నిజాలు వెలుగు చూడాల్సిందే!

సంపాదకీయం

నిజాలు వెలుగు చూడాల్సిందే!

చట్ట విరుద్ధమైన మార్గాల్లో గూఢచర్య ఉపకరణాలను వినియోగించారా   లేదా?- పెగాసస్‌ స్పైవేర్‌పై విచారణలో భాగంగా కేంద్ర సర్కారుకు సర్వోన్నత న్యాయస్థానం సంధించిన సూటిప్రశ్న ఇది. దానికి స్పష్టంగా సమాధానమివ్వని ప్రభుత్వం- ఫోన్లపై నిఘాకు సాంకేతికతను నియోగించడంపై ఏమీ చెప్పలేమంటూ స్పందించింది! దేశ భద్రత దృష్ట్యా కొన్ని అంశాలను బహిరంగపరచలేమని చెబుతూ- కేవలం రెండు పుటల ప్రమాణపత్రాన్ని దాఖలుచేసింది. పెగాసస్‌పై వెలువడిన కథనాలన్నీ ఆధారరహిత ఊహాగానాలుగా కేంద్రం కొట్టిపారేసింది. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం కూడదని తాజాగా స్పష్టీకరించిన సుప్రీంకోర్టు- పౌరుల వ్యక్తిగత గోప్యతా హక్కును కాలరాసే దుర్విధానాలను అనుమతించబోమని ఉద్ఘాటించింది. పెగాసస్‌ చారుచక్షువుల తీక్షణతపై కూలంకషంగా విచారించి, వాస్తవాలను వెలికితీయడానికి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.వి.రవీంద్రన్‌ నేతృత్వంలో త్రిసభ్య సంఘాన్ని కొలువుతీర్చింది. మొత్తం వ్యవహారంలో కేంద్ర వైఖరిపై అసంతృప్తి వ్యక్తంచేసిన న్యాయపాలిక- హక్కుల ఉల్లంఘన పట్ల ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోలేమని వ్యాఖ్యానించింది. రాజ్యాంగదత్తమైన జీవించే హక్కులో వ్యక్తిగత గోప్యత అంతర్భాగమని నాలుగేళ్ల క్రితం సుప్రీంకోర్టు చరిత్రాత్మక ఉత్తర్వులిచ్చింది. సీజేఐ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం నిన్న వ్యాఖ్యానించినట్లు- ప్రస్తుత సాంకేతిక శకంలో పౌరుల గోప్యతా హక్కుకు గొడుగుపట్టడం అత్యావశ్యకం. అందుకు కట్టుబాటు చాటాల్సిన ప్రభుత్వం- తద్భిన్నమైన పద్ధతులకు పట్టం కడుతోందన్న అభియోగాలను నెత్తిన మోస్తుండటమే విస్మయకరం! రాజకీయ నాయకుల నుంచి పాత్రికేయుల వరకు పలు రంగాల ప్రముఖులపై పెగాసస్‌ ప్రయోగానికి సంబంధించి సత్యాసత్యాలు సత్వరం వెలుగులోకి రావాలి. నిఘా చెరలో చిక్కిశల్యమవుతున్న పౌరహక్కులకు ఊపిరిపోసేలా ప్రజాస్వామ్య వ్యవస్థలు పటిష్ఠం కావాలి!

ప్రభుత్వ విధానాలకు ప్రజాప్రయోజనాలే గీటురాయి కావాలన్నది నిర్వివాదాంశం. ‘ట్రైబ్యునళ్లతో పనిలేదని భావిస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టాన్నే రద్దుచేయండి’ అన్న సుప్రీంకోర్టు ఇటీవలి ధర్మాగ్రహంలో దేశీయంగా పెచ్చరిల్లుతున్న ప్రజావ్యతిరేక పోకడలపై ఆందోళన ప్రస్ఫుటమవుతోంది. రాష్ట్ర, జిల్లాస్థాయి వినియోగదారుల ఫోరాల్లో 650కి పైగా ఖాళీలు పోగుపడినట్లు రెండు నెలల క్రితమే వెలుగుచూసింది. ఎనిమిది వారాల్లోగా వాటిని భర్తీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం అప్పట్లో ఆదేశాలిచ్చింది. ఆ మేరకు క్షేత్రస్థాయిలో చర్యలు కొరవడినట్లు తాజా పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. మానవ హక్కులకు సంబంధించి ఇండియాపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఎన్‌హెచ్‌ఆర్సీ అధ్యక్షులు ఈమధ్య చేసిన వ్యాఖ్యలూ పలు విమర్శలకు తావిచ్చాయి. సామాన్యులకు అండగా నిలబడాల్సింది పోయి సర్కారుకు వంత పాడటమేమిటన్న ప్రశ్నలూ ఉదయించాయి. పాలనలో పారదర్శకతకు, జవాబుదారీతనానికి ఊతం కావాల్సిన సమాచార హక్కు చట్టాన్ని సమాధిచేసే కుయుక్తులూ రాష్ట్రాలకు అతీతంగా కోరచాస్తున్నాయి.  సమర్థులైన కమిషనర్లను సకాలంలో నియమించకుండా సమాచార సంఘాలను నిర్వీర్యం చేస్తున్న ఏలికలు- ఉద్యమకారులపై భౌతిక దాడులను కట్టడి చేయడంలోనూ మీనమేషాలు లెక్కిస్తున్నారు. లఖింపుర్‌ దుర్ఘటనపై విచారణలో యూపీ ప్రభుత్వ వైఖరిని సీజేఐ ఈమధ్యనే తప్పుపట్టారు. రాజ్యాంగం శక్తియుక్తులు దాన్ని అమలు చేసేవారి దక్షతపై ఆధారపడి ఉంటాయని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఏనాడో కుండ బద్దలుకొట్టారు. ఎప్పటికప్పుడు మారిపోయే ప్రభుత్వాల చేతుల్లోంచి నిధులు, విధుల పరంగా వ్యవస్థలకు స్వేచ్ఛ సాకారమైతేనే- రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య ప్రమాణాలకు మన్నన దక్కుతుంది. పార్లమెంటుకు, తద్వారా ప్రజలకు జవాబుదారీ అయ్యేలా స్వతంత్ర వ్యవస్థలు ఆవిర్భవిస్తేనే- పౌరహక్కులు పరిపుష్టమవుతాయి!

Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న