Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

సోసెల్‌ బందీలం!

సోసెల్‌ బందీలం!

అవునన్నా, కాదన్నా.. ఇప్పుడు సమాజం సామాజిక మాధ్యమంపై నడుస్తోంది! నవతరం జీవనశైలి డిజిటల్‌ తెరపైనే నర్తిస్తోంది. కొనవేళ్లు మనల్ని మరో లోకంలోకి తీసుకుపోతున్నాయి. ప్రతి ఇంటినీ, ఒంటినీ ఆక్రమించేస్తున్న సాంకేతిక విప్లవమిది. విజ్ఞానం, వినోదం, వ్యాపారం, ఆరోగ్యం, అనుబంధం, స్నేహం, ప్రేమ.. ఇలా సమస్త కార్యకలాపాలకు సోషల్‌ మీడియా కేరాఫ్‌ అడ్రస్‌ అవుతోంది. గంటల కొద్దీ సమయాన్ని ‘కాల్పనిక ప్రపంచంలో’ గడిపేస్తున్నాం. కోట్ల కొద్దీ జనాభా రేయింబవళ్లు డిజిటల్‌ తెరవైపే చూస్తున్న ఈ రోజుల్లో.. సామాజిక మాధ్యమాలే రాజ్యమేలుతున్న ఈ కీలక దశలో.. మన జీవితాలు ఎటు కొట్టుకుపోతున్నాయి? కళ్ల ముందు అంతా అందంగా కనిపిస్తున్న ఈ అలవాటే మనకు బందిఖానా అవుతోంది. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా కూడా ముందెన్నడూ చూడనన్ని రుగ్మతలకు సామాజిక మాధ్యమాలు వేదికలవుతున్నాయి. కావాలనుకుంటే ఊరుకోవు... వద్దనుకుంటే వదిలేసేవి కావు.. మరి ఈ వేదికల విషయంలో.. కొత్త సంవత్సరంలోనైనా మనం ఏం చెయ్యొచ్చు?

సోసెల్‌ బందీలం!

బంధాలే బంధనాలు

‘మీరో పోస్టు పెడతారు. దానికి అంతా లైక్‌లు, హార్ట్‌లు, థమ్సప్‌లు కొట్టగానే ఒక్కసారిగా గొప్ప పని చేశామన్న తాత్కాలిక సంతృప్తికి, దాన్నంతా హర్షించారన్న భావనకు లోనవుతారు. ఇలా వెంటనే వచ్చే కిక్కు, సంతృప్తినే మనస్తత్వవేత్తలు ‘డోపమైన్‌ హిట్‌’ అంటారు. ఇలా మనం ఓ పని చేయటం, దాన్నంతా సమర్థించారన్న భావన కలగటాన్నే ‘సోషల్‌ వాలిడేషన్‌ - ఫీడ్‌బ్యాక్‌ లూప్‌’ అంటారు. పైకి చూడటానికి ఇవి మంచిగానే అనిపిస్తాయిగానీ మన స్వభావంలో, మనస్తత్వంలో బలహీనతలను

పెంచుతున్నాయి. ఇదే మనల్ని దుర్బలులుగా మారుస్తుంది’’

-ఫేస్‌బుక్‌ వ్యవస్థాపక ముఖ్యుల్లో ఒకరైన సీన్‌ పార్కర్‌ వివరణ ఇది.

న జీవితం ఇప్పుడు సమాజంలో కంటే.. సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువగా గడిచిపోతోంది! ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ట్విటర్‌, స్నాప్‌చాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలా మొబైల్లోకి వచ్చి చేరిన ప్రతి వేదిక మీదా ఖాతా తెరిచేసి.. వందల మందితో ఖాతాలు కలిపి.. సమాజంతో ముందెన్నడూ లేనంత గొప్పగా అనుసంధానమయ్యామని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడీ అనుసంధానాలే పెద్ద అడ్డుగోడలనూ, అగాధాలనూ సృష్టిస్తున్నాయన్న ఆందోళన గత కొద్దికాలంగా బలంగా వినపడటం మొదలైంది. మనం కాళ్లకు ఆధారాన్నిస్తున్న వాస్తవ సమాజంలో కంటే కళ్ల ముందు కదిలిపోయే తెర మాధ్యమాల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నామని.. ఈ అనుసంధానాలే మనకు బందిఖానాలు అవుతున్నాయని ఏకంగా ఈ మాధ్యమాల సృష్టికర్తలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వద్దనుకుంటే వదిలేసేవి కావు.. ఇవి మన జీవితాలతో అంతగా పెనవేసుకుపోయాయి. మన జీవితాల్లోకి ఇంతగా చొచ్చుకుపోయిన వీటి గురించి ఈ నూతన సంవత్సర ఘడియల్లోనైనా కొన్ని తీర్మానాలు తీసుకుంటే మన సమయం సద్వినియోగం అవుతుంది.. ఆ సాంకేతిక ప్రయోజనానికీ సార్థకత ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

సోసెల్‌ బందీలం!

