గురువారం, డిసెంబర్ 12, 2019
అక్రమార్కుల ఆగడాలు.. అసాంఘిక కార్యకలాపాలు
పీఆర్సీ పెంచడంతో మూడొంతుల క్వార్టర్లు ఖాళీ
మరమ్మతులు మరిచిన అధికారులు.. అసౌకర్యాలతో ఉద్యోగులు
సైదాబాద్, న్యూస్టుడే
దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ప్రభుత్వోద్యోగుల సౌకర్యార్థం నిర్మించిన గృహ సముదాయాలు అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం పీఆర్సీనీ భారీగా పెంచడం తదితర కారణాలతో పలు శాఖల ప్రభుత్వోద్యోగులు క్వార్టర్లు ఖాళీ చేసి అనువైన చోట్లకు తరలివెళ్లారు. ప్రభుత్వం సైతం నిధులను సకాలంలో విడుదల చేయని కారణంగా మరమ్మతులు పూజ్యంగా మారాయి. ప్రస్తుతం క్వార్టర్లు పెద్దసంఖ్యలో ఖాళీగానే ఉంటున్నాయి. పలువురు సమీప ప్రాంతాలవాసులు, కొందరు అపరిచితులు ఖాళీ క్వార్టర్లను దర్జాగా ఆక్రమించుకుని మకాం పెడుతున్నారు. దృష్టి సారించాల్సిన ప్రభుత్వ రోడ్లు, భవనాల శాఖ(ఆర్అండ్బీ) అధికారులు శీతకన్ను చూపారు. పలు ఖాళీ క్వార్టర్లలో అసాంఘిక కార్యకలాపాలు జోరుగా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చీకటి పడితే పోకిరీలు తిష్ఠ వేసి మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారంటూ పలుమార్లు పోలీసులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. స్థానిక ఉద్యోగులు భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపినప్పటికీ ప్రజాప్రతినిధులు చొరవ చూపడం లేదనే ఆరోపణలున్నాయి.
700 క్వార్టర్లు ఖాళీ..
సుమారు 66 ఎకరాల్లో ఏర్పాటైన మలక్పేట ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయం దీనావస్థకు చేరుకుంది. దాదాపు 1200 గృహాలు నిర్మించారు. బీ, సీ, డీ, ఎంపీ, ఎంసీ, ఎంఎస్ పేర్లతో క్వార్టర్లున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం శిథిలావస్థలోని క్వార్టర్లు తొలగించి వాటి స్థానంలో ఏ, బీ-బ్లాకులు నిర్మించారు. అందులో 224 ఫ్లాట్లు నిర్మించి ఉన్నతస్థాయి ఉద్యోగులకు కేటాయించారు. తెలంగాణ విభజన, పీఆర్సీ పెంపుదల కారణంగా దాదాపు 700 క్వార్లర్లు ఖాళీగా ఉన్నాయి. కేవలం 300 క్వార్టర్లలో ఉద్యోగులు తమ కుటుంబాలతో అరకొర వసతుల మధ్య నివసిస్తున్నారు. ఆర్అండ్బీ పర్యవేక్షణలో ఉన్నప్పటికీ సిబ్బంది అరకొరగా ఉన్నారు. ఇద్దరు కాపలాదారులు, ఇద్దరు ఏఈలతో నెట్టుకొస్తున్నారు. విశాలమైన ప్రదేశంలో ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు కాస్తంత సౌకర్యాలు కల్పించడానికి సంబంధిత ఉన్నతాధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలున్నాయి. ఖాళీగా పడి ఉన్న క్వార్టర్లలో కొందరు అపరిచితులు తిష్ఠ వేసి ప్రభుత్వ సౌకర్యాలు దర్జాగా పొందుతూ ఆర్అండ్బీ వైఫల్యాలపై సవాల్ విసిరారు. మహిళలు సాయంత్రం వేళల్లో ఉద్యానాలు, ఆట స్థలాల వద్ద నుంచి వెళ్లేందుకు జంకుతున్నారంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చని కొందరు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిధుల కోసం ప్రతిపాదనలు పంపించాం..
విశ్వకుమార్, డీఈ
ఉద్యోగులు, సిబ్బంది కొరత కారణంగా పర్యవేక్షణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆక్రమణలు చోటుచేసుకోకుండా దృష్టి సారిస్తున్నాం. అలాంటి అనుమానాలున్న క్వార్టర్ల చుట్టూరా ప్రహరీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పలు క్వార్టర్లలో నివాసం ఉంటున్న ఉద్యోగుల కోసం మరమ్మతుల చేపట్టేందుకు రూ.50 లక్షల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాం. నిధులు మంజూరు కాగానే సత్వర చర్యలు తీసుకుంటాం.
ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే..
ప్రభుత్వ ఆదేశానుసారం పలు ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు అనువుగా ఉంటాయని అప్పట్లో తీసుకున్న నిర్ణయం. అయితే అరకొర సౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్న క్వార్టర్లు నివాసానికి అనువుగా ఉండకపోవడంతో వాటిని విడిచి వెళ్తున్నారు. మలక్పేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ పాఠశాల, అంధ బాలికల ప్రాథమిక, ఉన్నత పాఠశాల, మలక్పేట ప్రభుత్వోన్నత పాఠశాల, తంతి తపాల కార్యాలయం, మలక్పేట పోలీస్ స్టేషన్, మలక్పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, సైదాబాద్ మండల ఉప విద్యాశాఖాధికారి కార్యాలయం, సైదాబాద్ మండల ఉప విద్యాపర్యవేక్షకులు రేంజ్-1, -2 కార్యాలయాలు, మహిళాభవన్ (సెట్విన్ కేంద్రం), మలక్పేట ప్రభుత్వ బాలికల జూనియర్ , మలక్పేట ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలతోపాటు ప్రసన్నాంజనేయస్వామి, మల్లికార్జునస్వామి దేవాలయాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.
జిల్లా వార్తలు