close

బుధవారం, నవంబర్ 20, 2019

ప్రధానాంశాలు

మునిగిన 38 రోజులకు..

 ఒడ్డుకు చేరిన రాయల్‌ వశిష్ఠ పర్యాటక బోటు

 ఫలించిన ధర్మాడి సత్యం, విశాఖ డైవర్ల శ్రమ

 బోటులో ఎనిమిది మృతదేహాలు లభ్యం

 జన్యు పరీక్షలతో త్వరలో మృతుల నిర్ధారణ

 47కు చేరిన బోటు ప్రమాద మృతుల సంఖ్య

 లభించని మరో నలుగురి ఆచూకీ

కచ్చులూరు మందం వద్ద బోటును ఒడ్డుకు లాగుతున్న పొక్లెయిన్‌

ఈనాడు, కాకినాడ, ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం: సుదీర్ఘ ఉత్కంఠకు తెరపడింది. గోదావరిలో మునిగిన రాయల్‌ వశిష్ఠ ప్రైవేటు పర్యాటక బోటు ప్రమాదం జరిగిన 38 రోజులకు ఒడ్డుకు చేరింది. పాపికొండలు విహార యాత్రకు తెలుగు రాష్ట్రాల పర్యాటకులతో వెళ్తున్న బోటు దేవీపట్నం మండలంలోని కచ్చులూరు మందం వద్ద సుడిగుండాల్లో చిక్కుకుని గత నెల 15న మునిగిన విషయం తెలిసిందే. 77 మందితో వెళ్తున్న ఈ బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం గుండెలవిసేలా విలపిస్తూనే ఉన్నారు. వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చడం.. ప్రమాదం జరిగిన చోట సుడిగుండాలు, కమ్మేస్తున్న ఇసుక, బురద.. వెలికితీత చర్యలకు విఘాతం కలిగించాయి. ప్రభుత్వ అనుమతితో రంగంలోకి దిగిన కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం- విశాఖకు చెందిన ఓం శివశక్తి అండర్‌ వాటర్‌ సర్వీసెస్‌కు చెందిన స్కూబా డైవర్ల శ్రమ ఎట్టకేలకు ఫలించింది. ప్రమాదం జరిగినప్పట్నుంచి గోదావరి అడుగున చిక్కుకున్న రాయల్‌ వశిష్ఠ బోటు ఎట్టకేలకు ఒడ్డుకు చేరింది. బోటు వెలికితీసే క్రమంలో మరో ఎనిమిది మృతదేహాలు గుర్తుపట్టని విధంగా వెలుగుచూశాయి. మిగిలిన వారి జాడ తెలియాల్సి ఉంది. బోటు వెలికితీశారన్న సమాచారం బాధిత కుటుంబాల్లో కాస్త ఊరట నింపినా.. ఇప్పుడిప్పుడే కన్నీటి సుడుల నుంచి కోలుకుంటున్న వారిలో మరోసారి కల్లోలం రేపింది.

పాపికొండలు విహార యాత్రకు దేవిపట్నం మండలంలోని పూడిపల్లి గ్రామంలోని గండిపోచమ్మ ఆలయం నుంచి బయలుదేరిన వశిష్ఠ పున్నమి రాయల్‌ బోటు కచ్చులూరు మందం సమీపంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 77 మంది ఉంటే.. అందులో పర్యాటకులు నలుగురు పిల్లలతో కలిపి 69 మంది ఉన్నారు. అయిదుగురు బోటు సిబ్బంది, ముగ్గురు డ్యాన్సర్లు ఉన్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 26 మందిని కచ్చులూరు గ్రామస్థులు రక్షించిన విషయం తెలిసిందే. ఇది వరకే 39 మృతదేహాలు లభ్యమయ్యాయి. బోటులో చిక్కుకున్న ఎనిమిది మంది మృతదేహాలు మంగళవారం వెలుగుచూశాయి. దీంతో మృతుల సంఖ్య 47కు చేరింది. మరో నలుగురి జాడ తెలియాల్సి ఉంది.

