close

ఆదివారం, సెప్టెంబర్ 20, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అందని దైన్యం నేతన్న నేస్తం..

● లబ్ధిదారులకు తప్పని నిరీక్షణ

● సాంకేతిక లోపాలే కారణం

● కార్మికులకు ఆర్థిక సాయం అందేదెన్నడు?

● పునఃపరిశీలన తర్వాతే కొత్త దరఖాస్తుదారులకు లబ్ధి

 

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: పేద చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్‌ నేతన్న నేస్తం ఆర్థిక సాయం ఎన్నడు అందుతుందోనని నేతన్నలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం అమలులో సాంకేతిక లోపాలతో కొంతమందికి నేటికీ నిరీక్షణ తప్పట్లేదు. నెలలకొద్దీ ఎదురుచూసినా నిర్వేదమే మిగిలింది. సొంత మగ్గం ఏర్పాటు చేసుకొని వస్త్రాలు తయారీ చేస్తున్న వారికి లబ్ధి చేకూర్చాలనే సదాశయంతో నిబంధనలను సడలించారు. 2019 డిసెంబరు తరువాత మగ్గం పనిలోకి దిగిన వారికి సాయం అందించలేమని మార్గదర్శకాలు జారీ చేశారు. అర్హత ఉన్నా ఎందుకు ఇవ్వరంటూ నిరసనకు దిగటంతో మినహాయింపు ఇచ్చారు. దరఖాస్తులు చేసుకున్న వారికి ఇంకా పైసా అందలేదు.

జిల్లాలో ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో 2,448 మందికి అర్హత ఉందని చేనేత జౌళి శాఖ అధికారులు నిర్ధరించారు. ఈ మేరకు జిల్లా నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించారు. కాకపోతే కొన్ని సందేహాలు ఉండటంతోపాటు కొంతమంది ఉన్నతస్థాయిలో ఫిర్యాదులు చేశారు. దీంతో తిరిగి క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన చేయాలని ఆదేశించారు. సొంత మగ్గం ఉందా, ఆసామి/మాస్టరు వీవరు సాయంతో నేత పనిచేస్తున్నారా, ప్రస్తుతం చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారా లేదా అని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులిచ్చారు. ఈ నేపథ్యంలో మళ్లీ సర్వే చేసి అర్హులను గుర్తించాలని నిర్ణయించారు.

వారిలో మోదం.. వీరిలో ఖేదం.. సొంత మగ్గం ఉన్న నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర పథకానికి నిరుడు శ్రీకారం చుట్టింది. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు లబ్ధి కల్పించేలా వైఎస్సార్‌ నేతన్న నేస్తం అమలు చేయాలని ముందుకొచ్చారు. జిల్లాలో 2019 డిసెంబరు 21న 11,774 మందికి అర్హత ఉందని నిర్ధరించారు. సుమారు రూ.28.25 కోట్లు కార్మికుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది. కాకపోతే వీరిలో సాంకేతిక సమస్యలతో 712 మందికి డబ్బులు అందలేదు. గతేడాది లబ్ధి పొందిన వారిలో అనర్హులు ఉన్నట్లు ఫిర్యాదులు అందటంతో మళ్లీ పరిశీలన చేపట్టారు. వీరిలో 2,782 మందికి అర్హత లేదని తేల్చారు. తొలి ఏడాదిలో సాయం పొందిన వారిలో రెండో సంవత్సరంలో 8,992 మందికి ఇవ్వాలని అనుమతిచ్చారు. వివిధ కారణాలతో 2,782 మందిని పక్కన పెట్టారు. ఈ ఏడాది కొత్తగా 10,800 మంది దరఖాస్తు చేసుకోగా పరిశీలించి 319 మందిని అర్హులుగా గుర్తించారు. ఈ ఏడాది జూన్‌ 20న 9,311 మందికి నేతన్న నేస్తంలో చేయూతనివ్వాలని అనుమతిచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.24 వేలు వంతున రూ.22.34 కోట్లు చెల్లించారు. నిరుడు మంజూరు చేసి ఈసారి ఎందుకు పక్కన పెట్టారని చాలామంది కార్మికులు ఆందోళన చెందారు. మళ్లీ పరిశీలన చేయడంతో 755 మందికి అర్హత ఉన్నట్లు నిర్ధరించారు. అయినా ఇంకా వీరికి ఆర్థిక సాయం అందలేదు.

నేతన్న నేస్తం అమలుపై వచ్చిన అభ్యర్థనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని నిబంధనలను సడలించింది. ఈ నేపథ్యంలో మరికొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. పాత, కొత్త వారిలో 2,448 మంది అర్హత ఉన్నట్లు సర్వేలో తేల్చారు.

సర్వే తరువాతే ప్రతిపాదనలు

జిల్లాలో వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకంలో గతేడాది డిసెంబరు 21న 11,774 మందికి, ఈ ఏడాది జూన్‌ 20న 9,311 మందికి ఆర్థిక సాయాన్ని జమ చేసేందుకు లబ్ధిదారులను ఎంపిక చేశాం. సాంకేతిక కారణాలతో నిరుడు 712 మందికి రాలేదు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఈ ఏడాది 2,782 మందిని అనర్హులుగా గుర్తించాం. వీరి నుంచి మళ్లీ అభ్యర్థనలు రావడంతో పునః పరిశీలన చేసి ఎంపిక చేశాం. ప్రభుత్వం నిబంధనలను సడలించడంతో మరికొందరు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 2,448 మందికి అర్హత ఉన్నట్లు నివేదించాం. మళ్లీ సర్వే చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన చేయాలని ఉత్తర్వులిచ్చాం. సొంత మగ్గం ఉండాలి. చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్న వారిని ఎంపిక చేస్తాం. ఆర్థిక సాయాన్ని మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిస్తాం. - ఎస్‌.అప్పాజీ, జిల్లా సహాయ సంచాలకులు, చేనేత జౌళి శాఖ, కడప

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.