Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

సెల్ఫీతో.. సేవలు

సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన రవాణా శాఖ 
టీయాప్‌ ఫోలియోతో అనుసంధానానికి కసరత్తు 
తొలి దశలో 30 సేవలకు అమలు యోచన

ఈనాడు, హైదరాబాద్‌: డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకోవాలంటే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి ఫొటో దిగాలి. పాత వాహనం తాలూకు పత్రాలు మరో పేరు మీద బదిలీ చేయించుకోవాలన్నా ఇదే తంతు. ఈ అవస్థలకు ముగింపు పలకాలని, నేటి తరం ఆకాంక్షలకు అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రవాణా శాఖ నిర్ణయించింది.  టీయాప్‌ ఫోలియో సాయంతో ఇంట్లో నుంచే ఫొటో అప్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించబోతోంది. 
రోజుకు సగటున పది వేల మంది వరకు వివిధ సేవల కోసం రవాణా శాఖ కార్యాలయాలకు వస్తుంటారు. ఈ క్రమంలో దళారులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా శాఖలో అవినీతి వేళ్లూనుకుంది. ప్రజలు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేని విధానాన్ని ఆవిష్కరించడం ద్వారా మాత్రమే శాఖలో పారదర్శకత సాధించడంతోపాటు, అవినీతిని తగ్గించగలమని రహదారులు-భవనాలు, రవాణా శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి భావించారు. ‘‘టీయాప్‌ ఫోలియో’’ పేరుతో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన వ్యవస్థతో అనుసంధానం కావాలని అధికారులను ఆదేశించారు. దీనిపై అధ్యయనం చేయాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మకు సూచించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా దశల వారీగా అనుసంధానం చేయవచ్చు అని అధికారులు నిర్ధారించుకున్నారు. 
‘‘రెండు దశల్లో సేవలను టీయాప్‌ ఫోలియోతో అనుసంధానం చేయాలని నిర్ణయించాం. తొలి దశలో 30 సేవలను అనుసంధానిస్తాం. అధ్యయనం చేసిన మీదట రెండో దశలో వాహనాల రిజిస్ట్రేషన్‌, రుణంతో వాహనం తీసుకున్నప్పుడు జరిగే ప్రక్రియ (హైపోథికేషన్‌) తదితర సేవలకు కూడా అమలు చేస్తాం’’ అని ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 
అనుసంధానం ఇలా 
ఆ యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 
ఉన్న చోటు నుంచే యాప్‌లోని కెమెరా సాయంతో సెల్ఫీ తీసుకుని, దాన్ని దరఖాస్తుతోపాటు అప్‌లోడ్‌ చేయాలి.(గతంలో తీసుకున్న ఫొటోను కెమెరా ముందు ఉంచి క్లిక్‌ చేసేందుకు ప్రయత్నిస్తే యాప్‌ తిరస్కరిస్తుంది. అప్పటికప్పుడు(లైవ్‌) తీసుకుంటేనే అనుమతిస్తుంది) 
ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డు సహా ఇతర సేవల కోసం గతంలో రవాణా శాఖ కార్యాలయంలో దిగిన ఫొటోలను, తాజా ఫొటోతో యాప్‌ సరిపోల్చుకుంటుంది. వయసు రీత్యా ముఖ కవళికల్లో వచ్చేమార్పులను కూడా యాప్‌ పరిశీలిస్తుంది. కృత్రిమ మేధ, మిషన్‌ లెర్నింగ్‌  విధానంలో ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది. 
అన్నీ సరిపోలితే తక్షణం దరఖాస్తుకు ఆమోదం తెలుపుతుంది. 
అన్ని అనుమతుల తర్వాత సంబంధిత ధ్రువపత్రం దరఖాస్తుదారులకు తొలుత ఆన్‌లైన్‌లో పంపుతారు. తర్వాత ఇంటికే పంపిస్తారు. 
కార్యాలయాలకు రానక్కరలేదు 
సి.రమేష్‌, రవాణా శాఖ సంయుక్త కమిషనర్‌ 
రవాణా శాఖలో ప్రస్తుతం 60 రకాల సేవలు అందుతున్నాయి. అందులో 59 సేవలకు ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానం అమల్లో ఉంది. అయినప్పటికీ ఫొటోలు దిగడం కోసం వినియోగదారులు కార్యాలయాలకు వెళ్లక తప్పడం లేదు. రానున్న రోజుల్లో ఏ పని కోసమూ ప్రజలు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలన్నదే మా లక్ష్యం. అందులో భాగంగానే టీయాప్‌ ఫోలియో వ్యవస్థను వినియోగించుకునేందుకు కసరత్తు చేస్తున్నాం. సంబంధిత ప్రతిపాదనలను త్వరలోనే ప్రభుత్వానికి పంపేందుకు కసరత్తు చేస్తున్నాం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.