సృష్టికర్తలే చింతిస్తున్న క్షణాలు...

‘‘మనం సృష్టించుకున్న ఈ అనుసంధానాలు.. సాంకేతిక అద్భుతాలే! కానీ ఈ పనిముట్లే ఇప్పుడు మన సమాజ నడతను, నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసేస్తున్నాయి.’’

ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ ఫేస్‌బుక్‌కు చాలాకాలం వినియోగదారుల వ్యవహారాల విభాగం వైస్‌ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన చమత్‌ పలిహపిటియ. ఇటీవల ఆయన స్టాన్‌ఫర్డ్‌ బిజినెస్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ విద్యార్ధులతో చేసిన వ్యాఖ్యలివి. అంతేకాదు, ఫేస్‌బుక్‌లో 200 కోట్ల మంది ఖాతాదారులు చేరేలా కృషి చేసినందుకు తానిప్పుడు పశ్చాత్తాపపడుతున్నానని కూడా వాఖ్యానించటం సంచలనం సృష్టించింది. ‘‘దీన్ని చక్కదిద్దేందుకు నా దగ్గర పరిష్కారమేం లేదు.. నేను అనుసరిస్తున్న పరిష్కారం ఒక్కటే. సోషల్‌ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటున్నా!’’ అని ఆయన చెప్పినప్పుడు ఒక్కసారిగా అంతా ఆశ్చర్యపోయారు!

సోసెల్‌ బందీలం!‘‘లైక్‌లు, హార్ట్‌లు, థమ్స్‌అప్‌ల స్పందన చూసి మనం ఏదో విలువైన పని చేశామని, అది నిజమని నమ్మటం మొదలుపెడతాం, కానీ అదొట్టి భ్రమ. ఇలా వచ్చే పేరు, పాపులారిటీ నిలిచేది కాదు, ఆ తర్వాత అది మన జీవితంలో పెద్ద శూన్యాన్నే మిగులుస్తుంది. ఇదంతా మనం గుర్తించకపోవచ్చు.. కానీ దీనికి మనం ‘ప్రోగ్రామ్‌’ అయిపోతున్నాం’’

- ఇదీ చమత్‌ ఆందోళన!

కోల్పోతున్నది ఏమిటి?

సోసెల్‌ బందీలం!* ఒత్తిడి: సామాజిక మాధ్యమాల విస్తృత వినియోగం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోందని స్పష్టంగా గుర్తించారు.
* మూడ్‌ ఖరాబ్‌: ఇంటర్నెట్‌ వాడే వారికంటే ఫేస్‌బుక్‌ వంటివి చూసేవాళ్ల మనఃస్థితి, భావోద్వేగాలు వేగంగా మారిపోతున్నాయి.
* ఆందోళన: ఎన్ని ఎక్కువ సామాజిక వేదికలను వాడుతుంటే ఆందోళన, వ్యాకులత అంత ఎక్కువ అవుతున్నాయి.
* కుంగుబాటు: ఆన్‌లైన్‌లో అందరితో సంభాషిస్తున్నట్టే అనిపించినా వ్యక్తిగత జీవితంలో శూన్యం ఆవరించి, కుంగుబాటుకు లోనవుతున్నారు.
* వ్యసనం: సామాజిక మాధ్యమాలకు బానిస కావడం మానసిక రుగ్మతగా పరిణమిస్తోంది.
* అసూయ: ఇతరుల పోస్టులు, ఫోటోలు, సెల్ఫీలను చూసి ‘మనం అలా ఎంజాయ్‌ చెయ్యలేపోతున్నామే.. మన జీవితంలో అంత మజా లేదే’ అన్న అసూయ పెరిగి, క్రమేపీ ఆందోళనకు, ఒత్తిడికి లోనవుతున్నారు.
* ఒంటరితనం: సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం గడుపుతున్న వారు మిగతావారితో పోల్చుకుంటే రెండురెట్లు ఎక్కువగా ఏకాకితనాన్ని అనుభవిస్తున్నట్లు అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో తేలింది.
* నిద్ర: రోజంతా డిజిటల్‌ తెరలను చూస్తుండటం వల్ల నీలికాంతి ప్రభావంతో నిద్ర దెబ్బతింటోంది.

సోసెల్‌ బందీలం!

ఈ- తీర్మానాలు
బంధం.. పూర్తి నిజం కాదు!

సోసెల్‌ బందీలం!

