close

ప్ర‌త్యేక క‌థ‌నం

2015-2019: మధ్యలో టీమిండియా జర్నీ

క్రికెట్‌ పురిటి గడ్డ ఇంగ్లాండ్‌ ఆతిథ్యమిస్తున్న ప్రపంచకప్‌లో విజయకేతనం ఎగరేసేందుకు అన్ని జట్లూ సై..సై అంటున్నాయి. రౌండ్‌రాబిన్‌ పద్ధతిలో జరిగే మెగా టోర్నీలో ట్రోఫీని ముద్దాడాలని ఉవ్విళ్లూరుతున్నాయి. పోటీపడే పది జట్లలో సెమీస్‌ చేరేవి నాలుగు. ఇంగ్లాండ్‌, భారత్‌, ఆస్ట్రేలియాకు బెర్త్‌ ఖాయమన్నది దిగ్గజాల మాట. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ అవకాశాలనూ కొట్టిపారేయలేం అన్నది మరికొందరి అంచనా. ఏదేమైనప్పటికీ కోహ్లీసేన విశ్వవిజేతగా ఆవిర్భవించాలని భారత అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 2015 ప్రపంచకప్‌ నుంచి నేటి వరకు టీమిండియా ప్రదర్శన ఎలాగుందో ఓ సారి తెలుసుకుందామా!!

ప్రయోగాలెన్నో..

ఈ నాలుగేళ్ల కాలంలో టీమిండియాలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయోగాలెన్నో జరిగాయి. నాలుగో స్థానం కోసం ఎందరో ఆటగాళ్లు మారారు. ఎంఎస్‌ ధోనీ నుంచి విరాట్‌ కోహ్లీ సారథ్య పగ్గాలు స్వీకరించాడు. కోచ్‌గా కుంబ్లే రాజీనామా సంచలనం సృష్టించింది. రవిశాస్త్రి కోసం విరాట్‌ ఆరాటం విస్మయపరిచింది. నిలకడకు మారుపేరైన అజింక్య రహానెకు రెండేళ్లుగా జట్టులో చోటే లేదు. సీనియర్‌ స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా స్థానాల్లో మణికట్టు మాంత్రికులు కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌ స్థిరపడిపోయారు. జస్ప్రీత్‌ బుమ్రా ప్రపంచంలో అత్యుత్తమ పేసర్‌గా ఎదిగాడు. హార్దిక్‌ పాండ్య వంటి చక్కని ఆల్‌రౌండర్‌ దొరికాడు. ఇక నాలుగేళ్లలో విరాట్‌, రోహిత్‌, శిఖర్‌ త్రయం సాగించిన పరుగుల వరద అప్రతిహతం. టీమిండియా వరుసగా 9 వన్డే సిరీస్‌లు కైవసం చేసుకుందంటే వారి చలవే.

విజయాల శాతం 65

ఈ రెండు ప్రపంచకప్‌ల మధ్య టీమిండియా మొత్తం 86 వన్డేలు ఆడింది. అందులో 56 గెలిచి 27 మ్యాచుల్లో ఓడింది. 3 ఫలితాలు తేలలేదు. ఇక విజయాల శాతం 65.11. ఇందులో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ-2017లో 5, ఆసియాకప్‌-2018లో 6 మ్యాచులు మినహాయిస్తే భారత్‌ 75 ద్వైపాక్షిక వన్డేలు ఆడింది. 48 మ్యాచుల్లో విజయం సాధించగా 24 ఓడింది. విజయాల శాతం 64. ఏ లెక్కన చూసినా భారత ప్రదర్శన అద్భుతమనే చెప్పాలి. జింబాబ్వే, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, శ్రీలంక, దక్షిణాఫ్రికాపై వరుసగా సిరీస్‌ విజయాలు సాధించి ఔరా అనిపించింది. 2018లో ఇంగ్లాండ్‌ అడ్డుపడకుంటే కోహ్లీసేన వరుసగా 14 సిరీస్‌లు గెలిచి ఉండేది. ఏదేమైనప్పటికీ మొత్తంగా నాలుగేళ్ల కాలంలో భారత్‌ 18 సిరీసులు ఆడి 5 ఓడింది.

