Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

శాశ్వత ప్రగతికి ప్రణాళికలు

కేసీఆర్‌ ఆలోచనలకు కార్యరూపం 
బంగారు తెలంగాణవైపు వడివడిగా అడుగులు 
ప్రగతిపై ప్రజలకు సమగ్ర సమాచారం 
‘ఈనాడు’ ముఖాముఖిలో ప్రణాళికా సంఘం నూతన ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ 
ఈనాడు - హైదరాబాద్‌

‘‘తెలంగాణ అభివృద్ధికి శాశ్వత ప్రణాళికల రూపకల్పనలో కొత్త ఒరవడి రాబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షిస్తున్న బంగారు తెలంగాణ వైపు వడివడి అడుగులకు ఇది దోహదపడుతుంది. అణగారిన వర్గాల ప్రజలు, యువతరానికి ఆత్మవిశ్వాసం కలిగించడంపై దృష్టి పెడతాం’’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం నూతన ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఛైర్మన్‌ కూడా అయిన కేసీఆర్‌ నేతృత్వంలో ప్రణాళికా సంఘం ద్వారా రాష్ట్రం సాధించిన ప్రగతిని పక్కా లెక్కలతో ప్రతి ఒక్కరికీ తెలియజేస్తామని చెప్పారు. ప్రణాళికల రూపకల్పనలో మేధావులు, నిపుణులు, సామాజికవేత్తలు, ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తామన్నారు. ప్రణాళికా సంఘం నూతన ఉపాధ్యక్షునిగా నియమితులైన ఆయన శనివారం ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలు వందశాతం కార్యరూపం దాల్చేందుకు అనువైన మార్గాలను సూచించాలన్నదే తమ లక్ష్యమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ తెలిపారు. ముఖాముఖీ వివరాలివీ..

? కేసీఆర్‌ అప్పగించిన కొత్త బాధ్యతల గురించి మిమ్మల్ని విశ్లేషించమంటే... 
ఇదో గొప్ప అవకాశం. ఇటీవల ప్రజల తీర్పు మేరకు మళ్లీ పార్లమెంటుకు వెళ్లే అవకాశం లభించలేదు. సీఎం నన్ను పిలిచి రాజ్యసభ సభ్యత్వం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవుల్లో ఒకటి ఇస్తామన్నారు. రెండుసార్లు ఎంపీగా పనిచేయడంతో పాటు రాజకీయాల్లో, పాలనాంశాల్లో ఉన్న అనుభవం, రాష్ట్ర భౌగోళిక, సామాజిక, ఆర్థిక అంశాల పట్ల అవగాహన దృష్ట్యా నా సేవలు వినియోగించుకోవాలనే ఈ నియామకం చేపట్టినట్లు సీఎం చెప్పారు. ఇప్పుడు నాకు నేరుగా ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది. 2014లో తెలంగాణ ఆవిర్భావానికి ముందు కరీంనగర్‌ జిల్లాలో గోపాలపురం గ్రామస్థులు నన్ను కలిసినప్పుడు వరద కాలువకు పుష్కలంగా నీళ్లు వస్తాయని, చేపల చెరువులు ఏర్పాటు చేసే రోజు వస్తుందని చెబితే అందరూ విస్మయం చెందారు. అలాంటివన్నీ కేసీఆర్‌ వల్ల నిజమవుతున్నాయి.

? తాజా బాధ్యతల్లో మీ ఆలోచనా రీతులు ఎలా ఉన్నాయి? 
ప్రణాళికా సంఘం.. అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తుంది. కేంద్రంలో గతంలో ప్రణాళికా సంఘం ఉండేది. ఎన్డీయే ప్రభుత్వం దాన్ని తొలగించి, నీతి ఆయోగ్‌ను తెచ్చింది. రాష్ట్రాల్లో ఆర్థిక శాఖకు అనుసంధానంగా ప్రణాళికా సంఘం ఉంటోంది. ప్రతి అంశంపైనా లోతుగా అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిస్తాం. మావన్నీ సూచనలు మాత్రమే. వాటిని అనుసరించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. పెద్దఎత్తున పెట్టుబడులు తరలివచ్చేలా రాష్ట్ర దృశ్యాన్ని ఆవిష్కరిస్తాం. సీఐఐ, ఫిక్కి ఇతర సంఘాల వారితో మాట్లాడతాం. రాష్ట్రమంత్రిత్వ శాఖలు ఇందులో ప్రధానపాత్ర పోషిస్తాయి.