సామాజిక మాధ్యమాల్లో అనుసంధానాలన్నీ... మనకున్న అనుబంధాలేనన్న భ్రమల నుంచి బయపడటం తక్షణావసరం. ఇటువంటి భ్రమల్లో ఉండటం వల్ల చాలామంది చాలా తొందరగా ఒంటరితనంలోకి జారిపోయి, కుంగుబాటులోకి వెళ్లిపోతున్నారని, ఆ కుంగుబాటు కారణంగా మరింతగా సోషల్‌ మీడియాకు అతుక్కుపోతున్నారని, చివరికి ఇదో విషవలయంగా తయారవుతోందని పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీ మీడియా విభాగం పరిశోధకులు స్పష్టంగా గుర్తించారు.

నిజమైన ఆస్తి అని పొరబడొద్దు

ఎంత పెద్ద సంఖ్యలో స్మైలీలు, లైక్‌లు, ఎమోజీలు దక్కించుకుంటే అంత ఆస్తిపరులమన్న (సోషల్‌ క్యాపిటల్‌) భ్రమలను వదిలేసుకోవాలి. వీటివల్ల క్షణికమైన తృప్తి తప్పించి అంతిమంగా దైనందిన జీవితంలో మిగిలే ప్రభావం చాలా తక్కువ.


గంట గంటకూ వద్దు

సోసెల్‌ బందీలం!

రోజంతా సామాజిక మాధ్యమ వేదికలను ఆన్‌ చేసి ఉంచటమన్నది తక్షణం మానెయ్యాలి. మన అవసరాన్ని బట్టి రోజు మొత్తమ్మీద కొన్ని కొన్ని నిర్దిష్టమైన సమయాల్లో మాత్రమే, అదీ పరిమితంగానే ఈ వేదికలను చూడటం అలవాటు చేసుకోవాలి. మిగతా సమయాల్లో మనకు మనం ‘దడి కట్టేసుకున్నట్టుగా’ కచ్చితంగా వీటికి దూరంగా ఉండాలి. దీనివల్ల సమయమే కాదు, మనఃస్థితీ పాడవకుండా ఉంటుంది.


వేళ్లు కాదు.. కాళ్లు కదపండి

సోసెల్‌ బందీలం!

సోషల్‌ మీడియా వల్ల రోజులో అధిక భాగం వేలికొసలను కదపటం పెరుగుతోందిగానీ కాళ్లూ, ఒళ్లూ కదలటం తగ్గిపోతోంది. మన ఆరోగ్యానికి మనమే చేసుకుంటున్న చెడుపు ఇది. దీన్ని గుర్తించి తక్షణం ఈ అనుసంధాన సమయాన్ని తగ్గించుకోండి.


ఈ-పెంపకం తప్పదు

సోసెల్‌ బందీలం!

సమాజంలో ఎలా మెలగాలో.. ఎలా బతకాలో అమ్మానాన్నా, ఇరుగూపొరుగూ అంతా చిన్నతనం నుంచీ చెయ్యి పట్టుకుని నేర్పిస్తారు. కానీ ఒక్కరికీ సామాజిక మాధ్యమాల్లో కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటున్న ఈ రోజుల్లో సోషల్‌ మీడియాలో మన నడత ఎలా ఉండాలో నేర్వటం ముఖ్యం. దీనివల్ల మనసు పాడయ్యే సందర్భాలు తలెత్తవు.


సరదా కాదు.. శాశ్వతం

సోషల్‌ మీడియాలో మనం పెట్టే ప్రతిదీ శాశ్వతంగా అక్కడ ఉండిపోతుందన్న స్పృహ ఉండటం ముఖ్యం. మన పోస్టునో, మన ఖాతానో మనం డిలీట్‌ చేసుకునే వీలుందని అనుకున్నా అప్పటికే మీ పోస్టును చాలామంది సేవ్‌ చేసేసుకుని ఉంటారని మర్చిపోవద్దు. అందుకు ప్రతి వ్యాఖ్యా, పోస్ట్‌ చేసే ఫోటో, ప్రతి వీడియో.. తరచితరచి చూసి చెయ్యాలి.


పోలికలొద్దు

సోసెల్‌ బందీలం!

ఇతరుల పోస్టులు, ఫోటోలు చూసి అసూయ పడటం, మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవటం వంటి భావోద్వేగాలకు తావివ్వద్దు. ‘సోషల్‌ మీడియా’ వాడకంలో మొదటగా గుర్తుంచుకోవాల్సిన సూత్రం ఇది.


సెల్ఫీలు ఓ తలనొప్పి

సోసెల్‌ బందీలం!

మనం పోస్టు చేసే సెల్ఫీలను చూసి ఎదుటివాళ్లు మన గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారన్న స్పృహ ముఖ్యం. తరచూ సెల్ఫీలు పెట్టుకునే వారిని ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోకపోవచ్చు. వీరికి సమాజంలో అంత విలువ ఉండకపోవచ్చు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.