ఇలాగా గోప్యత?

సంపాదకీయం

ఇలాగా గోప్యత?

తొమ్మిది నెలల క్రితం చోటుచేసుకున్న సైబర్‌ దాడిలో 45 లక్షల మంది ఎయిరిండియా వినియోగదారుల వ్యక్తిగత వివరాలు బహిర్గతమయ్యాయి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ నుంచి నిరుడు తస్కరణకు గురైన తొమ్మిది లక్షల మంది రైలు ప్రయాణికుల ఫోన్‌ నంబర్లు, మెయిల్‌ ఐడీలు వంటివి- ఆ వెంటనే డార్క్‌వెబ్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఆన్‌లైన్‌ వేదికగా వివిధ సేవలందించే ప్రముఖ ప్రైవేటు సంస్థలూ సైబరాసురులకు సులభ లక్ష్యాలవుతున్నాయి. రాబోయే రోజుల్లో వారి ఆగడాలు ఇంకా పెచ్చరిల్లే ప్రమాదం ఉన్నట్లు పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. తమ పౌరుల వ్యక్తిగత సమాచార సంరక్షణ కోసం దాదాపు 128 దేశాలు ప్రత్యేక శాసనాలను తీర్చిదిద్దుకున్నాయి. గోప్యతను మానవ హక్కుగా గుర్తించే అంతర్జాతీయ ఒప్పందంపై 1948లోనే భారతదేశం సంతకం చేసింది. ఆ మేరకు పటిష్ఠ చట్టాన్ని పట్టాలెక్కించడంలో మాత్రం ఇంకా వెనకబడే ఉంది! వ్యక్తుల వివరాలు అంగడి సరకులు కాకూడదంటే- దేశీయంగా అందుకు తగిన ఏర్పాట్లు అత్యవసరమని అత్యున్నత న్యాయస్థానం లోగడే స్పష్టీకరించింది. వ్యక్తిగత గోప్యతను పౌరుల ప్రాథమిక హక్కుగా అభివర్ణించిన న్యాయపాలిక- దాని పరిరక్షణ బాధ్యతను పాలకుల భుజస్కంధాలపై మోపింది. ఆ దరిమిలా డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో కీలకాంశమైన సమాచార భద్రతపై మేలిమి సూచనలు అందించేందుకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీకృష్ణ సారథ్యంలో కేంద్రం ఒక నిపుణుల సంఘాన్ని కొలువుతీర్చింది. ఆ సంఘం నివేదిక ఆధారంగా రూపొందిన వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు 2019లో పార్లమెంటు గడపతొక్కింది. రెండేళ్ల చర్చోపచర్చల తరవాత ఆ బిల్లుకు సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) తాజాగా ఆమోదముద్ర వేసింది. ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రమాణాలను ఔదలదాల్చినట్లుగా జేపీసీ సారథి పి.పి.చౌధురి చెబుతున్నా- చట్టం పరిధి నుంచి ప్రభుత్వ సంస్థలకు గంపగుత్తగా మినహాయింపులు దఖలుపరచే నిబంధనలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి! 

సమాచార యుగంలో వ్యక్తిగత గోప్యతకు ప్రభుత్వ, ప్రభుత్వేతర పక్షాల నుంచి ప్రమాదాలు ఎదురవుతున్నాయని జస్టిస్‌ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. వాటిని నిలువరించేలా సమర్థ శాసనాన్ని రూపొందించే క్రతువులో భాగంగా- పౌరుల వ్యక్తిగత ప్రయోజనాలు, న్యాయమైన ప్రభుత్వ బాధ్యతల మధ్య సంతులనాన్ని సాధించడంలో జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుందని ఉద్ఘాటించింది. చరిత్రాత్మకమైన ఆ తీర్పు ప్రమాణాలకు తాజా బిల్లు గండికొడుతోందని జేపీసీలోని ప్రతిపక్ష సభ్యులు గళమెత్తుతున్నారు. కీలకమైన సమాచార పరిరక్షణ ప్రాధికార సంస్థ(డీపీఏ)పై ప్రభుత్వ ప్రభావాన్ని అధికం చేసేలా విధివిధానాలను రూపొందించినట్లు వారు ఆక్షేపిస్తున్నారు. దేశభద్రత వంటి అంశాల్లో వ్యక్తుల అనుమతులతో నిమిత్తం లేకుండానే సమాచారాన్ని సేకరించే అధికారాన్ని పోలీసు యంత్రాంగంతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలకు ప్రతిపాదిత బిల్లు కట్టబెడుతోంది. అస్పష్టమైన నిబంధనలు పౌరస్వేచ్ఛకు విఘాతకరమన్నది నిర్వివాదాంశం! వ్యక్తుల ఇష్టాయిష్టాలకు అతీతంగా ప్రైవేటు సంస్థలు వారి వివరాలు సేకరించకుండా కట్టడిచేసే ప్రతిపాదనలు కీలకం. వినియోగదారుల వ్యక్తిగత వివరాలను అపారంగా పోగేసే సామాజిక సంస్థలకు పగ్గాలు వేయడం కచ్చితంగా అవసరం! బలమైన సమాచార సంరక్షణా చట్టం(జీడీపీఆర్‌)తో పౌరహక్కులకు యూరోపియన్‌ యూనియన్‌ గొడుగు పడుతోంది. జీవించే హక్కులో అంతర్భాగమైన ఆంతరంగిక స్వేచ్ఛకు మన్నన దక్కాలంటే దేశీయంగానూ పకడ్బందీ శాసనం, దాన్ని పక్కాగా అమలుచేసే పటుతర వ్యవస్థ తప్పనిసరి! ప్రతిపాదిత బిల్లును పార్లమెంటు కూలంకషంగా సమీక్షించి, సహేతుక విధివిధానాలతో దాన్ని తీర్చిదిద్దితేనే- డిజిటల్‌ శకంలో రాజ్యాంగ విలువలకు సరైన మన్నన దక్కుతుంది!

Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న