close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

టీఎస్‌ఎండీసీ ఇసుక యార్డ్‌లో ఎముకల గూడు

పగిలిన గాజులు, చీర, రుద్రాక్షమాల గుర్తింపు
అబ్దుల్లాపూర్‌మెట్‌లో వెలుగు చూసిన వైనం

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర రాజధాని సమీపం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల కేంద్రంలోని టీఎస్‌ఎండీసీ అబ్దుల్లాపూర్‌మెట్‌ ఇసుక యార్డ్‌లో శనివారం మనిషి పుర్రె, ఎముకలు బయటపడిన ఘటన కలకలం రేపింది. పక్కనే చీర, పగిలిన గాజు ముక్కలు లభించడంతో ఆ ఎముకల గూడు మహిళదిగా భావిస్తున్నారు. సంఘటన వివరాలు అబ్దుల్లాపూర్‌మెట్‌ ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌ కథనం ప్రకారం.. యార్డ్‌ నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు వచ్చిన సాహెబ్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి మొదటగా పుర్రె, ఎముకలను గుర్తించారు. విషయాన్ని ఆయన యార్డ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శనివారం ప్రాజెక్టు అధికారి నిరంజన్‌ ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉన్న పుర్రె, ఇతర ఎముకలను పరిశీలించారు. పక్కనే పగిలిన చేతి గాజులు, చీర ఇతర వస్తువులు ఉన్నాయి.

తొమ్మిది నెలల క్రితం తీసుకొచ్చారు..
పుర్రె, ఎముకలు లభించిన ఇసుక కుప్పను తొమ్మిది నెలల క్రితం మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం కొత్తపల్లి గ్రామం నుంచి టీఎస్‌ఎండీసీ వారు తీసుకువచ్చి ఇక్కడ డంప్‌ చేసినట్లు గుర్తించారు. కొత్తపల్లిలోనే మహిళను ఎవరైనా హత్య చేసి ఇసుకలో పాతిపెట్టారా.. అసలు ఇక్కడికి ఎలా వచ్చిందన్న కోణాలపై పోలీసులు దృష్టి సారించారు. సంఘటనా స్థలాన్ని ఎల్బీనగర్‌ ఇన్‌ఛార్జి డీసీపీ యాదగిరి, వనస్థలిపురం ఏసీపీ జయరాం పరిశీలించారు. క్లూస్‌ బృందం ఘటనా స్థలంలోని ఆధారాలను పరిశీలించి సేకరించారు. అస్థిపంజరాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అదృశ్యమైన మహిళలపై ఆరా..!
మహిళలపై అత్యాచారాలు, హత్యలతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో.. అస్థిపంజరం ఎవరిదో అన్న విషయం చర్చనీయాంశమయింది. ఇసుకను తీసుకువచ్చిన మహబూబ్‌నగర్‌ ప్రాంతంలో అదృశ్యమైన మహిళలు, యువతుల సమాచారంపై పోలీసులు దృష్టి సారించారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలను(చీర, గాజులు, రుద్రాక్ష) ఫొటోలు తీసి అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపించి అప్రమత్తం చేశారు. మృతి చెందింది ఎవరనే విషయం తేలితే హత్యా, అత్యాచారం ఏమన్నా చోటు చేసుకుందా.. తదితర విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.