close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఓటరు చూపు ఎటువైపు?

 హరియాణాలో తెరపైకి ‘ఎన్‌ఆర్‌సీ’
 ‘జాట్‌’ ఓట్లపైనా నేతల ఆశలు

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా రెండు అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. ఎప్పుడూ కీలకంగా ఉండే సామాజిక వర్గాల సమీకరణాలతో పాటు.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తెరపైకి తెచ్చిన ‘జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)’ వ్యవహారం కూడా రాజకీయాలను వేడెక్కిస్తోంది. అసోంలో ఎన్‌ఆర్‌సీ అమలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ పట్టికలో పేరు లేకపోతే అలాంటి వారిని విదేశీ పౌరులుగా పరిగణిస్తారు. దీన్ని హరియాణాలోనూ అమలు చేస్తామంటూ ఖట్టర్‌ ప్రకటించడంతో ఇది ఎన్నికల అంశంగా మారింది.

రాష్ట్రంలో ‘ఎన్‌ఆర్‌సీ’ ప్రాచుర్యంలోకి రావడం వెనుక కొన్ని కీలకాంశాలున్నాయి. ఫరీదాబాద్‌, గురుగ్రామ్‌, పానిపట్‌, సొనేపట్‌, యమునానగర్‌ జిల్లాల్లో స్థానికుల కంటే వలసవచ్చిన వారి జనాభాయే ఎక్కువ. ఫరీదాబాద్‌, గురుగ్రామ్‌లలో వలసదారులతో అనేక కాలనీలు కూడా ఏర్పడ్డాయి. 1996లో హరియాణాలో అనేక పరిశ్రమలు వెలిసిన తర్వాత ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు దేశాల నుంచి కూడా చాలామంది వలస వచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఆర్‌సీ అమలుకు హరియాణా ప్రభుత్వం ప్రకటన చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా ఇలాంటి సున్నిత అంశాలపై ముఖ్యమంత్రి ప్రకటన చేయడమేమిటని ప్రశ్నిస్తున్నాయి. హరియాణా ఎన్నికల్లో జాట్లు, జాట్‌యేతరుల అంశం ఎప్పుడూ కీలకంగానే ఉంటుంది. రాజకీయ పార్టీలు ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు ఓట్ల కోసం దీన్ని లేవనెత్తుతుంటారు. ఇప్పుడు ‘ఎన్‌ఆర్‌సీ’ కూడా ఎన్నికల అంశంగా మారింది.

‘జాట్’ ఓట్లు కీలకం
హరియాణా రాజకీయాల్లో నేతలు ‘సామాజిక వర్గాల’ వారీగా లెక్కలు వేస్తుంటారు. రాష్ట్రంలో జాట్‌ సామజిక వర్గ జనాభా 27 శాతం వరకు ఉంది. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్‌ నేత భూపీందర్‌ హుడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. పానిపట్‌, రోహతక్‌, సొనేపట్‌ ప్రాంతాల్లో ఆయనకు మంచి పట్టుంది. దీంతో భాజపా ఇతర సామాజిక వర్గాలను ఏకం చేసి ఖట్టర్‌ను వారి ప్రతినిధిగా చూపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ దళిత వర్గానికి చెందిన కుమారి సెల్జాను పీసీసీ అధ్యక్షురాలిగా నియమించింది. జాట్‌-దళిత సమీకరణంపై కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకోగా, ఇది ఎంతవరకు ఫలిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గత లోక్‌సభ ఎన్నికల్లో భూపీందర్‌ హుడా సొనేపట్‌ నుంచి, ఆయన కుమారుడు దీపేంద్ర రోహతక్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో జాట్‌ల ఓటుబ్యాంకు కొందరికే పరిమితం కాదన్న వాదనలూ ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జాట్‌యేతర సామాజిక వర్గాల మద్దతుతోనే భాజపా విజయం సాధించిందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈసారి సమీకరణాలు తమకు అనుకూలంగా ఉన్నాయని కాంగ్రెస్‌ నాయకులు అంచనా వేస్తున్నారు. కాగా ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ)ని స్థాపించిన మాజీ ఉప ప్రధాని దివంగత దేవీలాల్‌ (చౌతాలా వంశం); ఆయన వారసులు కూడా జాట్‌ సామాజికవర్గానికి చెందినవారే. చౌతాలా కుటుంబ నేతలు పలువురు బరిలో ఉన్న నేపథ్యంలో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి.

జాబితాలు.. టికెట్లు

* హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులతో జన్‌నాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) జాబితాను విడుదల చేసింది. పార్టీ అగ్రనేత దుష్యంత్‌ చౌతాలా; ఆయన తల్లి, దబ్‌వాలీ ఎమ్మెల్యే నైనా చౌతాలా తదితరులు జాబితాలో ఉన్నారు.
* కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 90 స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించింది.
* హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌ హుడా గర్హి శాంప్లా-కిలోయి నుంచి బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా కైథల్‌ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ 17 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు గాను 16 మందికి టికెట్లు ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత భజన్‌లాల్‌ ఇద్దరు కుమారులకు; మరో మాజీ ముఖ్యమంత్రి దివంగత బన్సీలాల్‌ కుమారుడు, కోడలికి టికెట్లు ఇచ్చింది.

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.