close

మంగళవారం, సెప్టెంబర్ 22, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పనులు పుంజుకునేనా?

● కార్లు, బస్సులు, రైళ్లలో కార్మికులను తెచ్చుకుంటున్న గ్రానైట్‌ యజమానులు

చీమకుర్తిలో కార్మికుల సందడిలేని గ్రానైట్‌ కటింగ్‌ యూనిట్లు

ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం తెచ్చిపెట్టే జిల్లాలోని గ్రానైట్‌ క్వారీలు, కటింగ్‌, పాలిషింగ్‌ యూనిట్లు ఇతర రాష్ట్రాల కార్మికులకూ ఉపాధి కల్పిస్తున్నాయి. అయితే ఊహించని విధంగా విరుచుకుపడిన కరోనా మహమ్మారి ఈ రంగాన్ని దాదాపు నాలుగు నెలలపాటు కకావికలం చేసింది. పనులు నిలిచి, విద్యుత్తు స్థిర ఛార్జీలు, బ్యాంకు రుణాలు, ప్రైవేటు కిస్తీలు కట్టుకోలే యజమానులు, ఉపాధి లేక కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. సర్కారు సడలింపులు ఇచ్చినప్పటికీ కార్మికుల లేమితో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకుగాను వారిని సమకూర్చుకోవడంలో యజమానులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే కొందరు వ్యయప్రయాసలకోర్చి కార్లు, బస్సులు, రైళ్లలో వారిని తెచ్చుకుంటున్నారు. దాంతో కళ తప్పిన కటింగ్‌, పాలిషింగ్‌ యూనిట్లు పునఃప్రారంభానికి నోచుకుంటుండగా ఎప్పటికి పనులు వేగం పుంజుకుంటాయో మరి.

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: జిల్లాలో దాదాపు 1,650 చిన్న, మధ్య, భారీ తరహా గ్రానైట్‌ కటింగ్‌, పాలిషింగ్‌ యూనిట్లు ఉండగా కరోనా లాక్‌డౌన్‌వల్ల మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే మూతపడ్డాయి. సుమారు 40 రోజులపాటు అదే పరిస్థితి కొనసాగగా పరిమితులతో కూడిన అనుమతులను ప్రభుత్వం ఇచ్చింది. అయితే అప్పటికే కార్మికులు బిహార్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, కోల్‌కతా తదితర సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో చాలా వరకు తెరుచుకోలేదు. తెరుచుకున్న కొన్ని అరకొర మందితో నెట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూనిట్లు పని చేసినా, చేయకపోయినా కనీస విద్యుత్తు ఛార్జీలు, స్థిర ఛార్జీలు చెల్లించాల్సిరావడం, బ్యాంకు రుణాల వడ్డీల చెల్లింపులు, ప్రైవేటు రుణ కిస్తీలు యజమానులకు కష్టాలను తెచ్చిపెట్టాయి.

కార్మికులకు ఉపాధి లేక...

జిల్లా నుంచి సొంత రాష్ట్రాలకు వెళ్లి నెలలు గడుస్తున్నా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కార్మికులు తిరిగి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. పట్టుగా నిలబడి పనులు చేస్తారన్న నమ్మకంతో కొందరు యూనిట్ల యజమానులు వారిని తెచ్చుకుంటున్నారు. దీంతో చీమకుర్తి, ఒంగోలు, సంతనూతలపాడు, మద్దిపాడు తదితర ప్రాంతాల్లోని యూనిట్లలో పనులు ప్రారంభమయ్యాయి.

సొంత ఖర్చులతో...

సొంత రాష్టాలకు వెళ్లిన కార్మికుల రాకపోకలకు రవాణా ఇబ్బందులు ఉండటాన్ని గుర్తించిన గ్రానైట్‌ యూనిట్ల యజమానులు రైళ్లు, విమానాల ద్వారా వారిని రప్పించుకొంటూ ఆయా ప్రాంతాల నుంచి కారుల్లో చేరవేసుకుంటున్నారు. వారం, పది రోజులుగా వారు ఈ ప్రక్రియను సాగిస్తున్నారు. యంత్రాలు ఆడితేనే ఆర్థిక లావాదేవీలు సాగి కొన్ని సమస్యలైనా తీరుతాయని ఒక్కొక్కరిపై రూ.6, 7 వేలు ఖర్చు పెట్టయినా సరే కార్మికులను కార్లు, బస్సులు, రైళ్లలో తీసుకొస్తున్నామంటున్నారు.

అక్కడ పనుల్లేకనే వచ్చాం

లాక్‌డౌన్‌ సమయంలో సొంతూరికి వెళ్లిపోయాం. అక్కడ మాకు ఉపాధి లేదు. లాక్‌డౌన్‌కు ముందు తమతో పని చేయించుకున్న యజమాని పిలవడంతో వస్తామని చెప్పగా విమానంలో బిహార్‌ నుంచి రావడానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పనితోపాటు డబ్బులు సమయానికి లభిస్తాయి. నెలనెలా ఇంటికి కొంత మొత్తం పంపిస్తే అక్కడ వాళ్లూ సంతోషంగా ఉంటారు. అలవాటైన పని అయినందున మళ్లీ అందరం వచ్చేశాం. - సంతోష్‌ సింగ్‌, కార్మికుడు

రెండు షిఫ్టులు ప్రారంభమైతేనే..

కరోనా కారణంగా ఆర్థికంగా నష్టపోయాం. చిన్నతరహా పరిశ్రమ నెలకు 4,468 యూనిట్లు వాడినా, వాడకపోయినా కనీసం రూ.30 వేల బిల్లు చెల్లించాలి. అలానే స్థిరఛార్జీల కింద మరో రూ.44,460 వేలు కలిపి మొత్తం రూ.75 వేల వరకు కట్టాల్సివస్తోంది. దీన్ని భరించడం కంటే ఏదో విధంగా కార్మికులను తెచ్చుకొని పనులు ప్రారంభించడం మేలని కొందరు ఆ బాటను పడుతున్నారు. అలా ఇప్పటివరకు సింగిల్‌ షిఫ్టులో 40 శాతం యూనిట్లు మాత్రమే ప్రారంభమయ్యాయి. రెండు షిఫ్టులు ఆరంభమైతేనే పరిశ్రమ పుంజుకున్నట్లు. - వై.కోటేశ్వరరావు, అధ్యక్షుడు, రాష్ట్ర చిన్నతరహా గ్రానైట్‌ పరిశ్రమల సంఘం

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.