అందరి కళ్లూ కచ్చులూరుపైనే..

గోదావరిలో కచ్చులూరు మందం వద్ద బోటు ప్రమాదం తెలుగురాష్ట్రాలను కుదిపేసింది. బోటు అనుమతుల దగ్గర్నుంచి.. నిబంధనల అతిక్రమణ.. తదితర అన్ని అంశాలపైనా సుదీర్ఘ చర్చ నడిచింది. బోటు వెలికితీసే క్రమంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వడంతో బోటు బయటకు రావడం కష్టమనే వాదన వినిపించింది. కచ్చులూరులో ఏం జరుగుతోందన్న అంశంపైనే రెండు తెలుగు రాష్ట్రాలూ దృష్టిసారించాయి. మృతదేహం జాడ తెలిసిందంటే.. అది తమవారిదేనా..? అన్న ఆత్రం ఆయా కుటుంబాల్లో కనిపించింది. కీలక శాఖ నిపుణుల ఆలోచనలు సేకరించిన జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం ఎట్టకేలకు కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందానికి బోటు వెలికితీత పనులు అప్పగించింది. ప్రభుత్వ అనుమతితో పొక్లెయిన్లు, రోప్‌లు, పడవలతో రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం బృందం తాళ్లకు లంగర్లు కట్టి నదిలోకి వదిలి క్రేన్ల సాయంతో బోటును పైకి లాగడానికి విశ్వప్రయత్నాలు చేశారు. సంప్రదాయ పద్ధతుల్లో చేసిన ఈ ప్రయత్నాలు తొలుత ఫలించలేదు. రెండో విడత ప్రయత్నాలు ప్రారంభించిన క్రమంలో విశాఖ నుంచి డీప్‌ డైవర్లు తోడయ్యాక వెలికితీత ప్రక్రియను వ్యూహాత్మకంగా పూర్తిచేశారు. సోమవారం పైన ఉన్న రెయిలింగ్‌ మాత్రమే బయటకు రాగా.. మంగళవారం మాత్రం బోటు ఫ్యానుకు తాడు కట్టి విజయవంతంగా బయటకు లాగారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బోటు వెలికితీతకు ప్రతిబంధకాలు గుర్తించి సాంకేతికంగా బయటకు తీయడం కష్టమని అధికారిక బృందాలే చేతులెత్తేసిన తరుణంలో ప్రైవేటు బృందాలు రంగంలోకి దిగి విజయం సాధించడం గమనార్హం. వారం రోజులుగా గోదావరిలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడం వెలికితీత ప్రయత్నాలకు అనుకూలించింది. మరోవైపు ఈ ఘటనపై జేసీ లక్ష్మీశ ఆధ్వర్యంలో మెజిస్టీరియల్‌ విచారణ సాగింది. ప్రభుత్వం ఈ ఘటనపై జలవనరులశాఖ, రెవెన్యూ, పర్యాట, శాంతిభద్రతలు, పోర్టు, జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో నియమించిన విచారణ కమిటీ బృందం నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.

ఒక్క రోజు ఆలస్యమైనా..

