close

మంగళవారం, డిసెంబర్ 10, 2019

ప్రధానాంశాలు

అనిశా వలలో కల్లూరు ఆర్‌ఐ, వీఆర్‌ఏ

 

● రూ.7 వేలు తీసుకుంటుండగా అరెస్టు


లంచం సొమ్ము, నిందితులు ఆర్‌ఐ వెంకటేశ్వర్లు, మద్దిలేటితో అనిశా డీఎస్పీ నాగభూషణం

 

కర్నూలు నేరవిభాగం, కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కల్లూరు తహసీల్దారు కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌(ఆర్‌ఐ) వెంకటేశ్వర్లు, వీఆర్‌ఏ మద్దిలేటి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. రూ.7 వేలు లంచం తీసుకుంటూ దొరికిన ఉదంతం జిల్లా కేంద్రంలో సంచలనంగా మారింది. కర్నూలుకు చెందిన భాగ్యలక్ష్మీ గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకుడు రమణారెడ్డికి రాష్ట్రస్థాయి ఆయుధ అనుమతి ఉంది. జాతీయ స్థాయి ఆయుధ అనుమతి కోసం ఈయన కలెక్టర్‌ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆర్డీవోకు ఉత్తర్వులు జారీ చేయగా వారు అక్టోబర్‌ 14న కల్లూరు తహసీల్దారుకు సిఫార్సు చేశారు. కల్లూరు తహసీల్దారు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆర్‌ఐ వెంకటేశ్వర్లుకు బాధ్యతలు అప్పగించారు. అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు రమణారెడ్డిని రూ.10 వేలు లంచం డిమాండ్‌ చేసి చివరకు రూ.7 వేలు ఇవ్వాలని ఖరారు చేశారు. లంచం ఇవ్వటం ఇష్టం లేని ఆయన అవినీతి నిరోధక శాఖ కార్యాలయాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేయటంతో అధికారులు కేసు నమోదు చేశారు. అయ్యప్పమాల ధరించిన రమణారెడ్డి తన సహాయకుడి మహబూబ్‌బాషాను పంపారు. ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్న ఆర్‌ఐ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు వీఆర్‌ఏ మద్దిలేటి లంచం రూ.7 వేలు తీసుకుంటుండగా మాటేసిన అనిశా డీఎస్పీ నాగభూషణం, సీఐ ఖాదర్‌బాషా నేరుగా పట్టుకున్నారు. ఇద్దరినీ కల్లూరు తహసీల్దారు కార్యాలయానికి తీసుకెళ్లి ఆయుధ అనుమతికి సంబంధించిన దస్త్రాన్ని పరిశీలించారు. కల్లూరు తహసీల్దారు రవికుమార్‌ వాంగ్మూలం తీసుకున్నారు. ఇద్దరు నిందితులను ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు అనిశా డీఎస్పీ తెలిపారు.

ఐదు మాసాల క్రితం..

నాలుగో తరగతి ఉద్యోగిగా చేరిన వెంకటేశ్వర్లు పదోన్నతుల ద్వారా ఆర్‌ఐ స్థాయికి ఎదిగారు. ఐదు మాసాల క్రితం కలెక్టరేట్‌ నుంచి కల్లూరు తహసీల్దారు కార్యాలయానికి బదిలీపై వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈయనపై అవినీతి ఆరోపణలున్నాయి. దాదాపు ప్రతి బాధ్యతల్లో తహసీల్దారుకు కుడి భుజంలా ఉండే ఆర్‌ఐ పలు వ్యవహారాలను అవకాశంగా చేసుకుని డబ్బులు దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ అతిథి గృహం నిర్వహణ పేరును ఇందుకు ఉపయోగించుకుంటున్నారనే ప్రచారం ఉంది. ఆర్‌ఐ నేరుగా డబ్బులు అడగకుండా తన నమ్మినబంటైన వీఆర్‌ఏ ద్వారా లంచం అడిగించేవారు. డబ్బు ఇవ్వకపోతే కార్యాలయం చుట్టూ తిప్పుకొంటూ ఇబ్బంది పెట్టి దారికి తెచ్చుకోవటంలో దిట్ట అనే పేరుంది.

తీరిక లేకుండా అనిశా..

అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ నాగభూషణం, సీఐలు తీరిక లేకుండా బాధ్యతల్లో మునిగి తేలుతున్నారు. రూ.4 లక్షల లంచం కేసులో నిందితురాలైన గూడూరు తహసీల్దారు కోసం ఈనెల 7 నుంచి గాలిస్తున్న అధికారులు శుక్రవారం అనంతపురం జిల్లాలో పంచాయతీరాజ్‌ ఏఈ సురేష్‌రెడ్డి ఇంటిపై ఆకస్మిక దాడి చేసి ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించారు. శనివారం మధ్యాహ్నం సురేష్‌రెడ్డిని అనిశా కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపారు. మళ్లీ గంటన్నర వ్యవధిలోనే ఆర్‌ఐ వెంకటేశ్వర్లు, వీఆర్‌ఐ మద్దిలేటిలను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.