2015 - సాధారణం

ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో సెమీస్‌ ఓడి నిష్ర్కమించింది. వెంటనే బంగ్లాదేశ్‌ పర్యటనకు బయల్దేరింది. 3 వన్డేల సిరీస్‌ను 1-2 తేడాతో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో 77 పరుగుల తేడాతో ఓడి విస్మయపరిచింది. వరుసగా రెండు మ్యాచుల ఓటమి పాలై చివరి మ్యాచ్‌ గెలిచింది. బంగ్లా పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ తన పేస్‌తో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లి 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అంబటి రాయుడు (165 పరుగులు) మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. చివర్లో స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో 2-3తో ఓడి ధోనీసేన ఈ ఏడాదిని సగటుగా ముగించింది. కాగా 2015లో విరాట్‌, రోహిత్‌, ధావన్‌ చేసిన మొత్తం పరుగులు 1,587. ప్రపంచకప్‌ తర్వాత భారత్‌ 11 మ్యాచుల్లో 6 విజయాలు, 5 అపజయాలతో నిలిచింది.

2016- ఫర్వాలేదు

ఈ ఏడాది భారత్‌ ఎక్కువగా టెస్టు సిరీస్‌లకే ప్రాధాన్యం ఇచ్చింది. ఆస్ట్రేలియా, జింబాబ్వేలో టీమిండియా పర్యటించింది. న్యూజిలాండ్‌ ఉపఖండానికి వచ్చింది. ధోనీసేన మొత్తం 13 మ్యాచులాడి 7 విజయాలు, 6 ఓటములతో సరిపెట్టుకుంది. మొదట ఆసీస్‌ టీమిండియాను కంగారు పెట్టించింది. 4-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది. అయితే వరుస శతకాలతో రోహిత్‌ శర్మ మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. కోహ్లీ, ధావన్‌ సైతం రాణించారు. ఆసీస్‌లో వార్నర్‌, స్మిత్‌, బెయిలీ, ఫించ్‌ చెలరేగారు. టీమిండియా బౌలింగ్‌ కాస్త మెరుగ్గా ఉండుంటే సిరీస్‌ మనవైపు తిరిగేది. తర్వాత జింబాబ్వేని భారత్‌ మళ్లీ 3-0తో ఊడ్చేసింది. ఈ సిరీస్‌లో మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన కేఎల్‌ రాహుల్‌ (196 పరుగులు) అందరినీ ఆకర్షించాడు. ఇక రసవత్తరంగా సాగిన కివీస్‌ సిరీస్‌ను మాత్రం ఎవరూ మర్చిపోలేరు. సిరీస్‌ 2-2తో సమం కావడంతో విశాఖలో జరిగిన చివరి మ్యాచ్‌పై ఉత్కంఠ ఏర్పడింది. రోహిత్‌ (70) చెలరేగడంతో టీమిండియా 269/6తో నిలిచింది. ఛేదనలో అమిత్‌ మిశ్రా 5/18తో విజృంభించడంతో కివీస్‌ 79కే కుప్పకూలింది. మిశ్రా (15 వికెట్లు) మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఈ ఏడాది కోహ్లీ, రోహిత్‌, ధావన్‌ చేసిన పరుగులు 1590.

2017- కోహ్లీ శకం ఆరంభం

భారత క్రికెట్‌ చరిత్రలో విరాట్‌ కోహ్లీ శకం మొదలైంది. ధోనీ నుంచి అతడు పరిమిత ఓవర్ల క్రికెట్‌ పగ్గాలు అందుకున్నాడు. ఇంగ్లాండ్‌ సిరీస్‌తో తన ప్రయాణం మొదలెట్టాడు. ఈ ఏడాది టీమిండియా 6 సిరీస్‌లు ఆడి అన్నీ గెలిచింది. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో మాత్రం ఓడింది. ఇంగ్లాండ్‌పై 2-1, విండీస్‌పై 3-1, శ్రీలంకపై 5-0, ఆస్ట్రేలియాపై 4-1, కివీస్‌పై 2-1, శ్రీలంకపై 2-1తో కోహ్లీసేన విజయ దుందుభి మోగించింది. అయితే ఆసీస్‌పై బంతి, బ్యాటుతో హార్దిక్‌ పాండ్య మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడం ప్రత్యేకం. ఈ సారి విరాట్‌, రోహిత్‌, ధావన్‌ (3,713) పరుగుల సునామీ సృష్టించారు. శతకాల మోత మోగించారు. భారత్‌ 29 మ్యాచుల్లో 21 గెలిచి 7 ఓడింది. 1 మ్యాచ్‌ రద్దైంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచుంటే బాగుండేది.