? తెలంగాణ పయనంపై మీ గమనంలోని అంశాలేమిటి? 
తెలంగాణ అన్నింటా ముందు వరుసలో ఉంది. గతంలో తెలంగాణ అభివృద్ధి అంతంతమాత్రమే. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్ర జలవనరుల సంఘం ఛైర్మన్‌ వచ్చి తెలంగాణను గొప్పగా పొగిడారు. కాళేశ్వరం లాంటి అద్భుత ప్రాజెక్టును చూడలేదని ప్రశంసించారు. గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల గురించి గతంలో తెలంగాణ ప్రజలకు అంతగా తెలియదు. కేసీఆర్‌ వీటిని తెలంగాణ రైతాంగానికి అనుసంధానం చేశారు.

? కేంద్ర... రాష్ట్ర ఆర్థిక సంబంధాలను ఎలా చూస్తున్నారు? 
దేశవ్యాప్తంగా వృద్ధిరేటు తగ్గుతోంది. ఇదంతా కేంద్రాన్ని, చాలా రాష్ట్రాలను కలవరపెడుతోంది. తెలంగాణకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం ఢోకా లేదు. కేంద్రం నుంచి సాయం అందకపోయినా రాజ్యాంగ పరంగా వాటా మేరకు నిధులు తప్పనిసరిగా వస్తాయి. తెలంగాణ విషయంలో కేంద్రం తప్పిదాలు చేసింది. నీళ్లులేని తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదు. మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చి తీరాలి.

? రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై విమర్శలొస్తున్నాయి... 
రాష్ట్రం తెచ్చిన అప్పులు సద్వినియోగమవుతున్నాయి. ప్రతి పైసా.. ఉత్పత్తి మీదనే పెట్టారు. వృథా ఖర్చు ఏ మాత్రం లేదు. సామాజిక పింఛన్లు, షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి వంటి వాటిపై ఈ నిధులను వెచ్చించలేదు. మౌలిక వసతులు, మూలధన పెట్టుబడిగా పెట్టారు. విద్యుదుత్పత్తి కేంద్రాలు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారు. వీటి ద్వారా తెచ్చిన అప్పు ఆస్తిగా మారింది. తెచ్చిన అప్పుకంటే నిర్మించిన ప్రాజెక్టుల విలువ పదిరెట్లు పెరిగింది. ఉదాహరణకు నేను రూ.10 లక్షలు అప్పు తెచ్చి ఇల్లు కట్టాను. ఇప్పుడు కోటి రూపాయలయింది. ఈ కోణంలో ఎవరూ ఆలోచించకుండా కువిమర్శలు చేస్తున్నారు.

? బడ్జెట్‌ రూపకల్పన ప్రక్రియ ఎప్పుడు ప్రారంభవుతుంది? 
బడ్జెట్‌ రూపకల్పనపై త్వరలోనే రోజువారీగా సమావేశాలు నిర్వహిస్తాం. అన్ని శాఖలతో సమావేశం నిర్వహించి, నివేదికలను రూపొందించాలని సీఎం చెప్పారు. ఈ ప్రక్రియ 30 రోజుల పాటు సాగవచ్చు. మేధావులు, విశ్రాంత అధికారుల సలహాలు తీసుకుంటాం. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటాం.

? విభజన హామీలు, కేంద్రం నిర్ణయాల అమలుపై మీపంథా ఏమిటి? 

విభజన హామీలన్నింటినీ సాధించే దిశగా మా పార్టీ, ప్రభుత్వం పోరాటం చేస్తోంది. ప్రణాళికా సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి వాస్తవ పరిస్థితులను వివరిస్తాం. నీతి ఆయోగ్‌కు నివేదికలిస్తాం. గతంలో మిషన్‌ భగీరథ, కాకతీయలకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సూచించినా ఇప్పటి వరకు పైసా రాలేదు. దీనిని గుర్తుచేస్తాం. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు పూర్తిగా అనువైన పరిస్థితులున్నాయని ఎన్‌ఎండీసీ వెల్లడించింది. బయ్యారంలో ఇనుప ఖనిజం సరిగా లేకపోతే బైలాదిల్లా నుంచి నాణ్యమైన ఖనిజాన్ని తేవాలి. తెలంగాణలో సుప్రీంకోర్టు బెంచి ఏర్పాటు, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం ముందుకు రావాలి.

 

? ప్రణాళికా సంఘాన్ని ఎలా తీర్చిదిద్దబోతున్నారు? 
ప్రణాళికా సంఘాన్ని క్రియాశీలకంగా, మార్గదర్శకంగా మారుస్తాం. అన్ని శాఖలకు ప్రణాళికలు కీలకమైనవి. బడ్జెట్‌ రూపకల్పనకు ఇవే ఆధారం. ఇప్పటి వరకు గణాంకాలంటే కొంత నిర్లిప్తత ఉంది. ఇకపై అన్నింటికి సంబంధించి గణాంకాలు తయారు చేస్తాం. వ్యవసాయం, విద్య, వైద్యం.. ఇలా అన్నింటికి తెలంగాణలో పక్కా లెక్కలుంటాయి. వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతాం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.