close

గురువారం, సెప్టెంబర్ 24, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సర్వే సాగదు.. సమస్య తీరదు..!

అటవీ, రెవెన్యూ అధికారుల సమన్వయలోపం

హడావుడి చేసి సరిహద్దు అంశాన్ని వదిలేసిన ఇరు రాష్ట్రాల యంత్రాంగం

న్యూస్‌టుడే, బషీరాబాద్‌


కర్ణాటక అధికారితో మాట్లాడుతున్న అటవీశాఖ ఆర్‌ఓ శ్యాంసుందర్‌రావు (పాతచిత్రం)

సరిహద్దు అటవీ భూమి సర్వే పనులు ముందుకు సాగడంలేదు. ఇరు రాష్ట్రాల అధికారులు ఎవరికి వారు మిన్నకుండటంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అటవీ సరిహద్దు భూ సమస్య పరిష్కారం అవుతుందని అందరూ భావించారు. జూన్‌ 26న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల అటవీ, రెవెన్యూ అధికారులు సంయుక్త సర్వే చేయాలని నిర్ణయించారు. ముందుగా ఎవరికి వారు సర్వేచేసి హద్దులు పరిశీలించుకుందామనుకున్నారు.. జిల్లాల పాలనాధికారులకు ఎవరి నివేదిక వారు సమర్పించి.. జిల్లా స్థాయిలో సమస్యను పరిష్కరించుకుందామని ఒప్పందం చేసుకున్నారు. కానీ, ఒకటి రెండు రోజులు మాత్రమే సర్వే చేసి మానుకున్నారు. నెల దాటిపోయినా తెలంగాణ, కర్ణాటక అధికారులు పూర్తి చేయలేదు. నివేదికను సిద్ధం చేసుకోలేదు. దీంతో మరోసారి సరిహద్దు వివాదం పరిష్కారానికి నోచడంలేదు.

జిల్లాలోని బషీరాబాద్‌ మండల పరిధిలో 1,300 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. ఇదంతా వికారాబాద్‌ జిల్లాకు చెందినదే. కర్ణాటక సరిహద్దు ఉండడం.. ఇరు రాష్ట్రాలకు హద్దులు లేకపోవడంతో కర్ణాటక రైతులు మన అటవీ భూముల్లోకి చొచ్చుకొచ్చి చెట్లను నరికేసి పంటలను సాగు చేస్తున్నారు. ఇదంతా కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. ఏ అధికారి వచ్చినా.. మనకెందుకులే అనుకుని వదిలేశారు. ఇటీవల కర్ణాటక రైతుల కబ్జాల పర్వం పెరగడంతో మన మండల పరిధిలోని నీళ్లపల్లి, ఇస్మాయిల్‌పూర్‌ రైతులు, కర్ణాటక రైతుల మధ్య గొడవలు జరిగాయి. మన అధికారులు సైతం హరితహారం మొక్కలు నాటేందుకు భూమిని చదును చేయించి మొక్కలు నాటారు. మొక్కలు నాటిన భూమి సైతం తమదేనంటూ తెలంగాణ అటవీ అధికారులతో కర్ణాటక రైతులు వాగ్వాదానికి దిగారు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దాలని తాండూరు రేంజర్‌ శ్యాంసుందర్‌రావు సంయుక్త సర్వేకు కర్ణాటక రైతులు, అధికారులకు సమాచారం పంపారు. జూన్‌ 29న సేడం ఉప తహసీల్దార్‌, జిల్లా సర్వేయర్‌ వచ్చి మాట్లాడారు. పక్షం రోజుల్లో సర్వే చేసుకుందామని, నివేదిక జిల్లా స్థాయి అధికారులకు ఇచ్చి వారితోనే పరిష్కరించుకుందామని ఒప్పందం జరిగింది. సర్వేను అర్ధాంతరంగా ఆపేయడం ఏమిటని.. అటు కర్ణాటక, ఇటు తెలంగాణ రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


చదును చేసిన తెలంగాణ-కర్ణాటక సరిహద్దు అటవీ భూమి

మళ్లీ తరుచూ గొడవలు..

హద్దులు తేలకపోవడంతో మళ్లీ రైతులు గొడవ పడుతున్నారు. తమ భూమంటే తమదేనంటూ వాదనలకు దిగుతున్నారు. సర్వే పూర్తయ్యే వరకు అటు కర్ణాటక, ఇటు తెలంగాణ రైతులెవరూ భూముల వద్దకు రావద్దని ఇరు రాష్ట్రాల అధికారులు హెచ్చరించారు. అయినా కొందరు పట్టించుకోకుండా పంటల సాగు చేశారని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. మన భూములను లాగేసుకున్న అధికారులు కర్ణాటక రైతులు సాగు చేసుకుంటే మాత్రం ఊరుకుంటున్నారని తెలంగాణ రైతులు పేర్కొంటున్నారు. ఇరు రాష్ట్రాల అధికారులు స్పందించి హద్దులు తేల్చాలని కోరుతున్నారు.

రెవెన్యూ సర్వేయర్‌ రావాలి

శ్యాంసుందర్‌రావు, అటవీశాఖ అధికారి, తాండూరు.

మన పరిధిలో సర్వే తుది దశలో ఉంది. మరోసారి రెవెన్యూ సర్వేయర్‌ వస్తే హద్దు రాళ్లు పాతాలి. భూముల సర్వే, ప్రభుత్వ పథకాలకు భూములు కేటాయించడం వంటి పనుల్లో రెవెన్యూ సర్వేయర్‌ ఉన్నారని తెలిసింది. హద్దులు తేల్చి ఇవ్వాలని ఆర్డీఓ, తహసీల్దార్‌కు విన్నవించాం. త్వరలో నివేదిక పూర్తి చేసి జిల్లా పాలనాధికారి, జిల్లా అటవీశాఖ అధికారికి అందిస్తాం. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సమయం కేటాయించి ఇరు రాష్ట్రాల అధికారులతో సంయుక్త సర్వే ఉంటుంది. అటు కర్ణాటక అధికారులు సర్వే సగం చేశారు. పూర్తి చేయాలని వారిని కోరాం.

గుర్తింపు విషయంలో ఇబ్బంది ఉంటే మళ్లీ చూపిస్తాం

బక్కప్రభు, సర్వేయర్‌, బషీరాబాద్‌.

అటవీశాఖ భూమికి సంబంధించిన సర్వే పూర్తయింది. తెలంగాణ పరిధిలోకి వచ్చే హద్దులను అటవీశాఖ అధికారులుకు చూపించాం. హద్దు రాళ్లను వాళ్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అసంపూర్తి సర్వే ఏమీ లేదు. హద్దుల గుర్తింపు విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే తహసీల్దార్‌ ఆదేశాల ప్రకారం మరోసారి వెళ్లి చూపిస్తాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.