close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

‘ములాఖత్‌’కు సాంకేతిక చిక్కులు

అంతర్జాల ఆధారిత అనుమతుల్లో సమస్యలు
మార్పులు, చేర్పులు చేసే దిశగా చర్యలు
అవగాహన కల్పిస్తున్న జైలు సిబ్బంది.. అధికారులు

ఈనాడు,హైదరాబాద్‌, న్యూస్‌టుడే, చంచల్‌గూడ: జైళ్లలో ఉంటున్న ఖైదీలను కలుసుకుని మాట్లాడేందుకు ముందస్తు అనుమతి తీసుకునే విధానంలో కొన్ని సాంకేతిక సమస్యలొస్తున్నాయి. జైళ్లల్లో సంస్కరణలు... పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల క్రితం ఈ-ప్రిజన్స్‌ను ప్రవేశపెట్టింది. అంతర్జాలం ద్వారా ఈ-ప్రిజన్స్‌ వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల వివరాలు, సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వారిని కలుసుకునేందుకు ముందస్తు అనుమతులు తీసుకోవచ్చు. ఖైదీల కుటుంబ సభ్యులు, విచారణ అధికారులు ఒకేరోజు వస్తే ములాఖత్‌ గదుల్లో రద్దీ ఏర్పడుతుందని ఈ రద్దీని నివారించేందుకు ఈ-ప్రిజన్స్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. చంచల్‌గూడ జైల్లో 2017 ఫిబ్రవరి నుంచి ఈ-ప్రిజన్స్‌ విధానం అమలవుతోంది. సాఫ్ట్‌వేర్‌ సక్రమంగా ఉన్నా.. తరచూ ఇంటర్నెట్‌ సదుపాయంలో అంతరాయాలు ఏర్పడుతుండడంతో ఖైదీల కుటుంబ సభ్యులు, విచారణ అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో జైలు అధికారులు, సిబ్బంది చంచల్‌గూడ జైలుకు వస్తున్న ఖైదీల కుటుంబ సభ్యులకు ఈ-ప్రిజన్స్‌ విధానంలో ములాఖత్‌ల అనుమతులు ఎలా తీసుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు.

మూడు నెలల నుంచి అవగాహన..
చంచల్‌గూడ జైల్లో ఖైదీలతో మాట్లాడాలంటే ఇక నుంచి ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకుంటేనే అనుమతిస్తామని మూడు నెలల క్రితం జైలు అధికారులు ప్రకటించారు. ప్రధాన గేటు వద్ద  వారం రోజుల పాటు తాత్కాలిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి పేర్లను నమోదు చేయించారు. ములాఖత్‌ కోసం వచ్చేవారు తమ గుర్తింపు వివరాలు, చరవాణిలో జైళ్లశాఖ సైట్‌లో రిజిస్టేష్రన్‌ చేసుకుంటే ఓటీపీ నంబరు ద్వారా అంతర్జాల అనుమతి లభిస్తుంది. ములాఖత్‌లో ఎవరిని కలుసుకోవాలన్నది కంప్యూటర్‌కు అప్‌లోడ్‌ చేస్తారు. దీంతో ఖైదీల బంధువులు, కుటుంబ సభ్యులు నిరీక్షణ గదికి వెళ్లి ఖైదీ పేరు తెలిపి ఫొటో దిగి వారిని కలుసుకోవచ్చు. ఓటీపీ నంబరు చరవాణికి వచ్చినా ఇంటర్‌నెట్‌ సమస్యతో అప్‌లోడింగ్‌ ఆలస్యమవుతోంది. దీంతో ఈ సమస్యను కూడా జైలు అధికారులు పరిష్కరిస్తున్నారు.

పేర్ల నమోదుపై అవగాహన లేక...
జైల్లో ఖైదీలను కలుసుకునేందుకు ఆన్‌లైన్‌ ద్వారా ములాఖత్‌ చేసుకునేవారు  (ఈ- ప్రిజన్స్‌.ఎన్‌ఐసి.ఇన్‌)’’ prisons.nic.in ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న అనంతరం ములాఖత్‌ తేదీ ఆధారంగా కేటాయించిన సమయానికి జైలుకు వెళ్లాలి. ములాఖత్‌ కేంద్రం వద్ద నమోదు అనుమతి పత్రాన్ని చూపిస్తే.. అధికారులు ములాఖత్‌ ఏర్పాటు చేస్తారు. ఈ పద్ధతిలో నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య తెలంగాణా వ్యాప్తంగా తక్కువగా ఉంది. రాష్ట్రంలోని ఇతర జైళ్ల కంటే చంచల్‌గూడ, చర్లపల్లి కేంద్ర కారాగారంలోనే ములాఖత్‌లు అధికంగా ఉంటున్నాయి. చంచల్‌గూడ జైల్లో సగటున రోజూ వందమంది, చర్లపల్లి జైల్లో 80మంది వరకూ ఖైదీలను కలుసుకునేందుకు వస్తున్నారు. చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో విదేశీ ఖైదీలు, అనిశా, సీబీఐ, డిటెన్యూలు ఉండడంతో ఇతర రాష్ట్రాల నుంచి వారిని కలుసుకోడానికి వచ్చే వారు ఆన్‌లైన్‌లో ముందుగానే ములాఖత్‌ అనుమతి తీసుకుంటున్నారు. దీంతోపాటు జైళ్లకు వస్తున్న నేరస్థుల్లో నిరక్షరాస్యులుండడం, తక్కువమంది విద్యావంతులుండడంతో ఆన్‌లైన్‌ ములాఖత్‌కు ఆదరణ తక్కువగా ఉంది. జైళ్లలో ఈ-ములాఖత్‌కు సాంకేతిక సహకారాన్ని ఎన్‌ఐసీ సంస్థ అందించింది. ఈ సాఫ్ట్‌వేర్‌లో తరచూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. రిమాండ్‌ ఖైదీలకు అసలు పేర్లతో కాకుండా అలియాస్‌ అంటూ ఇతర పేర్లు ఉంటాయి. అలియాస్‌ పేర్లతో ఖైదీల బంధువులు, కుటుంబ సభ్యులు ఆన్‌లైన్‌లో అనుమతుల కోసం నమోదు చేయడం, ఆ పేర్లు జైలు రికార్డుల్లో లేకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో ఆన్‌లైన్‌ ములాఖత్‌ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులు చేసేందుకు వీలుండాలని తెలంగాణ జైళ్ల శాఖ ఎన్‌ఐసీ సంస్థను కోరింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.