close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఇదీ మిషన్‌ కశ్మీర్‌

బిల్లు ముద్రణ నుంచి ఆమోదం వరకు.. సాయంత్రంలోపే 
సభను నియంత్రించిన వెంకయ్యనాయుడు 
ఈనాడు - దిల్లీ

శ్మీర్‌ విభజన, 370 అధికరణం రద్దుకు కేంద్రం ఎత్తులు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించాయి. మూడోకంటికి తెలియకుండా వ్యవహారాలు నడిపిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా అన్నీ సిద్ధం చేసుకున్నాక బిల్లును తొలుత రాజ్యసభలో పెట్టి ఆమోదింపజేసుకోవాలన్న వ్యూహం రచించారు. రాజ్యసభలో సంఖ్యాబలం తక్కువైనా.. ఛైర్మన్‌ వెంకయ్యనాయుడుపై విశ్వాసంతో అనుకున్న సమయానికి సభామోదం పొందాలని నిర్ణయించారు. లోక్‌సభలో ప్రవేశపెడితే గందరగోళం చెలరేగి బిల్లుకు అడ్డంకులు ఎదురవుతాయని రాజ్యసభను ఎంచుకున్నారు.

వెంకయ్య వద్దకు మోదీ 
ముందుగా ప్రధాని మోదీ ఆదివారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయినట్లు తెలిసింది. అధికారవర్గాలు దీన్ని ధ్రువీకరించలేదు. విషయం అందరికీ తెలిసేలోపు రాజ్యసభలో బిల్లులు ఆమోదింపజేసుకుని విపక్షాలపై నైతిక విజయం సాధించాలన్న ఉద్దేశంతో తొలుత రాజ్యసభలోనే ప్రవేశపెట్టి నాలుగ్గంటల్లో ముగించేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు వెంకయ్యనాయుడి సాయం కోరారు. విషయం బయటపడి కశ్మీర్‌లో అలజడి రేగకుండా ఉండేందుకు సభాధ్యక్షుడి విశేషాధికారాలను ఉపయోగించి అన్నీ ఒక్కరోజులోనే పూర్తయ్యేలా చూడాలని ప్రధాని కోరినట్లు సమాచారం. దాంతో వెంకయ్యనాయుడు గతంలో ఇలాంటి సందర్భాలున్నాయా అని పరిశోధించి విశేషాధికారాలు ప్రయోగించే అధికారం సభాధ్యక్షుడికి ఉందని నిర్ణయించుకున్నారు. అన్నీ రూఢి చేసుకున్నాక రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు సరే అన్నట్లు తెలిసింది.

విషయం మొదలైందిలా.. 
సోమవారం ఉదయం బిల్లు విషయం బయటకు తీశారు. మంత్రివర్గం ముందు పెట్టారు. అప్పటికింకా బిల్లుకాపీలు ముద్రించలేదు. బిల్లు ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి అనుమతి ఇవ్వగానే 275 కాపీల ముద్రణకు ఆదేశించారు. ఉదయం 11 గంటలకు అమిత్‌షా రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టే సమయానికి జమ్మూకశ్మీర్‌లోని అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ల అమలు బిల్లు తప్ప కశ్మీర్‌ విభజన బిల్లు లేదు. అప్పటికి కాపీలు రాలేదు. అయినా, సభాధ్యక్షుడి అనుమతితో రెండు బిల్లులు, రెండు తీర్మానాలు ఒకేసారి ప్రవేశపెడుతున్నట్లు సభలో షా ప్రకటించారు. కశ్మీర్‌ విభజన, 370 అధికరణ అంశాలు తొలుత చదవకుండా బిజినెస్‌లో లిస్టయిన రిజర్వేషన్ల బిల్లు గురించి చెప్పి తర్వాత ఈ అంశాలు ప్రస్తావించారు. అప్పటికే ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేసినా, తన విశేషాధికారాలను ఉపయోగించి హోంమంత్రికి అనుమతిచ్చానని వెంకయ్య నాయుడు చెప్పారు. అప్పుడు వెంకయ్యనాయుడు సమయస్ఫూర్తితో అమిత్‌షా ప్రవేశపెట్టిన బిల్లుల్లో తొలుత 10% రిజర్వేషన్‌ బిల్లు ఉంది కాబట్టి దానిపై చర్చ మొదలుపెట్టాలన్నారు. ప్రతిపక్షాలు అందుకు అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆందోళనకు దిగడంతో బిల్లు కాపీలు తెప్పించుకొనే సమయం ప్రభుత్వానికి దొరికింది. వెంకయ్యనాయుడు ఇద్దరు సభ్యులను మార్షల్స్‌తో బయటకు పంపించడం మిగతా విపక్ష సభ్యులకు హెచ్చరికగా పనిచేసింది. అప్పుడే బిల్లుకు మద్దతిస్తున్నామని బీఎస్పీ సభాపక్షనేత సతీష్‌చంద్ర మిశ్ర ప్రకటించడం ప్రతిపక్షాలకు పిడుగుపాటైంది. బిల్లుకాపీలు రావడంతో సభాధ్యక్షుడు దాన్నే చర్చకు తీసుకొచ్చారు.

నాలుగు గంటలు.. ఏడుగంటలైంది 
సోమవారమే బిల్లును రాజ్యసభలో ఆమోదింపజేసుకోవాలన్నది ప్రభుత్వ సంకల్పం. సాయంత్రం 4లోగా అది ముగియాలని కోరగా, అందుకు వెంకయ్యనాయుడు సరేనన్నారు. చర్చ ప్రారంభానికి గులాం నబీ ఆజాద్‌ పేరు పిలిచినా ఆయన రాక  పోవడంతో భాజపా సభ్యుడు భూపేందర్‌యాదవ్‌ ద్వారా శ్రీకారం చుట్టించారు. ఎన్డీయే మిత్రపక్షాలు చర్చలో పాల్గొనడంతో బిల్లును వ్యతిరేకించేవారు నీరసపడ్డారు. బిల్లులైతే ఒకసభలో ఆమోదం తర్వాత మరోసభకు వెళ్లాలి. తీర్మానాలైతే రెండుసభలూ ఒకేరోజు ఆమోదిస్తేనే రాష్ట్రపతి సంతకానికి వీలవుతుంది. 370, 35ఎ రద్దుకు సంబంధించినవి తీర్మానాలు కావడంతో వాటికి సోమవారమే ఉభయసభల ఆమోదం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. దాంతో అమిత్‌షా లోక్‌సభకు వెళ్లి వాటిని ప్రవేశపెట్టారు. అక్కడ కొంత ఆలస్యమైంది. అప్పటికే రాజ్యసభలో ప్రసంగాలు పూర్తయ్యాయి. మాట్లాడేందుకు ఎవరూ రాకపోవడంతో సభను వాయిదావేయాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ సభాధ్యక్షుడు మరోసారి సమయస్ఫూర్తి ప్రదర్శించి సభ్యులకు ప్రత్యేక ప్రస్తావన చేసే అవకాశాన్ని కల్పించారు. దీన్నెవరూ వ్యతిరేకించలేదు. సరిగ్గా 5.30కి అమిత్‌షా, ప్రధాని రాజ్యసభలోకి అడుగుపెట్టడంతో బిల్లుపై జరిగిన చర్చకు సమాధానం, సభామోదం చకచకా జరిగిపోయాయి. అత్యంత వివాదస్పద సమయంలోనూ ఒక్క నిమిషం కూడా సభను వాయిదావేయకుండా సభను సమర్థంగా నడిపించడంలో వెంకయ్యనాయుడు తన అనుభవాన్నంతా రంగరించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.