గుడి గంటలు మోగే వేళ...
close

సంపాదకీయం

గుడి గంటలు మోగే వేళ...

ల్లెల్లో ప్రముఖంగా కనిపించే కళాత్మక విశేషం ఏమంటే- ఊళ్లో పట్టుమని పది గడపలున్నా- లేకున్నా ‘ఎక్కడ చూచినన్‌  సరసి, ఎక్కడ చూచిన దేవమందిరంబు’ అని భీమఖండంలో శ్రీనాథుడు చెప్పినట్లుగా- ఓ గుడి తప్పనిసరిగా ఉంటుంది. అక్కడ సుప్రభాత శుభవేళ సభక్తికంగా దేవతార్చనలు నడుస్తాయి. షోడశోపచార కైంకర్యంతో మంగళకర వాతావరణం వేకువనే పురుడు పోసుకుంటుంది. తిరిగి సాయంసంధ్యల్లో చల్లనివేళ నిర్మల భజన మందిరమై ‘శ్రీరామ నీ నామమెంతో రుచిరా’ తరహా సంకీర్తనలతో ఆధ్యాత్మిక రుచులను ప్రసాదంగా పంచుతుంది. మేలుకొలుపులు మొదలు పవళింపు సేవదాకా కోవెల ప్రాంగణం సకల కళావైభవంతో సమగ్ర సాంస్కృతిక వేదికగా భాసిస్తుంది. ‘మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని...’ అన్నట్లుగా రోజంతా గుడి ఆవరణ మంగళకరమైన కూడలిగా, గ్రామ సౌభాగ్యానికి కావలిగా నిలుస్తుంది. ఊరి నుదుట కుంకుమబొట్టుగా మెరుస్తుంది. ఒడయనంబి విలాసంలో అజ్జరపుకవి వర్ణించిన ‘తప్తకాంచన నిర్మిత స్ఫుటాంచిత రత్నదీపితోన్నత భవ్యగోపురములు...’ ఆలయానికి నలుదిక్కులా, గర్భగుడికన్నా ఎత్తుగా ఎందుకుంటాయంటే- పొలిమేరల్లోని వరిపొలాల్లో ఆరుగాలం శ్రమించే రైతన్నలు అక్కడినుంచే గోపుర కలశాలకు ఓ దణ్నం పెట్టుకుంటారని! కోడికూసే వేళకల్లా స్నానాదికాలు ముగించి, పట్టుబట్టలతో గర్భగుడిలో సమంత్రికంగా, సాంగోపాంగంగా, సుస్వరంగా శివరాత్రి మాహాత్మ్యంలో సోమనారాధ్యుడు చెప్పినట్లు ‘రూఢిగా బహువిధ రుద్ర సూక్తంబుల శివునభిషేకంబు సేయు’ అర్చకులకు దక్కే పుణ్యం- అలా పొలాల్లోంచే కలశాలకు మనసారా నమస్కరించే రైతన్నలందరికీ లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.

ప్రత్యేక ఉత్సవాలు, జాతరల సందర్భాల్లో సందడి ఆ ప్రాంత సంస్కృతికి గొప్పగా అద్దంపడుతుంది. పల్లెపడుచులు ఆ సంబరాలకు ఎలా సిద్ధమవుతారో పాండురంగ మాహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు వర్ణించాడు. ‘గొర్వెచ్చ చమురు అంటికొనిరి మస్తకముల, జలకమాడిరి నిశామిళిత వారి...’ పసుపు కలిసిన నీటిలో అభ్యంగనాలు చేసి, ‘పర్వదినముల పామర ప్రమదలు ఉదిత నియమ సంభావన ఆరంభ నిభృత బుద్ధి...’ పెద్దలు నిర్దేశించిన విధివిధానాలను అనుసరిస్తూ భక్తిశ్రద్ధలతో జాతరలకు వచ్చేవారట. అప్పట్లో వారి పశుసంపదకు గాలిసోకుడు వ్యాధి అంటితే జంతుబలులిచ్చేవారు. క్రమంగా అది తగ్గిపోయింది. ప్రస్తుతం మనం గమనించవలసింది ఈ మార్పునే. కరోనా కలవరం కారణంగా ఎన్నడూ లేనివిధంగా వివిధ ప్రార్థనాలయాలు సుదీర్ఘకాలంగా మూతపడి, రేపటి నుంచి తిరిగి తెరుచుకుంటున్నాయి. వాస్తవానికి ఇన్నాళ్లూ మూతపడ్డవి గుడి తలుపులే గాని- భక్తుల మది తలపులు కావు. వారు గుడికి దూరమయ్యారే గాని దేవుడికి కాదు. ‘ఆకలి తోడ నీ కడుపున ఆరడి అచ్చట, చూడలేక నీ ఆకలి తీర్చలేక కడుపారడి ఇచ్చట’ అంటూ కుమిలిపోయిన తిన్నడిలా దైవదర్శనం కోసం భక్తులు ఆరాటపడిపోయారు. ఈ నేపథ్యంలో తెల్లారేసరికి గుళ్లో వాలాలనుకొనే వారంతా ఒక్క విషయం తప్పక గుర్తించాలి. తొలగింది ప్రభుత్వ నిర్బంధమే గాని, కరోనా ప్రమాదం కాదు. మన మొహాన్ని మనం చూసుకోలేక అద్దాన్ని ఆశ్రయిస్తాం. మన గుండెల్లో దైవాన్ని కనుగొనడం నేర్చేదాకా గుడిని సందర్శిస్తాం. తలపులో తిరుమల శ్రీవారు అక్షరాలా గుండెల్లో ప్రత్యక్షం కావడాన్ని కరోనా అలవరిచింది. భక్తికి కొత్త నిర్వచనం ఇచ్చింది. మొహానికి ముసుగు తగిలించుకొని వెళ్లి మనసుకు ముసుగు తొలగించుకొని రావడం మనమిక సాధన చేయాలి. గుళ్లో దేవుణ్ని గుండెల్లో కనుగొనడం నేర్చుకోవాలి. మనవల్ల ఇతరులకు కీడు జరగరాదన్న తద్బుద్ధి, అంతఃకరణ తద్బుద్ధి అలవడాలి. కాలం దైవస్వరూపం. కాలంతో కరచాలనం తక్షణ కర్తవ్యం!


మరిన్ని

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న