close

మంగళవారం, జనవరి 21, 2020

తాజా వార్తలు

ఆక్రమణలపై ఉక్కుపాదం

  1800 నిర్మాణాల తొలగింపు
  బాధితుల ఆత్మహత్యాయత్నం
  పలువురిని అరెస్టు చేసిన పోలీసులు
  రెవెన్యూ అధికారుల కఠినచర్యలు

నగర శివారు ప్రాంతంలో స్థలాలను ఆక్రమించి అనధికారంగా నిర్మించిన గృహాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. నాయకుల మాయమాటలు నమ్మి పెద్ద మొత్తం వెచ్చించి గూడు నిర్మించుకున్న పేదలు ఈ పరిణామంతో కన్నీటిపర్యంతమయ్యారు. పొత్తూరు నాయుడుపేట నుంచి డంపింగ్‌ యార్డుకు వెళ్లే మార్గంలో అపాచీ భూమితో పాటు సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్‌, ఎంసీపీఐ(యూ) నాయకులతో పాటు మరికొందరు ఇష్టానుసారంగా ఆక్రమించి ఇళ్లు నిర్మించారు. ఎన్నికల సమయం నుంచి ఆరు నెలలుగా ఈ వ్యవహారం నడుస్తోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమణదారులు చెలరేగి పోయారు. ఏకంగా ఇటుక రాళ్లు, సిమెంటు రేకులతో పక్కా గృహాలు వేశారు. వాటిని స్వచ్ఛందంగా తొలగించాలని పలుమార్లు అధికారులు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. ఇలా మొత్తం 52 ఎకరాల్లో 1800కు పైగా నిర్మాణాలు చేసినట్లుగా అధికారులు లెక్క తేల్చారు. ఈ నేపథ్యంలో అర్బన్‌ దక్షిణ మండల డీఎస్పీ కరుణాకరరావు, ఆర్డీవో భాస్కరరెడ్డి, తహసీల్దార్‌ మోహనరావు, సీఐ వీరాస్వామితో పాటు సుమారు 200 మంది పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అగ్నిమాపక అధికారులు పొక్లెయిన్లు, ట్రాక్టర్లతో శనివారం వేకువజామున 2 గంటలకు ఆ ప్రాంతానికి వచ్చారు. మధ్యాహ్నం వరకు కూల్చివేత పనులు కొనసాగించారు.

గ్రామీణ గుంటూరు, న్యూస్‌టుడే

కూల్చివేతకు అధికారులు వ్యూహాత్మకంగా పథకం రచించారు. ఆయా పార్టీ నాయకులను ఒకరోజు ముందే అరెస్టు చేశారు. వేకువజామున అక్కడికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఒకేసారి నలుదిక్కులా పొక్లెయిన్లతో కూల్చివేతకు శ్రీకారం చుట్టారు. కొందరు సిబ్బంది ముందస్తుగా గృహాల్లో నివసిస్తున్న వారిని హెచ్చరించడంతో చేసేదిలేక సామగ్రిని తీసుకొని బయటకు వచ్చేశారు. కొందరు తమ ఇళ్లను అర్ధరాత్రి కూల్చడం ఏంటంటూ మండిపడ్డారు. తాము రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వెచ్చించి నిర్మాణాలు చేస్తే తొలగించడం సబబు కాదంటూ వాగ్వాదానికి దిగారు.

పలువురి ఆత్మహత్యాయత్నం
తమ ఇళ్లను కూల్చివేస్తుండటంతో కాలనీకి చెందిన పరిసపోగు దేవసహాయం, నూతక్కి కృష్ణరేఖ, ఏసుదానం, మేరీ, రమావత్‌ లక్ష్మి, బస్తుల సుజాత, మురుగుల బుజ్జి, కమల, రాంబాబు, ఆశ, దేవిక, లక్ష్మి, రత్నకుమారి తదితరులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే స్పందించిన అధికారులు వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో కోలుకొంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

అక్రమార్కులకు వరం
నగర శివారులోని అపాచీ స్థలం అక్రమార్కులకు వరంగా మారింది. తాము ఇక్కడ ప్లాట్లు ఇప్పిస్తామంటూ అమాయకులను నమ్మించి కొందరు కొంత కాలంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా పేదలు నష్టపోతున్నారు. ఇలా అపాచీ స్థలాన్ని ఆక్రమించడం మొదటిసారి కాదు. ప్రతిసారి పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి నిర్మాణాలను తొలగించడం వ్యవప్రయాలతో కూడుకుంటోంది. ఈ స్థలం మొత్తం ఏపీఐఐసీ ఆధీనంలో ఉంది. వారు గతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. స్థలం చుట్టూ రక్షణ తీగలు ఏర్పాటు చేస్తే ఫలితం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ఆక్రమిస్తే చర్యలు తప్పవు
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని ఆర్డీవో భాస్కరరెడ్డి, అర్బన్‌ దక్షిణ మండల డీఎస్పీ కరుణాకరరావు హెచ్చరించారు. ఇళ్లు లేని పేదలు దరఖాస్తులు చేసుకుంటే ప్రభుత్వం వారికి స్థలాలు కేటాయిస్తుందన్నారు. ఇలా అనధికారకంగా ఆక్రమణలకు పాల్పడితే ఆర్థికంగా నష్టపోతారని, శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఈ స్థలాన్ని ఏపీ టిడ్కోకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం పేదలకు ఇక్కడ జీ ప్లస్‌3 తరహా నిర్మాణాలు చేపట్టే అవకాశముందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.