close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

ఎవరి ఇంటిపన్ను వారే

కొలతలు తక్కువ చూపితే భారీగా జరిమానాలు

పురపాలక సంఘాల్లో అమలుకు సర్కారు నిర్ణయం

న్యూస్‌టుడే, గద్వాల

గద్వాలలో నిర్మాణం పూర్తయిన అపార్ట్‌మెంట్‌

పురపాలక సంఘాల్లో పారదర్శక పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం అమలుతో పట్టణాల్లో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్తగా ఇల్లు నిర్మించుకున్న వారు కొలతలు తీసుకుని ఇంటిపన్ను ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఇంటి నంబరు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం పట్టణవాసులు ఎవరి చేతులు తడపాల్సిన అవసరం లేదు. జిల్లాలోని పురపాలికల్లో అమలు కోసం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

జిల్లాలో మొత్తం నాలుగు పురపాలికలు ఉన్నాయి. అన్నీ సక్రమంగా ఉన్నా అక్రమార్జనకు అలవాటు పడిన సిబ్బంది వివిధ సాకులతో అనుమతులకు నిరాకరించేవారు. ఇకపై అలాచేసే అవకాశం లేదు. ఇంటి నంబరు కోసం కొలతలు తీసుకుని అధికారులకు చూపిస్తే ఇంటి పన్ను ఎంత కట్టాలో చెబుతారు. ఆన్‌లైన్‌లో పన్ను చెల్లించి, పత్రాలను అక్కడే అప్‌లోడ్‌ చేయాలి. జిరాక్సు పత్రాలను కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది. బిల్‌ కలెక్టర్‌ వచ్చి కొలతలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించి... సరిగ్గా ఉంటే ఏడు రోజుల్లో ఇంటి నంబర్‌ కేటాయిస్తూ పత్రం అందిస్తారు.

తేడా ఉంటే జరిమానా : పన్ను భారం తగ్గించుకోవాలనే ఆలోచనతో కొందరు ఇంటి కొలతలు తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు చేస్తారు. ఇలా చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. అధికారుల పరిశీలనలో తేడా ఉన్నట్లు బయట పడితే భారీగా జరిమానా విధిస్తారు. ఇంటికి వాస్తవ పన్ను ఎంతో అధికారులు నిర్ధారించాక వంద శాతం పన్ను అదనంగా 25 ఏళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై నిఘా విభాగం తనిఖీలు ఉంటాయి. తప్పుడు పన్ను ధ్రువీకరణ పత్రం ఇచ్చిన బిల్‌ కలెక్టర్‌పై వేటు కూడా పడుతుంది.

కొలతలు వాస్తవంగా ఉండాల్సిందే

ఇప్పటికే ఇంటి నిర్మాణం చేసుకున్న వారు, చేస్తున్నవారు కొలతలు పురపాలికలకు సక్రమంగా, వివరంగా సమర్పించాల్సి ఉంటుంది. కొలతలు తక్కువగా ఇస్తే భవిష్యత్తులో నిఘా విభాగం అధికారుల తనిఖీల్లో బయటపడితే వంద శాతం అదనంగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త చట్టంలో నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. అన్ని అమలు చేయాలని ఆదేశాలున్నాయి. ఇంటి యజమానులు పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

- నర్సింహ, కమిషనర్‌, గద్వాల పురపాలిక

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.