2018-మళ్లీ విరాట్‌ పర్వం

ఈ ఏడాది కోహ్లీసేన మూడు సిరీసులు ఆడి 2 గెలిచింది. దక్షిణాఫ్రికాను వారి సొంతగడ్డపై 5-1 తేడాతో ఓడించి రికార్డు సృష్టించింది. విరాట్‌ ఏకంగా మూడు శతకాలు బాదేసి మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌ కైవసం చేసుకున్నాడు. 112, 46*, 160*, 75, 36, 129* అతడి స్కోర్లు. ధావన్‌ రాణించగా రోహిత్‌ విఫలమయ్యాడు. మణికట్టు మాంత్రికులు కుల్‌దీప్‌ యాదవ్‌ (17), యుజువేంద్ర చాహల్‌ (16) కలిసి 33 వికెట్లు తీశారు. విజయోత్సాహంతో ఉన్న కోహ్లీసేనకు ఇంగ్లాండ్‌ చేతిలో 1-2తో పరాభవం తప్పలేదు. జో రూట్‌ రెండు శతకాలతో మణికట్టు ద్వయం వ్యూహాన్ని ఛేదించాడు. విరాట్‌ లేకున్నా రోహిత్‌ ఆసియా ట్రోఫీ అందించిన సంగతి తెలిసిందే. ఇక చివర్లో వెస్టిండీస్‌పై 3-1తో గెలిచింది భారత్‌. విరాట్‌ వరుసగా 3 శతకాలతో దుమ్మురేపాడు. 140, 157*, 107, 16, 33* చేశాడు. మొత్తంగా భారత్‌ 20 మ్యాచుల్లో 14 గెలిచి 4 ఓడింది. 2 మ్యాచుల్లో ఫలితం తేలలేదు.

2019- ఆసీస్‌తో షాక్‌

ఐపీఎల్‌ వల్ల టీమిండియా 3 సిరీస్‌లే ఆడింది. తొలుత ఆసీస్‌ గడ్డపై కంగారూలను 2-1తో ఓడించింది. చాన్నాళ్ల తర్వాత ఎంఎస్‌ ధోనీ మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌ గెలిచాడు. 3 మ్యాచుల్లో 3 అర్ధశతకాలతో 193 పరుగులు చేశాడు. అక్కడ్నుంచి న్యూజిలాండ్‌ వెళ్లిన భారత్‌ ఆతిథ్య జట్టును 4-1తో ఓడించి రికార్డులు తిరగరాసింది. మహ్మద్‌ షమి 9 వికెట్లతో మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌ కొట్టేశాడు. అంబటి రాయుడు (190), ధావన్‌ (188) రాణించారు. ఈ రెండు సిరీసుల్లో విజయ్‌ శంకర్‌ బంతి, బ్యాటుతో ఆకట్టుకొని ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే. అయితే విజయాలతో సొంతగడ్డకు వచ్చిన టీమిండియాకు తిరుగులేని షాకిచ్చింది ఆసీస్‌. 3-2తో సిరీస్‌ గెలిచి ఔరా అనిపించింది. తొలి రెండు మ్యాచుల్లో కోహ్లీసేనదే విజయం. అనూహ్యంగా చివరి మూడు మ్యాచుల్లో ఉస్మాన్‌ ఖవాజా 104, 91, 100తో అద్వితీయ ఆటతీరు ప్రదర్శించాడు. అతడికి మిగతా వారి సహకారం లభించింది. ఈ ఏడాది భారత్‌ 13 మ్యాచుల్లో 8 గెలిచి 5 ఓడింది.

ఈనాడు.నెట్‌ ప్రత్యేకం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.