close

ప్ర‌త్యేక క‌థ‌నం

నిలువెత్తు విలువల నేత!

చలనచిత్రాల నుంచి రాజకీయాల వరకూ.. ఎందు కాలిడినా తెలుగువారి ఆత్మగౌరవ పతాకను ఎలుగెత్తి ఎగరేయటమే కాదు..  దేశ రాజకీయ యవనిక మీద రాష్ట్రాల ప్రాముఖ్యాన్ని, సమాఖ్య-సంకీర్ణ స్ఫూర్తినీ బలంగా ప్రతిష్ఠించిన ఎన్టీఆర్‌ జీవితం అడుగడుగునా ఆసక్తికరమే. ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా నిబద్ధతతో, జీవితాంతం సమున్నతమైన విలువలకు కట్టుబడిన ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిమంతం. అందుకే నేటి యువ తరం ముందు ఆయన విశ్వరూపాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావించిన ఇద్దరు మాజీ ఉన్నతాధికారులు కె.చంద్రహాస్‌, డా।। కె.లక్ష్మీనారాయణలు శ్రమకోర్చి ఆంగ్లంలో ‘ఎన్టీఆర్‌: ఎ బయోగ్రఫీ’ పేరిట 636 పేజీల ఉద్గ్రంధాన్ని వెలువరించారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కృతమైన ఈ పుస్తకం నుంచి కొన్ని ఆసక్తికర ఘట్టాలు...

సమయ పాలకుడు!

ఎన్టీఆర్‌ సమయపాలనకు ఎంతో విలువ ఇచ్చేవారు. షూటింగ్‌ జరిగేటప్పుడు అంతా కచ్చితంగా టైమ్‌కు సెట్‌లో ఉండాలన్నది ఆయన నియమం. ఎవరైనా ఆలస్యమవుతుందని ముందే చెబితే ఒప్పుకునేవారుగానీ లేకపోతే అస్సలు క్షమించేవారు కాదు. శ్రీకృష్ణపాండవీయం చిత్రంలో రుక్మిణి పాత్ర కోసం కె.ఆర్‌.విజయను తీసుకున్నారు. తెలుగులో ఆమెకు అదే మొదటి సినిమా. ఆమె షూటింగుకు వరసగా మూడు రోజులు లేటుగా వచ్చారు. నాలుగో రోజు ఎన్టీఆర్‌.. మీరు ఆలస్యంగా రావటం మూలంగా జరిగిన నష్టానికి పరిహారం కట్టాలంటూ ఆమెకు లాయర్‌ నోటీసు పంపారు. చివరికి రాజీ కుదిరి, ఆమె చిత్రంలో కొనసాగారు. ఆ తర్వాత ఎన్నడూ ఆమె షూటింగుకు ఆలస్యంగా వచ్చింది లేదు!

కర్తవ్య సాధకుడు!

జయలలిత ఎప్పుడూ కూడా తన కోసం వచ్చేవారికి ఆతిథ్యం బాగుండాలని భావించేవాళ్లు. ఒకసారి జర్నలిస్టు బి.కె.ఈశ్వర్‌ తనను ఇంటర్వ్యూ చెయ్యటానికి వస్తానంటే ఆమె.. వాహినీ స్టూడియోలో శ్రీకృష్ణ సత్య షూటింగ్‌ జరుగుతోంది, అక్కడికి రమ్మని చెప్పారు. ఎన్టీఆర్‌గానీ, కె.వి.రెడ్డిగానీ సెట్‌లోకి జర్నలిస్టులను అనుమతించరని సినిమా రంగంలో అందరికీ తెలుసు. కానీ ఆ విషయం జయలలితకు తెలియదు. ఇంటర్వ్యూకోసం అక్కడకు వచ్చిన ఈశ్వర్‌ను చూసి ప్రొడక్షన్‌ సిబ్బంది అనుమతించటం కుదరదన్నారు. ఆ విషయం తెలిసి జయలలిత దాన్ని అవమానంగా భావించారు. షాట్‌ రడీ అయ్యింది. అయినా జయలలిత మాత్రం రాలేదు. ఆమె ఎంతకీ రాకపోవటంతో కారణం తెలీక ఎన్టీఆర్‌ అసహనానికి గురవుతున్నారు. పరిస్థితి అర్థం చేసుకున్న ప్రొడక్షన్‌ సిబ్బంది వెంటనే ఆయన వద్దకు వెళ్లి జరిగింది చెప్పారు. సెట్‌లో గొడవలన్నా, షూటింగ్‌లకు అంతరాయమన్నా అస్సలు ఇష్డపడని ఎన్టీఆర్‌.. వెంటనే ‘మేడమ్‌ కోసం వచ్చిన అతిథి. ఆయన్ని మీరెలా ఆపుతారు? ముందు వెళ్లి మేడమ్‌కు సారీ చెప్పండి, అతడిని లోపలికి పిలిచి మర్యాదగా చూడండి’ అని చెప్పారు. దీంతో జయలలిత కోపం తగ్గి, పరిస్థితి సర్దుకుంది. బహుశా, తన నియమాన్ని పక్కనబెట్టి, ఎన్టీఆర్‌ తను ఉన్న సెట్లోకి జర్నలిస్టులను అనుమతించిన ఒకే ఒక్క సందర్భం ఇది. ఆసక్తికరమైన అంశమేమంటే- ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ శ్రీకృష్ణుడిగా నటిస్తే జయలలిత చేసింది సత్యభామ పాత్ర!

