close

ఆదివారం, డిసెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

జాతీయ-అంతర్జాతీయ

బాహాబాహీనంగా కొట్టుకున్నారు

కర్నూలు కార్యాలయంలో వీఆర్వోల ఘర్షణ

వీఆర్వో చెవి కొరికేసిన మరో వీఆర్వో

ఇద్దరి సస్పెన్షన్‌

చికిత్స పొందుతున్న వీఆర్వో కృష్ణదేవరాయ

తహసీల్దారు కార్యాలయాల్లో అవినీతి వేళ్లూనుకుంది. చేతులు తడపనిదే పని జరగడం లేదు. ప్రతి పనికీ ముట్టజెప్పాల్సిందే. లేకుంటే బాధితులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి. విషయం ఉన్నతాధికారులకు తెలిసినా.. పలువురు అవినీతిపరులు అనిశా అధికారులకు పట్టుబడుతున్నా కఠిన చర్యలు శూన్యమే. కల్లూరు కార్యాలయంలో శనివారం లంచం తీసుకుంటూ ఆర్‌ఐ, వీఆర్‌ఏ పట్టుబడగా.. కర్నూలు తహసీల్దారు కార్యాలయంలో ఆదివారం ఇద్దరు వీఆర్వోలు ఏకంగా కొట్టుకున్న ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. - న్యూస్‌టుడే, కల్లూరు గ్రామీణ, కర్నూలు నగరం

కర్నూలు మండల తహసీల్దారు కార్యాలయంలో జొహరాపురం వీఆర్వో కృష్ణదేవరాయ, సుంకేసుల వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. చివరికి ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ క్రమంలో వేణుగోపాల్‌రెడ్డి చెవిని కృష్ణదేవరాయ కొరికేశారు. ఇద్దరూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం తహసీల్దారు కార్యాలయానికి నిత్యం వందలాది మంది వస్తుంటారు. ఈ క్రమంలో ఇద్దరు వీఆర్వోలు భూములకు సంబంధించిన విషయమై గొడవకు దిగినట్లు సమాచారం. డబ్బులు ఇస్తేనే వెబ్‌ల్యాండ్‌ పనులు జరుగుతున్నాయని, చేయి తడపనిదే ఏ పని చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. వీరిద్దరి మధ్య లావాదేవీల విషయంలోనే ఘర్షణ జరిగినట్లు సమాచారం. తహసీల్దారు ఎదుటే ఇదంతా జరిగినట్లు తెలిసింది.

మా తప్పేమీ లేదంటూ..

గొడవ విషయంలో తమదేమీ తప్పులేదని వీఆర్వోలు ఎవరికివారు చెప్పుకొన్నారు. భూ సమస్యలు పరిష్కరించాల్సి ఉందని ఓ వీఆర్వో అనగా.. ఇంకో వీఆర్వో తాను కంప్యూటర్‌ ఆపరేటర్‌గానూ విధులు నిర్వహిస్తున్నానని, ఇష్టానుసారంగా మాట్లాడితే ఎలా అని పేర్కొనడం గమనార్హం.

కర్నూలు తహసీల్దారు కార్యాలయంలో నిఘా నేత్రాలు ఉన్నాయి. కార్యాలయం మొత్తం వీటిని ఏర్పాటుచేశారు. వీఆర్వోల మధ్య జరిగిన గొడవ సీసీ ఫుటేజీలో నమోదై ఉంటుందని సమాచారం. ఇందులో తమ తప్పేమీ లేదని, కావాలంటే సీసీ పుటేజీ చూసుకోవాలంటూ ఎవరికివారు చెబుతున్నారు.

షోకాజ్‌ నోటీసులు జారీ చేశాం   - తిరుపతి సాయి, తహసీల్దారు, కర్నూలు

కర్నూలు తహసీల్దారు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం గొడవ పడిన వీఆర్వోలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశాం. కార్యాలయంలో గొడవ పడటం నిబంధనలకు విరుద్ధం. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లా కలెక్టరు, జేసీలకు విషయాన్ని తెలిపాం. సంజాయిషీ ఇవ్వాలని సంబంధిత వీఆర్వోలను ఆదేశించాం.

ఇద్దరు వీఆర్వోలపై సస్పెన్షన్‌ వేటు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : కర్నూలు తహసీల్దారు కార్యాలయంలో ఆదివారం విధుల్లో ఉండగా గొడవపడి కార్యాలయపు పరువు, మర్యాదలకు భంగం కలిగించిన సంఘటనను జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ సీరియస్‌గా పరిగణించారు. వీఆర్వోల మధ్య గొడవ, దుర్భాషలాడుకునే ఘటన సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. దీనిపై కలెక్టర్‌ స్పందించారు. కర్నూలు మండలం జొహరాపురం వీఆర్వో కృష్ణదేవరాయలు, సుంకేసుల వీఆర్వో వేణుగోపాల్‌ రెడ్డిని క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్‌ చేశారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది గాని కార్యాలయం లోపల లేదా క్షేత్ర పర్యటనకు వెళ్లినప్పుడు విధుల నిర్వహణలో ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని వివరించారు. అవినీతి రహితంగా ప్రజలకు ప్రభుత్వ సేవలను, పథకాల లబ్ధిని అందించి ప్రజలతో మంచి పేరు తెచ్చుకొని రెవెన్యూ శాఖ గౌరవాన్ని పెంచాలన్నారు. రెవెన్యూ శాఖ గౌరవానికి భంగం కలిగించినా లేదా ప్రజల్లో చెడ్డపేరు తెచ్చే సంఘటనలకు పాల్పడినా ఎవరినీ ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

 పరువు పోతుందని..

తహసీల్దారు కార్యాలయంలో వీఆర్వోల మధ్య జరిగిన గొడవ బయటకు రాకుండా ఉండేందుకు అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరికీి సమాచారాన్ని చేరవేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. విషయం బయటకు పొక్కితే పరువు పోతుందని సమస్యను సద్దుమణిగేలా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అసలు సెలవు రోజు కార్యాలయంలో ఉండటమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. తహసీల్దారు ఉన్న సమయంలోనే గొడవకు దిగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

వేణుగోపాలరెడ్డి (పాత చిత్రం)

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.