close

ప్ర‌త్యేక క‌థ‌నం

 ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ముఖచిత్రం 

 ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ముఖచిత్రం 

ఇందూరు రసవత్తర పోరు 
ప్రచారంలో తెరాస ముందంజ 
పుంజుకునేందుకు కాంగ్రెస్‌ కసరత్తు 
పలుచోట్ల టిక్కెట్లు ఆశిస్తున్న తెదేపా, తెజస 
దీటైన అభ్యర్థుల వేటలో భాజపా 
రేవళ్ల వెంకటేశ్వర్లు, ఈనాడు, నిజామాబాద్‌ 

 ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ముఖచిత్రం 

వ్యవసాయాధారిత ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రాజకీయ చైతన్యమూ ఎక్కువే. హైదరాబాద్‌ రాష్ట్ర కాలం నుంచే రాజకీయాలను ప్రభావితం చేసే నాయకులు ఈ జిల్లా నుంచి బరిలో నిలిచారు. ఎందరో  ఉద్దండులను అందించిన ఇందూరు ఓటర్లు విలక్షణ తీర్పులివ్వడంలో సిద్ధహస్తులు. ఈ ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది శాసనసభ స్థానాలుండగా.. గత ఎన్నికల్లో అన్నిచోట్లా తెరాస విజయం  సాధించింది. గులాబీ పార్టీ నుంచి తాజా మాజీలే మరోమారు బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్‌ విషయానికొస్తే కామారెడ్డి, బోధన్‌ స్థానాలపై స్పష్టత వచ్చినప్పటికీ మిగతా చోట్ల అభ్యర్థులెవరనేది తేలాల్సి ఉంది. మూడు చోట్ల మినహా మిగతా స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే దానిపై భాజపాలో స్పష్టత రాలేదు. మొత్తంమీద అభ్యర్థులు, ఆశావహులు ప్రచార పర్వాల్లో మునిగితేలుతున్నారు.
ముమ్మరంగా తెరాస ప్రచారం 
ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది స్థానాలను తెరాస సిట్టింగ్‌లకే కేటాయించింది. నెలన్నర కిందటే ప్రచారం ప్రారంభించిన వీరు మొదట్లో ఉద్ధృతంగా గ్రామాల్లో పర్యటించారు. నియోజకవర్గాన్ని ఒక చుట్టుచుట్టి వచ్చేసరికి.. ఎన్నికల తేదీల్లో స్పష్టత వచ్చింది. అనుకున్నదానికంటే సమయం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం కాస్త నెమ్మదించారు. ఇప్పటికే నిజామాబాద్‌లో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ సైతం నిర్వహించారు.

పాతవారే.. హోరాహోరే 
బోధన్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, తెరాస అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చింది. కామారెడ్డిలో షబ్బీర్‌ అలీ, గంప గోవర్ధన్‌ల మధ్య హోరాహోరీ పోరు తప్పేలాలేదు. బోధన్‌లోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ సుదర్శన్‌రెడ్డి, షకీల్‌కు నడుమ గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ భాజపా అభ్యర్థి ఓట్ల చీలికే ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంది.

బరిలో బంధువులు 
బాల్కొండ తెరాస అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి, తెదేపా టిక్కెట్‌ అడుగుతున్న మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ తనయుడు మల్లికార్జునరెడ్డిలు బావ, బావమరుదులు. ప్రశాంత్‌రెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డికి అన్నపూర్ణమ్మ స్వయానా సోదరి. గత ఎన్నికల్లో వీరు ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఈ సారీ పోటీకి సిద్ధమవుతున్నారు.

* తెరాస రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్‌ తనయుడు అర్వింద్‌ భాజపాలో ఉన్నారు. ఆయన పార్లమెంట్‌కు పోటీ చేయాలని ఆశిస్తుండగా.. పార్టీ మాత్రం మొదట ఏదో ఒక స్థానం నుంచి అసెంబ్లీ బరిలో దింపాలని చూస్తోంది. 

 ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ముఖచిత్రం బాల్కొండ ఎవరికి అండ 
తెరాస నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మరోసారి బరిలోకి దిగుతున్నారు. కార్యకర్తలతో బూత్‌ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి ఎన్నికల లోపు ఓటర్లను రెండుసార్లు కలుసుకొనే విధంగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తున్నారు. ప్రశాంత్‌రెడ్డి.. మిషన్‌ భగీరథ పథకం వైఎస్‌ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ టిక్కెట్‌ కోసం నలుగురు దరఖాస్తు చేసుకున్నారు. మాజీ విప్‌ ఈరవత్రి అనిల్‌, ఇటీవలే తెరాసకు రాజీనామా చేసిన ఆరెంజ్‌ ట్రావెల్స్‌ అధినేత సునీల్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్‌ ఆశావహుల్లో ఉన్నారు. మరోవైపు మహాకూటమి పొత్తుల్లో ఈ స్థానాన్ని తెదేపా కోరుతోంది. మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జునరెడ్డిని ఇక్కడి నుంచి నిలపాలనే ఆలోచనలో ఆ పార్టీ ఉంది. భాజపా అభ్యర్థి విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
 

 

 ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ముఖచిత్రం నిజామాబాద్‌ అర్బన్‌ 
ఆరుగురిలో అభయహస్తం ఎవరికి? 
మరోమారు బరిలోకి దిగుతున్న తెరాస తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ టిక్కెట్‌ కోసం ఆరుగురు ఆసక్తి చూపుతున్నారు. వీరిలో ఎవరూ ఇప్పటి వరకు ప్రచారం ప్రారంభించలేదు. ఇటీవలే తెరాస రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్‌) అనుచరులు కాంగ్రెస్‌లో చేరారు. డీఎస్‌ కూడా చేరతారనే ప్రచారం జరిగినా.. స్పష్టత రాలేదు. డీఎస్‌కు టిక్కెట్‌ ఇవ్వాలని కొందరు కాంగ్రెస్‌ నాయకులు పీసీసీ నేతలను కోరినట్లు సమాచారం. ఆయనపై స్థానికంగా సర్వే కూడా చేయించినట్లు తెలుస్తోంది. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యెండల లక్ష్మీనారాయణ, గత ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేసిన ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తాలు కాషాయ పార్టీ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు అంబోజి ప్రసాద్‌ కూడా ఇక్కడి నుంచి బరిలో నిలవాలనే ఆలోచనతో ఉన్నారు.

 ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ముఖచిత్రం బాన్సువాడ 
పోచారం ప్రత్యర్థి తేలాలి 
తెరాస అభ్యర్థి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే ఒకసారి నియోజకవర్గం మొత్తం ప్రచారాన్ని పూర్తిచేశారు. అభ్యర్థిత్వం ఖరారైనప్పటి నుంచే ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. దీటైన అభ్యర్థిని బరిలో నిలిపేందుకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. ఆ పార్టీ నుంచి కాసుల బాల్‌రాజ్‌, మాల్యాద్రిరెడ్డి టిక్కెట్‌ ఆశిస్తున్నారు. వీరిద్దరూ ఇక్కడ వేర్వేరుగా ప్రచారం చేపడుతున్నారు. మహాకూటమిలో భాగంగా ఈ స్థానాన్ని కేటాయించాలని  తెలుగుదేశం సైతం కోరుతోంది. ఈ మేరకు కామారెడ్డి జిల్లా తెదేపా అధ్యక్షుడు పైడి గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు చంద్రబాబును కలిశారు. భాజపా సైతం బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు వేట కొనసాగిస్తోంది.

 

 

 ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ముఖచిత్రం కామారెడ్డి 
ఎవరి ధీమా వారిదే 
రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న నియోజకవర్గమిది. తెరాస, కాంగ్రెస్‌, భాజపాలు ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. తన అభ్యర్థిత్వం ఖరారైన నాలుగో రోజు నుంచే తెరాస నేత, ప్రభుత్వ మాజీ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్‌ టిక్కెట్‌ తనకే వస్తుందనే ధీమాతో మండలి విపక్షనేత షబ్బీర్‌అలీ ప్రచారం చేస్తున్నారు.తాను విజయం సాధించి, కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపడితే ప్రభుత్వంలో క్రియాశీల పాత్ర పోషిస్తానని షబ్బీర్‌ అలీ చెబుతున్నారు. మరోవైపు భాజపా అధిష్ఠానం టిక్కెట్‌ ఇవ్వడంతో జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

 ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ముఖచిత్రం బోధన్‌ 
మళ్లీ గత ప్రత్యర్థులే.. 
తెరాస, కాంగ్రెస్‌ల నుంచి గత ఎన్నికల ప్రత్యర్థులే మళ్లీ తలపడుతున్నారు. తెరాస తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్‌ ఆమెర్‌, కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి పోటీ పడుతున్నారు. వీరిద్దరు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. షకీల్‌ తరఫున ఎంపీ కవిత, మంత్రులు ఈటల, పోచారం పలు సభల్లో పాల్గొన్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సుదర్శన్‌రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. భాజపా నుంచి 2009 ఎన్నికల్లో పోటీ చేసిన కెప్టెన్‌ కరుణాకర్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. ఇతర పార్టీలు చీల్చే ఓట్లపైనే కాంగ్రెస్‌, తెరాస అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని అంచనా వేస్తున్నారు. 

 

 

ఆర్మూర్‌ 
కాంగ్రెస్‌ నుంచి ఎవరు? 
తెరాస నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మరోమారు పోటీచేస్తున్నారు. ఈయన ఇప్పటికే కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. శాసనసభ మాజీ సభాపతి కేఆర్‌ సురేష్‌రెడ్డి తెరాసలో చేరటంతో అభ్యర్థి అన్వేషణలో కాంగ్రెస్‌ ఉంది. ఎమ్మెల్సీ ఆకుల లలిత, తెదేపా నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాజారాంయాదవ్‌, సీనియర్‌ నాయకుడు ఏబీ శ్రీనివాస్‌ తదితరులు హస్తం టిక్కెట్‌ ఆశిస్తున్నారు. భాజపా నుంచి వినయ్‌రెడ్డికి టిక్కెట్‌ ఇచ్చారు. నిర్మాణ రంగ వ్యాపారంలో ఉన్న వినయ్‌ ఇటీవలే తెరాస నుంచి భాజపాలో చేరారు.

 ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ముఖచిత్రం 

ఎల్లారెడ్డి 
సామాజిక వర్గాలు కీలకం 
తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వరుసగా ఆరోసారి తెరాస తరఫున ఎల్లారెడ్డి బరిలో దిగుతున్నారు. ఇప్పటికే ప్రచారం మొదలెట్టారు. ఇక్కడ తెరాసలో ద్వితీయ శ్రేణి నేతల అసంతృప్తి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్‌ టిక్కెట్‌ కోసం నలుగురు పోటీపడుతున్నారు. ఇందులో ఎవరికి టిక్కెట్‌ కేటాయించినా మిగతా ముగ్గురు సహకరించడం అనుమానమేనని చెబుతున్నారు. తెలంగాణ జనసమితి సైతం ఈ స్థానంపై దృష్టి సారించింది. న్యాయవాది రచనారెడ్డి తెజస టిక్కెట్‌ ఆశిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఒకటి రెండు సామాజికవర్గాల ఓటర్లు.. అభ్యర్థుల గెలుపోటములను శాసించేస్థాయిలో ఉండటంతో అందరూ వారిపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

నిజామాబాద్‌ రూరల్‌ 
పోరు రసవత్తరం 
తెరాస నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈయన రోజూ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి నలుగురు ఆశావహులు ఉన్నారు. వీరిలో తెరాసలో ఎమ్మెల్సీగా ఉండి ఇటీవలే కాంగ్రెస్‌లోకి వచ్చిన భూపతిరెడ్డి, తెదేపా నుంచి వచ్చిన అరికెల నర్సారెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. భాజపా నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన గడ్డం ఆనందరెడ్డికే ఆ పార్టీ మళ్లీ టిక్కెట్‌ కేటాయించింది. జిల్లా రాజకీయాల్లో ఆధిపత్య పోరు అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

జుక్కల్‌ 
కుమ్ములాటలు ముంచుతాయా? 
నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. తెరాస తాజా మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాంగ్రెస్‌ టిక్కెట్‌ కోసం ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు గంగారాం, అరుణతారలతోపాటు పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్‌ పోటీ పడుతున్నారు. ఎవరికి వారే ఇక్కడ పార్టీ జెండా పండగ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2004 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో పార్టీలో కుమ్ములాటల మూలంగానే కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమిపాలయ్యారని.. ఈ సారి అలా కాకుండా చూసుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సీపీఎం నేతృత్వంలోని బీఎల్‌ఎఫ్‌తోపాటు భాజపా, ఇతర పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నాయి.

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.