బోటు వెలికితీసే క్రమంలో జిల్లాతోపాటు ఎగువ ప్రాంతాల్లోనూ వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో గోదావరి ఉద్ధృతితోపాటు నీటిమట్టం అమాంతంగా పెరుగుతోంది. దీంతో జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఆదేశాల మేరకు ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద జలవనరుల శాఖతోపాటు ఇతర అధికారులూ అప్రమత్తమయ్యారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులకు నీటిమట్టం చేరింది. దిగువకు 1.04 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మృతదేహాలు దిగువకు కొట్టుకుపోకుండా జాగ్రత్తలు చేపట్టారు. వర్షాలు, నీటి ఉద్ధృతి పెరుగుతున్న క్రమంలో ధర్మాడి- డీప్‌ డైవర్ల బృందం గాలింపు చర్యలను ముమ్మరంచేసింది. డీప్‌ డైవర్లు మునిగిన బోటు ఫ్యానుకు రోప్‌ బిగించంలో విజయవంతమై బయటకు రావడంతో మునిగిన బోటును వెలికితీసే చర్యలపై దృష్టిసారించారు. ఈ చర్యలు ఫలించాయి. ఒక్క రోజు ఆలస్యమైనా పరిస్థితులు మారేవని.. గోదావరి ఉద్థృతి పెరిగి ఇసుక మేట ఎక్కువైతే బోటు వెలికితీయడం కష్టమనే వాదన వినిపించింది.

ఆగని కన్నీటి చారిక..

సుడులు తిరుగుతున్న గోదారిలో జీవితాలు చెల్లాచెదురయ్యాయి. గల్లంతయినవారి కోసం 38 రోజులుగా కొన్ని కుటుంబాలు ఎదురుచూస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు బోటు వెలికి తీయడంతో అందులో కొన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి. పూర్తిగా కుళ్లిపోయి.. చెల్లాచెదురై గుర్తుపట్టని విధంగా తయారవ్వడంతో కనీసం దుస్తులు.. ఇతర ఆధారాలతోనైనా గుర్తుపట్టొచ్చన్న ఆశ ఒక్కటే మిగిలింది.. దీంతో ఆ అవశేషాల ఆధారంగా జన్యుపరీక్షలు నిర్వహించాలనే నిర్ణయానికి అధికారులు వచ్చారు. దుర్వాసనలు వెదజల్లుతున్నా ఎంతో ఓపిగ్గా బోటు నుంచి వాటిని సిబ్బంది బయటకు తీశారు. వీటిని రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు ఆచూకీ దొరకని వారి కుటుంబీకులు సుదీర్ఘంగా నిరీక్షించి అధికారుల సూచన మేరకు వెనక్కి వెళ్లారు. వారంతా తిరిగి రాజమహేంద్రవరం చేరుకునే అవకాశాలున్నాయి. జన్యుపరీక్షల ఫలితాల వెలువడితేగానీ వెలుగుచూసిన మృతదేహాలు ఎవరివో తెలిసే అవకాశం కనిపించడంలేదు. మరికొందరి జాడ కోసం నిరీక్షణ సాగుతోంది. ప్రమాదం సమయంలో బోటు నడుపుతున్న సరంగుల జాడపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఆయా కుటుంబాలు గల్లంతయిన వీరికోసం నిరీక్షిస్తున్నాయి.

శ్రమ ఫలించింది..

కచ్చులూరు వద్ద బోటు మునిగి పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకర ఘటన. ఇలాంటివి పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఏఎన్‌ఎస్‌ బృందాలను రంగంలోకి దింపి.. సుదీర్ఘంగా గాలింపు చర్యలుచేపట్టాం. బోటు వెలికి తీతకు తొలుత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో బోటు వెలికితీతకు సమర్థవంతమైన ఏజెన్సీని గుర్తించే బాధ్యతను కీలక శాఖల బృందానికి అప్పగించాం. ఈ బృందం కాకినాడలోని బాలాజీ మెరైన్స్‌కు చెందిన ధర్మాడి సత్యం పేరును సూచించాయి. నిపుణుల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి అనుమతి పొందాక వెలికితీత చర్యలు చేపట్టాం. ఇప్పటికే భారీ ప్రాణ నష్టం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్‌లో ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే చాలా మంది ముందుకొచ్చినా.. ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటివరకు 46 మృతదేహాలు వెలుగులోకి వచ్చాయి. మరో అయిదింటి ఆచూకీ తెలియాల్సి ఉంది. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్నిచర్యలు చేపట్టింది.

- డి.మురళీధర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.