పొడవునా ఎన్నిసార్లైనా ఇందులో ప్రయాణించవచ్ఛు భార్య, 18ఏళ్ల లోపు ఇద్దరు ప్లిలలకు మాత్రం ఏడాదికి రెండుసార్లు రాయితీతో ప్రయాణించే అవకాశం ఉంటుంది.

దివ్యాంగులకు రాయితీ టికెట్లు

శారీరక, మానసిక దివ్యాంగులు అన్ని సందర్భాల్లో స్లీపర్‌ క్లాస్‌, థర్డ్‌క్లాస్‌ ఏసీ, ఏసీ చైర్‌కార్‌లలో 75శాతం రాయితీతో ప్రయాణించవచ్ఛు కాగా ఫస్ట్‌క్లాస్‌, సెకండ్‌ క్లాస్‌ ఏసీల్లో మాత్రం 50శాతం, రాజధాని, శతాబ్ధి వంటి ప్రముఖ సూపర్‌ఫాస్ట్‌ రైళ్లలో 25శాతం మాత్రమే రాయితీ వర్తిస్తుంది. వీరికి సహాయకులుగా వెళ్లే వారికి కూడా అదే స్థాయిలో రాయితీ వర్తిస్తుంది. చెవిటి, మూగవారికి స్లీపర్‌, సెకండ్‌ క్లాస్‌లో 50శాతం రాయితీ వర్తిస్తుంది.

అవార్డు గ్రహీతలు, వృద్ధులు, సీనియర్‌ సిటిజన్లకు..

రాష్ట్రపతి నుంచి పోలీసు పతకం పొందినవారు, గౌరవప్రద అవార్డు గ్రహీతలకు 50శాతం రాయితీతో టికెట్లు జారీ చేస్తారు. 60ఏళ్లు నిండిన సీనియర్‌ సిటిజన్లకు కూడా 50శాతం రాయితీ ఉంటుంది. ప్రస్తుత ఏడాది నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు 50శాతం రాయితీతో సాధారణ, రిజర్వేషన్‌ టికెట్లు అందజేస్తున్నారు. ఆర్మీ అమరుల కుటుంబాలకు, ఉగ్రదాడుల్లో మరణించిన వీరజవాన్ల కుటుంబ సభ్యులకు, పోలీసు కుటుంబ సభ్యులకు ధ్రువీకరణ పత్రం చూపిస్తే రాయితీ టికెట్లు జారీ చేస్తారు. సాధారణంగా 60ఏళ్లు దాటిన పురుషులకు 40శాతం, మహిళలు 58 ఏళ్లు దాటిన వారికి 50శాతం మినహాయింపు వర్తిస్తుంది.

నిత్యం ఖమ్మం రైల్వేస్టేషన్‌ నుంచి ప్రయాణించే వారు : 2000

భద్రాద్రి జిల్లాలో నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు: 8500

రైల్వే స్టేషన్లు: ఖమ్మం, పందిళ్లపల్లి, మధిర, బోనకల్లు, ఎర్రుపాలెం, చింతకాని, నాగులవంచ, మోటమర్రి, తొండల గోపవరం, గంగినేని, చెరువుమాధారం

రైళ్ల రాకపోకలు: మొత్తం 54 రైళ్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

రైల్వే స్టేషన్లు: 2

రైళ్ల రాకపోకలు: మొత్తం 14 రైళ్లు (అప్‌ అండ్‌ డౌన్‌).

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.