close

సోమవారం, ఫిబ్రవరి 17, 2020

ప్రధానాంశాలు

ఉరవకొండ అక్రమాలే నిండా

పలువురికి బోగస్‌ పాసుపుస్తకాలు

అధికారులే అండాదండ

 

డోన్‌, న్యూస్‌టుడే: డోన్‌ రెవెన్యూ పరిధిలోని ఊరకొండ డోన్‌ పట్టణ సమీపాన జాతీయ రహదారికి, దొరపల్లెకు దగ్గరగా ఉంది. ఈ కొండలో సర్వే నెంబర్‌ 460లో 168 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ భూమి ఉంది. దశాబ్దాల క్రితం కొందరికి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయగా మరికొంత ప్రభుత్వ భూమి ఉంది. 15 ఎకరాల్లో పేదలకు పట్టాలు ఇవ్వడానికి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో అధికారులు భూముల పరిశీలనకు వెళ్లినప్పుడు అక్రమాలు వెలుగు చూశాయి. ఈ భూమిలో బడాబాబులకు, నాయకులకు, వ్యాపారవేత్తలకు భూములు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొందరు పేదలకు ఇచ్చిన పట్టా భూములను కొనుగోలు చేశారు. మరికొందరు తప్పుడు సర్వే నెంబర్లతో ఈ భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు.

అక్రమాలు ఇవే..

ఈ కొండ ప్రాంతంలో ఉన్న మూడు ఎకరాల భూమిని ఇద్దరు వ్యక్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ప్రభుత్వ భూమి కాబట్టి రిజిస్ట్రేషన్లు కావు. సర్వే నెంబర్‌ 460 బదులు వేరే సర్వే నెంబర్‌ వేసి మూడు ఎకరాలను ఇద్దరు వ్యక్తులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

● ఇటీవల ఈ ప్రాంతంలో భూమికి ధరలు పెరగడంతో ప్రభుత్వ భూమిని కొనుగోలు చేస్తున్నారు. పేదలకిచ్చిన ప్రభుత్వ భూమిని వారి అవసరాలను ఆసరా చేసుకుని కొందరు నాయకులు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల ఇద్దరు నాయకులు 10 ఎకరాల పేదల భూమిని కొనుగోలు చేశారు.

● ఈ సర్వే నెంబర్‌లో భూములు లేకున్నా చాలామంది బోగస్‌ పాసుపుస్తకాలు పొందారు. బ్యాంకుల్లో రుణాల కోసం బోగస్‌ పాసుపుస్తకాలు తీసుకున్నారు. రెవెన్యూ, బ్యాంకు అధికారుల అండదండలతో వాటిని పొంది రుణాలు తీసుకున్నారు.

అంతర్జాలంలో నా భూమి లేదు - మల్లికార్జున, దొరపల్లె

డోన్‌ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 1058లో ఎకరా భూమి ఉంది. గతంలో అంతర్జాలంలో ఉన్న భూమి, అక్రమార్కుల కారణంగా ఇటీవల అంతర్జాలం నుంచి తొలగించారు. 460 సర్వే నంబరులో ఉన్న ప్రభుత్వ భూమికి కొందరు మా సర్వే నంబరు వేసి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు నా భూమిని అంతర్జాలంలో తొలగించి, వారి భూమిని ఎక్కించారు. దీనిపై స్పందన కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశాం.

అక్రమాలపై చర్యలు తీసుకుంటాం - నరేంద్రనాథ్‌ రెడ్డి, తహసీల్దార్‌

డోన్‌ పట్టణ సమీపాన ఉన్న ఊరకొండలో పేదలకు ఇళ్ల పట్టాల కోసం స్థలం సేకరిస్తున్నాం. అక్కడ పంటలు వేయకుండా ఖాళీగా ఉన్న స్థలాలను చదును చేసి పేదలకు పట్టాలిస్తాం. ఇటీవల కొన్ని అక్రమాలు మా దృష్టికి వచ్చాయి. వాటిని పరిశీలించి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూమిని కాపాడతాం. అక్రమార్కులను తొలగించి, అర్హుడైన మల్లికార్జున భూమిని అంతర్జాలంలో నమోదు చేసేలా చర్యలు తీసుకుంటాం.

ఆక్రమణలకు గురైన కొండ ప్రాంతం ఇది. ఇక్కడ పలు అక్రమాలు జరిగాయి. ప్రభుత్వ భూమిని పట్టాగా ఇస్తే ఐదెకరాలకు మించి ఇవ్వరు. ఇక్కడ ఓ కుటుంబానికి చెందిన వ్యక్తులకు 36 ఎకరాల భూమి ఉంది. ఒకే కుటుంబం వారికి ఇంత భూమి ఎలా ఇచ్చారన్నది ప్రశ్నార్థకం. అధికారుల అండతోనే ఈ అక్రమాలు జరిగినట్లు స్పష్టమవుతోంది.

చిత్రంలో కనిపిస్తున్న కొండ ప్రాంతం డోన్‌ సమీపంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉంది. ఈ కొండ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి ఇలా గోడలను నిర్మించుకున్నారు. కొండకు సంబంధించిన ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురై ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ తతంగానికి రెవెన్యూ అధికారుల అండదండలు ఉన్నాయి. మరికొందరు కొండను ఎర్రమట్టి కోసం ఇష్టానుసారంగా తవ్వేశారు.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.