close

ప్ర‌త్యేక క‌థ‌నం

కమలం నీడలో దేవేంద్రజాలం!

మహారాష్ట్రలో ఫడణవీస్‌ ముద్ర
మోదీ నమ్మకాన్ని నిలబెట్టిన నేత
ప్రతిపక్షాలకు అవకాశమివ్వని సీఎం
ఐదేళ్లూ పాలించిన ఘనత

రాజకీయాల్లో తలపండిన ఉద్దండులున్న మహారాష్ట్రలో ఐదేళ్ల కిందట ఓ భాజపా యువనేత చేతికి ముఖ్యమంత్రి పగ్గాలను అప్పగించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. అప్పటికి ఆయనకు కనీసం రాష్ట్ర మంత్రిగా చేసిన అనుభవం కూడా లేదు. రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి కూడా కాదు. కానీ మోదీ తనపై ఉంచిన నమ్మకాన్ని నూటికి నూరు పాళ్లూ నిలబెట్టుకుని సత్తా చాటారు. తగినంత మెజారిటీ లేకున్నా.. పార్టీని తన చతురతతో ఐదేళ్లు దిగ్విజయంగా అధికారంలో నిలబెట్టారు. ఆయనే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన భాజపాలో శక్తిమంతమైన నేతల్లోనూ.. మంచి పాలకుల్లోనూ ఒకరిగా మారారు.

దేవేంద్రుడు.. నరేంద్రుడు

ప్రధాని మోదీకి.. దేవేంద్ర ఫడణవీస్‌కు కొన్ని పోలికలున్నాయి. మోదీ తొలుత ప్రధానిగా బాధ్యతలు చేపట్టక ముందు కేంద్రంలో మంత్రిగానే కాదు.. ఎంపీగా కూడా పనిచేయలేదు. ఫడణవీస్‌ కూడా రాష్ట్ర మంత్రిగా చేయకుండానే సీఎం అయ్యారు. మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హోంశాఖను తనవద్ద ఉంచుకున్నట్లే ఫడణవీస్‌ కూడా ఆ శాఖను తనవద్ద ఉంచుకున్నారు. ఫడణవీస్‌ను గొప్ప మేధావిగా రాజకీయ ప్రముఖులు చెబుతుంటారు. చురుకైన ఆలోచనలు, జ్ఞాపకశక్తి ఆయన సొంతం. 27 ఏళ్లకు అత్యంత పిన్న వయస్కుడైన మేయర్‌గా నాగ్‌పుర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పగ్గాలు చేపట్టారు. 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాటికే 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు పుట్టినిల్లు అయిన నాగ్‌పుర్‌ ఆయన సొంత పట్టణం. ఆయన కుటుంబానికీ ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉంది.

రాజేంద్ర సాఠే
ఈటీవీ భారత్‌ ప్రతినిధి

ది 1978.. మహారాష్ట్రకు అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనతను శరద్‌ పవార్‌ (నాటికి 38 ఏళ్లు) సాధించారు. ఆ తర్వాత 2014లో రెండో అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా ఘనత సాధించింది దేవేంద్ర ఫడణవీస్‌ (44). గత 60 ఏళ్లలో పూర్తికాలం (ఐదేళ్లు) ముఖ్యమంత్రిగా ఉన్నవారిలోనూ ఫడణవీస్‌ రెండో వ్యక్తి. ఈ కాలంలో ఆయన భాజపాను రాష్ట్రంలో బలమైన శక్తిగా మార్చడమే కాకుండా పాలనలోనూ తనదైన ముద్ర వేశారు. అలాగని ఆయనకు సవాళ్లు ఏమీ ఎదురుకాలేదని కాదు.. ప్రతిసారీ వాటిని చాకచక్యంగా అధిగమిస్తూ వచ్చారు.