జన హృదయ నేత!

1983 జనవరి 3.. ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజు. సాయంత్రం 4కల్లా ప్రచారం ఆగిపోవాలి. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌ ఇద్దరూ తిరుపతిలో బహిరంగ సభలు పెట్టారు.  ఇందిర హెలికాప్టర్‌లో ముందే వచ్చి ఎస్వీ యూనివర్సిటీలో మధ్యాహ్న భోజనం చేసి బహిరంగ సభకు వెళ్లిపోయారు. పట్టణమంతా జనంతో నిండిపోవటం చూసి ఆమె ముఖం విప్పారింది. ఆమె సభకు లారీల నిండా జనాన్ని సమీకరించేందుకు కాంగ్రెస్‌ నేతలు ఎంతో కష్టపడ్డారు. కానీ వాళ్లకు పూర్తి నిరాశ కలిగిస్తూ.. లారీల్లో వచ్చిన జనంలో చాలామంది ఇందిర సభ దగ్గర దిగి ఎన్టీఆర్‌ను చూసేందుకు వెళ్లిపోయారు. దీంతో సభ ప్రారంభమయ్యేప్పుడు నిండా ఉన్న జనం మధ్యలోనే పల్చగా అయిపోయారు. ఇంతలో ఎన్టీఆర్‌ పట్టణంలోకి వచ్చేశారనీ, బహిరంగ సభ ప్రాంగణానికి వెళుతున్నారన్న వార్త గుప్పుమనటంతో క్షణాల్లో గ్రౌండ్‌ ఖాళీ కావటం మొదలైంది. అది చూసి ఇందిర బిత్తరపోయారు. సినిమా వేరు, రాజకీయాలు వేరు, వంచకులను నమ్మకండి అంటూ ఆమె గొంతెత్తి పలుమార్లు ప్రకటించినా విన్న నాధుడు లేడు. ఆమె వేగంగా ప్రసంగం ముగించి విమానాశ్రయానికి వెళ్లిపోయారు. మరోవైపు ఎన్టీఆర్‌ ర్యాలీ పెద్ద సంబరంలా తయారైంది. జనం తాకిడికి తిరుపతి వీధులు పట్టలేదు. సభా ప్రాంగణం కిటకిటలాడి పోయింది. ఇదీ ‘తెలుగు ప్రజల ఆత్మగౌరవం’ అంటూ సాగిన ఎన్టీఆర్‌ ప్రసంగానికి జనం మంత్రముగ్ధులైపోయారు!

సంస్కార మూర్తి!

1984 అక్టోబరు 5. ఎన్టీఆర్‌ దిల్లీ వెళ్లారు. ఇందిరాగాంధీని ఆమె కార్యాలయంలో కలుసుకున్నారు. నాటి సమావేశానికి సాక్షి అయిన పి.సి.అలెగ్జాండర్‌ సమాచారం ప్రకారం ‘‘తన భార్య బసవతారకం మృతికి సానుభూతి తెలుపుతూ ఇందిర సంతాప సందేశం పంపినందుకు ఎన్టీఆర్‌ పలుమార్లు ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆమెను ‘ప్రియతమ ప్రధాన మంత్రీజీ’ అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆమె కూడా ఎన్టీఆర్‌ను ఎంతో గౌరవంగా, స్నేహపూర్వకంగా ఆదరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల గురించి రామారావు ఆమెకు చెప్పగానే ఆమె సాధ్యమైనంత త్వరగా రాష్ట్రాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చారు’’.

రాజకీయ స్ఫూర్తి!

రాజీవ్‌గాంధీ ప్రభుత్వం బోఫోర్స్‌ ఆరోపణల్లో పీకల్లోతు చిక్కుకుపోయింది. నాటి రాష్ట్రపతి జైల్‌సింగ్‌ బోఫోర్స్‌ తుపాకుల సమర్థత గురించి తనకు సమాచారం ఇవ్వాలని రాజీవ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించారు. అసలిలా అడిగే అర్హత రాష్ట్రపతికి లేదంటూ రాజీవ్‌ బృందం రకరకాల రాజ్యాంగ నిబంధనలను ఉటంకిస్తూ లేఖ రాసింది. ఇదంతా చూస్తున్న ఎన్టీఆర్‌ ఆ సమాచారం అడిగే హక్కు రాష్ట్రపతికి ఉందంటూ ‘‘రాజ్యాంగ నిబంధనలను ఉటంకిస్తూ ప్రధాని ఇచ్చిన సమాధానం కొత్తగా ప్రాక్టీసు పెట్టిన లాయర్‌ మొదటిసారి కోర్టుకు సమర్పించిన పత్రంలా ఉంది’’ అంటూ విజ్ఞత నూరిపోశారు. ‘‘పార్టీ కంటే కూడా దేశం సర్వోన్నతం, దేశం పట్ల మీ బాధ్యతను మర్చిపోకండి’’ అంటూ అప్పటి ఆర్థిక మంత్రి వి.పి.సింగ్‌కు గట్టిగా బాధ్యత గుర్తు చేశారు.

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.