close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఉల్లి @ 100

కర్నూలులో క్వింటా రూ.10,180
కిలోకి ఒక్కసారిగా రూ.25 పెంచి విక్రయం
ఆందోళన చెందుతున్న కొనుగోలుదారులు
ఈనాడు- అమరావతి, డిజిటల్‌ ఏలూరు, తాడేపల్లిగూడెం గ్రామీణ, కర్నూలు, న్యూస్‌టుడే

ఉల్లి ధర ఏటా లొల్లి చేస్తోంది. గత వారం కిలో పాత ఉల్లిపాయలను రూ.75కు అమ్మగా... ఈ వారం రూ.100కు ధర చేరింది. కిలోకి ఒక్కసారిగా రూ.25 పెరగడంతో కొనుగోలుదారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో నాలుగు కిలోల ఉల్లిని తీసుకెళ్లేవారు... ఇప్పుడు ఒక కిలోతో సరిపెట్టుకుంటున్నారు. మరో పక్క రికార్డు స్థాయిలో కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం క్వింటా గరిష్ఠంగా రూ.10,180 పలికింది. గిరాకీ పెరిగినందున నవంబరు మొదటివారంలో క్వింటా రూ.4వేలు, రెండోవారంలో రూ.5వేలు, మూడోవారంలో రూ.6వేలు, చివరివారంలో రూ.7వేలకు ధర చేరుకున్న విషయం విదితమే. ప్రస్తుతం డిసెంబరు మొదట్లోనే రూ.10వేలకుపైగా ధర పలికింది. పాత ఉల్లిపాయలు (మహారాష్ట్ర రకం) రూ.100, కర్నూలు రకం రూ.60 నుంచి రూ.70 వరకూ విక్రయిస్తున్నారు. కర్నూలు ఉల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండదు. మహారాష్ట్ర ఉల్లి ఆరు నెలల వరకూ నిల్వ ఉంటుంది. దీని వల్ల ఈ రెండింటి ధరలో చాలా వ్యత్యాసం ఉంటోంది. గతేడాది కర్నూలు నుంచి తాడేపల్లిగూడెం మార్కెట్‌కు 5,53,301 క్వింటాళ్ల ఉల్లి రాగా ఈ ఏడాది ఇప్పటి వరకూ 2,85,665 క్వింటాళ్ల ఉల్లి మాత్రమే వచ్చిందంటే... పరిస్థితి ఏవిధంగా ఉందో తేటతెల్లమవుతోంది.  ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.  ఈ ధరలు ఇప్పుడిప్పుడే తగ్గేలా లేవని... వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని తాడేపల్లిగూడెం మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

విదేశీ ఉల్లిని ఏపీకి ఇవ్వండి: సీఎస్‌
కేంద్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉల్లిని.. రాష్ట్రానికీ సరఫరా చేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని కోరారు. ఉల్లి సరఫరా, ధరల నియంత్రణపై సోమవారం కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ వివిధ రాష్ట్రాల సీఎస్‌లతో వీడియో సమావేశం నిర్వహించారు. సీఎస్‌ సాహ్ని మాట్లాడుతూ రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే అందుబాటులో ఉంచామని, జనవరి నాటికి కొత్త ఉల్లి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు. ఉల్లి అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయంపై దాడులకు ఆదేశించామన్నారు. మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూదన్‌రెడ్డి, ప్రత్యేక కమిషనర్‌ ప్రద్యుమ్న పాల్గొన్నారు.

మదనపల్లె మార్కెట్‌లో కిలో టమాటా రూ.48

మదనపల్లె (పట్టణం), న్యూస్‌టుడే: స్థానిక మార్కెట్‌లో కిలో టమాటా ధర సోమవారం రూ.48 పలికింది. నెల రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ వస్తున్న ధరలు సోమవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. 30 కిలోల బరువున్న క్రేట్‌ ధర గరిష్ఠంగా రూ.1440 పలికింది. దిగుబడి తగ్గటంతో ధరలు పెరిగాయని వ్యాపారవర్గాలు తెలిపాయి. అయిదు రోజులుగా జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీనితో దిగుబడి తగ్గింది. సోమవారం మార్కెట్‌ యార్డుకు 220 మెట్రిక్‌ టన్నుల టమాటాలను మాత్రమే రైతులు తీసుకొచ్చారు. దీంతో ధర అనూహ్యంగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.