రాజకీయ చతురుడు..
2014లో ఫడణవీస్‌ ముఖ్యమంత్రి అయ్యేనాటికి భాజపాకు అసెంబ్లీలో తగినంత మెజార్టీ లేదు. మొత్తం 288 స్థానాలకు గాను కమలానికి 122 మాత్రమే వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు గాను 41 స్థానాలు సాధించిన ఎన్‌సీపీ సాయాన్ని ముందు తీసుకున్నారు. అయితే ఎన్‌సీపీపై భాజపా ఆధారపడేలా చేయాలన్న శరద్‌ పవార్‌ వ్యూహం ఫలించకుండా సరైన ఎత్తుగడ వేశారు. 63 స్థానాలు సాధించిన శివసేనలో కీలకమైన నేతలను భాజపా వైపు ఆకర్షించేలా చేయడం ద్వారా ఆ పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేను ఆలోచనలో పడేశారు. ప్రతిపక్షంలో కూర్చుంటే పార్టీలో చీలిక వచ్చే అవకాశం ఉందని ఉద్ధవ్‌ గుర్తించారు. నెల రోజులకే ప్రభుత్వంలో శివసేన చేరింది. దీంతో ఎన్‌సీపీ సాయం అవసరం లేకపోయింది. అప్పట్లో ముఖ్యమంత్రి పదవికి సీనియర్లు ఎంతోమంది పోటీపడినా తనకు ఆ బాధ్యతలు అప్పగించడం సరైన నిర్ణయమేనని ఫడణవీస్‌ నిరూపించుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా భాజపా గణనీయ ఫలితాలు సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. శివసేనతో పొత్తుతో బరిలోకి దిగిన భాజపా.. మొత్తం 48కి గాను 23 లోక్‌సభ స్థానాలు సాధించింది.

శివసేనతో వ్యవహారం..
నాలుగేళ్ల పాటు శివసేన.. ఇదే ప్రభుత్వాన్ని, మోదీని, అమిత్‌ షాను, ఫడణవీస్‌ను కూడా వివిధ సందర్భాల్లో విమర్శిస్తూ వచ్చింది. తర్వాత మున్సిపల్‌ ఎన్నికల్లో ఒంటరిగా పోరాడింది. శివసేనకు కంచుకోట అయిన ముంబయిలో నగరపాలక ఎన్నికల్లో ఆ పార్టీని ఫడణవీస్‌ కంగు తినిపించారు. శివసేనతో దాదాపు సమానంగా భాజపాకు స్థానాలు దక్కాయి.

ప్రతిపక్షాలకు అవకాశమివ్వకుండా..
ప్రతిపక్షంలో అనుభవజ్ఞులైన వారున్నప్పటికీ ఆ నేతలు ప్రభుత్వంపై బురద చల్లేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఫడణవీస్‌ పనిచేశారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడాదిలోపే ముంబయిలో కల్తీ మద్యం తాగి 100 మందికి పైగా చనిపోయారు. ముఖ్యమంత్రి తక్షణం స్పందించి 8 మంది పోలీసు అధికారులను సస్పెండ్‌ చేశారు.

గత ఐదేళ్లలో అనేక జిల్లాల్లో కరవు ఛాయలు అలముకున్నాయి. ఫడణవీస్‌ అమలు చేసిన జల సంరక్షణ పథకం మరఠ్వాడా జిల్లాల్లో పెద్దగా ఫలితాలివ్వలేకపోయింది. అయితే వర్షాల్లేకపోవడంతో నీటిని సంరక్షించలేకపోయామని ప్రజలను ఒప్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు.
వ్యవసాయ సంక్షోభం కారణంగా 2016 నుంచి మహారాష్ట్రలో పలు రైతు ఆందోళనలు జరిగాయి. ఎన్నడూలేని విధంగా రైతులు సమ్మెకు పిలుపునిచ్చారు. అదే సమయంలో రుణమాఫీని ప్రకటించడం ద్వారా ఫడణవీస్‌ ఈ సంక్షోభం నుంచి బయటపడ్డారు. సుదీర్ఘంగా నలుగుతున్న మరాఠా రిజర్వేషన్‌ అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురాగలిగారు.
ప్రస్తుత ఎన్నికల్లో భాజపా టికెట్ల కోసం ఎక్కువమంది పోటీపడినా కేటాయింపులో వివాదాలు లేకుండా చూడగలిగారు. ఏక్‌నాథ్‌ ఖడ్సే, వినోద్‌ తావ్డే వంటి వారికి టికెట్లు దక్కవని ఇంతవరకూ ఎవరూ ఊహించనే లేదు. కానీ ఫడణవీస్‌ దాన్ని సాధ్యం చేశారు. కొందరు మంత్రులకు కూడా టిక్కెట్లు ఇవ్వకపోయినప్పటికీ ఇబ్బందుల్లేకుండా జాగ్రత్త పడ్డారు.

అదొక్కటే లోటు..
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే ఫడణవీస్‌ మరింత ఎత్తుకు ఎదుగుతారన్నది రాజకీయ పండితుల అంచనా. అయితే ఆయన ఇప్పటికీ ‘మాస్‌ లీడర్‌’ అనిపించుకోలేదు.

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.