బుధవారం, డిసెంబర్ 11, 2019
న్యూస్‌టుడే, కామారెడ్డి వ్యవసాయం
కామారెడ్డి జిల్లాలో 19 మండలాల్లో 284 గ్రామాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదించారు. 33 శాతం లోపు తీసుకుంటే 14,069 హెక్టార్లలో ప్రభావం చూపినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా విషయానికొచ్చే సరికి దాదాపు అన్ని మండలాల్లో పంట దెబ్బతిన్నది. ఇందులో ఏడు మండలాల్లో 49 గ్రామాల్లో మాత్రమే నష్టపోయినట్లు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. అది కూడా అత్తెసరు కావడంతో రైతులు ఏం చేయాలో తెలియని నిస్సహాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అదేమని రైతులు అధికారులను అడిగితే నష్టం అంతగా లేదు కదా.. అనే సమాధానం వస్తోందని వాపోతున్నారు.
సరిగా అంచనా వేయలేదు
ఖరీఫ్‌లో నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 4,52,474 ఎకరాల్లో పంటలు వేయగా అందులో 2,67,076 ఎకరాల్లో వరి, 60,870 ఎకరాల్లో మొక్కజొన్న, 80,281 ఎకరాల్లో సోయా సాగు చేశారు. ఇందులో ఇప్పటివరకు రెండు వేల ఎకరాల్లో కూడా నష్టం వాటిల్లినట్లు అధికారులు పరిగణలోకి తీసుకోలేదు. కామారెడ్డి జిల్లాలోనూ 4,68,703 ఎకరాల సాగు కాగా 1,97,308 ఎకరాల్లో వరి, 85,940 ఎకరాల్లో మొక్కజొన్న, 88,083 ఎకరాల్లో సోయా వేశారు. ఇప్పటివరకు 3,802.5 హెక్టార్లలోనే 33 శాతం కంటే నష్టం జరిగినట్లు చెబుతున్నారు.
ధీమా ఇవ్వని బీమా..
ఖరీఫ్ పంట రుణాల విషయంలో చేసిన నిర్లక్ష్యం ఇప్పుడు మెడకు చుట్టుకుంది. బ్యాంకుల ద్వారానే ప్రీమియం చెల్లించే అలవాటు ఉండడంతో సాగుదారుల్లో పాతిక శాతం మంది కూడా ఫసల్‌బీమా పరిధిలోకి రాలేదు. కామారెడ్డి జిల్లాలో రూ. 1205.81 కోట్ల రుణ లక్ష్యానికి గాను 679.16 కోట్లు మాత్రమే ఇచ్చారు. నిర్దేశిత లక్ష్యంలో 56.32 శాతమే పొందారు. అందులో 78,732 మంది మాత్రమే ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో రూ. 1751.90 కోట్లకు గాను 850.79 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే సగం మాత్రమే చేరుకోగలిగారు. ఇందులో 88,715 మంది రైతులు మాత్రమే ఉన్నారు. సంబంధిత బీమా కంపెనీలు కూడా క్షేత్రస్థాయిలోకి రాక కాకిలెక్కలు వేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామాల యూనిట్‌గా వరి పంటను పూర్తిస్థాయిలో పరిశీలిస్తేనే రైతులకు మేలు జరుగుతుంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి.
వాతావరణ ఆధారిత బీమా దక్కదా?
ప్రధానమంత్రి ఫసల్‌బీమాతో పాటు నిజామాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా వాతావరణ ఆధారిత బీమాను అందిస్తున్నారు. అకాల వర్షాలు, వడగళ్లతో పంట నష్టపోయిన, రైతులకు, వారి పిల్లలకు, యంత్రాలతో ప్రమాదం బారినపడినా పరిహారం అందే వీలుంది. అధికారులు అంచనా వేసే విస్తీర్ణంపైనే ఇది ఆధారపడుతుంది. పంట రుణాలు తీసుకోక, బీమా కట్టుకోలేక నష్టపోయిన వారికి ఇది కంటితుడుపుగానైనా సాయం అందుతుందని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అధికారులు అంతంతమాత్రంగానే చేస్తున్న సర్వేతో ప్రయోజనాలు దూరమవుతాయనే బెంగ వారిని వెంటాడుతోంది. కామారెడ్డి జిల్లాకు ఈ పథకం లేకపోవడంతో ఫసల్ బీమాపైనే ఆధారపడాల్సి వస్తోంది.
పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేదు..
- పొరె నర్సింలు, లక్ష్మీరావులపల్లి, మాచారెడ్డి మండలం
రెండెకరాల్లో వరి వేశాను. పంటంతా నేలవాలింది. కోసే పరిస్థితి లేదు. గింజ రంగుమారడంతో గిట్టుబాటు ధర దక్కదు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగిరావు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
సంగం కంటే ఎక్కువగానే నష్టపోయాం
- సుధాకర్, రైతు, ఆంధ్రనగర్
వర్షానికి వరి పంటంతా నేలకొరిగి నష్టపోయాం. దిగుబడి సగానికి సగం తగ్గింది. గింజ రంగుమారి కొనేవారు లేరు. 50 శాతం మేర ఆదాయాన్ని కోల్పోయాం. అధికారులు పంట నష్టాన్ని పరిగణలోకి తీసుకుని సాయం అందిస్తేనే ఆర్థికంగా నిలుదొక్కుకుంటాం.
తాజా వార్తలు
జిల్లా వార్తలు