close

సోమవారం, డిసెంబర్ 09, 2019

ప్రధానాంశాలు

ఎన్టీపీసీ సహకారం... ఆసుపత్రిపై మమకారం

సీఎస్సార్‌ నిధులు మంజూరు
రూ.7.83 కోట్లతో కొనసాగుతున్న భవన నిర్మాణం

రామగుండం ఎన్టీపీసీ సంస్థ సహకారంతో గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి అభివృద్ధిపథంలో సాగుతుంది. గతంలో నిధుల కొరతతో ఆసుపత్రి అభివృద్ధికి నోచుకోకపోవడంతో పాటు నిర్వహణలోను ఇబ్బందులుండేవి. తలుపులు, కిటికీల మరమ్మతులకు సైతం డబ్బులుండేవి కావు. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అప్పటి కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ చొరవతో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై రామగుండం ఎన్టీపీసీ దృష్టి సారించింది. ఇక అప్పటి నంచి ఏటా తప్పనిసరిగా రామగుండం ఎన్టీపీసీ సీఎస్సార్‌ అభివృద్ధి పనుల్లో ఆసుపత్రి అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

గోదావరిఖని పట్టణం, న్యూస్‌టుడే

రోగులకు సెలైన్‌ ఎక్కించేందుకు స్టాండ్ల కొరత, వెలగని లైట్లు, వెంటిలేటర్లు లేక రోగుల పాట్లు, మరమ్మతులకు నోచుకోని కిటికీలు, దర్వాజలు, తలుపులు... ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్న గోదావరిఖని దవాఖానాలో అప్పటి జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ చేపట్టిన ‘అమ్మలాలన’లో అత్యధిక ప్రసవాలు జరుగుతుండడంతో ఆసుపత్రిలో అవసరమయిన సదుపాయలు కల్పిస్తే మరింత మెరుగయిన సేవలందిస్తారనే సంకల్పంతో ఎన్టీపీసీ ముందుకు సాగుతుంది. శవాల గది(మార్చూరీ)లో బాడీ ఫ్రీజరు లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతుండేది. రెండు మృతదేహాలను ఉంచేందుకు వీలయిన బాడీ ఫ్రీజరును ఎన్టీపీసీ సమకూర్చడంతో ఆ సమస్య పరిష్కారమయింది. వెంటిలేటర్లు, ఎయిర్‌ కండీషనర్లు, పంకాలు, పల్స్‌ ఆక్సోమీటర్లు, ఫీటల్‌ డాప్లర్లు తదితర అత్యవసరమయిన పరికరాలను అందించి మెరుగయిన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రి చుట్టూ రోడ్డు నిర్మించడంతో పాటు పార్కింగ్‌ స్థలంలో బూడిద ఇటుకలను పేర్చారు. మొదట ప్రాథమిక సమస్యలను పరిష్కరించిన ఎన్టీపీసీ యాజమాన్యం తర్వాత ప్రత్యేక సదుపాయల కల్పనపై దృష్టి సారించింది.

రూ.7.8 కోట్లతో భవనం...అంబులెన్సు... అదనపు షెడ్లు
మొదట 100 పడకల సామర్థ్యంతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనంలోనే నవజాత శిశు సంరక్షణ, రక్తశుద్ధి, రక్తనిల్వ కేంద్రాలతో పాటు మరిన్ని విభాగాలను ఏర్పాటు చేయడంతో సాధారణ వైద్య సేవలకు గదుల కొరత ఏర్పడింది. అదనంగా భవన నిర్మాణం కోసం ప్రభుత్వానికి నివేదించినా ప్రయోజనం చేకూరలేదు. దాంతో స్పందించిన ఎన్టీపీసీ యాజమాన్యం రూ.7.8 కోట్ల అంచనాలతో ఆసుపత్రి భవనంపైన మరో 50 పడకల సామర్థ్యంతో భవన నిర్మాణం పనులు చేపడుతుంది. ఈ భవన నిర్మాణం పూర్తయితే ఆసుపత్రిలో వసతుల కొరత తీరనుంది. గర్భిణులను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకురావడంతో పాటు ఇంటికి చేర్చేందుకు వీలుగా ప్రత్యేకంగా అంబులెన్సును ఏర్పాటు చేశారు. రోగివెంట వచ్చే అటెండెంట్ల కోసం ఆసుపత్రి భవనం వెనకాల ప్రత్యేకంగా మూత్రశాలలు, మరుగుదొడ్ల సముదాయం కల్పించారు. అంబులెన్సుల కోసం రెండు షెడ్లను నిర్మించారు. దోభీ యంత్రాల కోసం ప్రత్యేకంగా హాల్‌ నిర్మాణం చేపట్టారు. ఐ.సి.యు.లో అత్యాధునిక పడకలను ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సమకూరిన సదుపాయలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. తాజాగా సుమారుగా మరో రూ.1 కోటి అంచనాలతో ప్రతిపాదనలను ఆసుపత్రి నిర్వహకులు రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యానికి సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సారి రక్తశుద్ధి కేంద్రానికి నిరంతరంగా విద్యుత్తు సరఫరా చేసేలా జనరేటర్‌ ఏర్పాటు ప్రధానమైంది. డెంగీ జ్వరాలు తీవ్రమవుతుండడంతో రక్త కణాల లెక్కింపు యంత్రం,  విభజన యంత్రం కావాలని ప్రతిపాదించారు.

మరిన్ని వార్తలు

బోడగూడెం ముస్తాబు

అది ఓ మారుమూల పల్లె..చుట్టూ దట్టమైన అడవులు..నిన్నటి వరకు అటువైపు ఏ అధికారి వెళ్లలేదు..వారి ఆలనా పాలనా చూడలే..కాని ఆ గూడాన్ని ఇప్పుడు ఏకంగా రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌ సందర్శించనున్నారు. దీంతో ఉన్నంతలోనే బతుకులు సాగిస్తున్న ఆ గిరిజన పల్లె సందడిగా మారింది. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా గిరిజనుల సమస్యలు, వారి జీవన స్థితిగతులు తెలుసుకునేందుకు గ్రామం ఎంపిక కావడంతో జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి అధికారులు ఒకరి వెనుక ఒకరు వచ్చి గిరిజనుల జీవన విధానాలు తెలుసుకుంటున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి పంచాయతీలోని బోడగూడెం గవర్నర్‌ రాక కోసం ముస్తాబవుతోంది.

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.