close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

అక్రమ నల్లాలు.. సక్రమం చేసుకోండి!

అదనపు ఛార్జీలు లేకుండా క్రమబద్ధీకరణ
ఈ నెల 22న వీడీఎస్‌ పథకం ప్రారంభం
తర్వాత దొరికితే ఛార్జీల మోత తప్పదు

ఈనాడు, హైదరాబాద్‌: అక్రమ నల్లాదారులకు జలమండలి మరో అవకాశం ఇచ్చింది. అక్రమ నల్లా క్రమబద్ధీకరణ(వీడీఎస్‌) పథకాన్ని అమల్లో తేనున్నట్లు గురువారం జలమండలి ఎండీ ఎం.దానకిషోర్‌ ప్రకటించారు. రెవెన్యూ అధికారులతో జరిగిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం నవంబరు 22 నుంచి అందుబాటులోకి వస్తుంది. వచ్చే మూడు నెలల పాటు అమల్లో ఉంటుంది. ఈ పథకం కింద అక్రమ నల్లాను సక్రమం చేసుకోవాలంటే జలమండలి వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌ ద్వారా తొలుత దరఖాస్తు చేయాలి. గృహ కనెక్షన్‌ కేటగిరిని బట్టి ఛార్జీలతోపాటు ఒక నెల కనీస బిల్లు మొత్తం చెల్లించడం ద్వారా అక్రమ నల్లాను క్రమబద్ధీకరించుకోవచ్చు. ప్రస్తుతం గ్రేటర్‌ వ్యాప్తంగా అక్రమ నల్లాలపై ఇంటింటి తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో అక్రమ నల్లాలు బయట పడుతున్నాయి. దీంతో సంబంధిత ఇంటి యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి జరిమానాలు కూడా విధిస్తున్నారు. అయితే అక్రమ నల్లాలకు సంబంధించి కొందరు దళారుల మాయమాటలతో ఇరుక్కుంటున్నారు. తీరా తనిఖీల్లో పట్టుపడి అసలు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. ఇలాంటి వారందరికి ఇంకో అవకాశం ఇవ్వాలని తాజాగా జలమండలి నిర్ణయించింది. తక్కువ ఛార్జీలతో క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. ఇలాంటి వారిపై ఎలాంటి కేసులు ఉండవని ఎండీ దానకిషోర్‌ హామీ ఇచ్చారు. అయితే నిర్ణీత గడువులోపు క్రమబద్ధీకరణ చేసుకోవాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత తనిఖీల్లో అక్రమ నల్లాలు బయట పడితే ఛార్జీల మోత తప్పదని హెచ్చరించారు. దొంగతనంగా నీటిని వాడుతున్నందుకు క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. ఇందులో భాగంగా రెండు రెట్లు నల్లా కనెక్షన్‌ ఛార్జీలతోపాటు మూడు సంవత్సరాల కనీస నల్లా బిల్లులు చెల్లించాలని, దీంతోపాటు మరో రూ.300 సర్వీసు ఛార్జీలు కూడా అదనమని తెలిపారు.

100 శాతం బిల్లింగ్‌ కావాలి: ఎండీ
గ్రేటర్‌ వ్యాప్తంగా 100 శాతం బిల్లింగ్‌, వసూళ్లు సాధించేలా చర్యలు తీసుకోవాలని ఎండీ దానకిషోర్‌ ఆదేశించారు. ప్రతి నెలా 5వ తేదీ లోపు వాణిజ్య కనెక్షన్లకు, 10 తేదీ లోపు మిగతా అన్ని కేటగిరి నల్లాలకు బిల్లుల జారీ పూర్తి కావాలని సూచించారు. ఆ దిశగా అన్ని బిల్లింగ్‌ ఏజెన్సీలను సమన్వయ పర్చాలన్నారు. అదేవిధంగా లెక్కలోకి రాకుండా వృథాగా పోతున్న నీటిని అరికడితే దానిని వేరేచోట సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీంతో జలమండలి ఆదాయం పెరుగుతుందని చెప్పారు. వీటితోపాటు అక్రమ నల్లాలను గుర్తించి ప్రతి నెలా బిల్లింగ్‌ పరిధిలోకి తీసుకువస్తే కూడా ఆదాయం పెరుగుతుందని తెలిపారు. రిజర్వాయర్లు, పైపులైన్‌ లీకేజీలు, ఇన్‌లెట్‌, అవుట్‌లెట్‌ పైపులైన్‌ లీకేజీలను గుర్తించి, వాటి మరమ్మతులకు ప్రతిపాదనలు రూపొందించాలని కోరారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.