close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆహార పరిరక్షణ గాలికి

నాణ్యత ప్రమాణాలకు రక్షణ కరవు
తీవ్రంగా వేధిస్తున్న అధికారుల కొరత

నిత్యం మనం తినే ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాల పరిరక్షణ గాలిలో దీపంలా మారింది. ఆహార పదార్థాల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకం, దిగుమతులకు సంబంధించిన అంశాలను వైజ్ఞానిక ప్రమాణాల ప్రకారం ఉండేలా చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ఆహార నాణ్యత ప్రమాణాల పరిరక్షణ సంస్థ విఫలమవుతోంది. క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాల్సిన ఆహార పరిరక్షణాధికారులు సరిపడినంత మంది లేకపోవడం లోటుగా పరిణమించింది.

ఆహార భద్రత పాటించాల్సినవి
* ప్రభుత్వ, ప్రైవేటు రంగాల వసతి గృహాలు
* మధ్యాహ్న భోజన పథకం
* అంగన్‌వాడీ కేంద్రాలు
* గురుకులాలు
* ఆసుపత్రుల్లో క్యాంటీన్లు
* పరిశ్రమలు, కార్యాలయాల్లో ఫలహారశాలలు
* ఐదు నక్షత్రాల హోటళ్ల నుంచి రోడ్డు పక్కన అమ్మకాలు జరిపే తోపుడు బండ్ల వరకూ బాధ్యతలేమిటి?
* ఆహారంగా వినియోగించే ఏ పదార్థాన్ని ఉత్పత్తి చేయాలన్నా, నిల్వ చేయాలన్నా, అమ్మాలన్నా తప్పనిసరిగా వ్యాపారులు ఆహార పరిరక్షణ సంస్థ నుంచి అనుమతి పొందాలి.
* ఆహార పదార్థాల ప్యాకెట్లు, లేబుళ్లపై తప్పనిసరిగా నియమ నిబంధనలను, జాగ్రత్తలను ముద్రించాలి.
* ఆహార పరిరక్షణాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లి అవి నాసిరకమైనా? సురక్షితమైనవా? అని నిర్ధారించాలి. ఇందుకోసం నమూనాలను సేకరిస్తారు.
* ఆహార పదార్థాలను విక్రయించే ప్రదేశాల్లో అపరిశుభ్రత ఉందా అనే విషయాల్లోనూ పరిశీలన జరపాలి.
* ప్రయోగశాలల్లో నాసిరకమైనవి, సురక్షితమైనవి కావని నిర్ధారిస్తే ఆయా ఉత్పత్తి సంస్థలు, విక్రయదారులపై చర్యలు చేపట్టాలి.
* వీధుల్లో విక్రయించే ఆహార పదార్థాల్లోనూ ఇవే నిబంధనలను అనుసరిస్తారు.

ఆరోగ్య సిబ్బంది ఏరీ?
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో ప్రతి లక్ష మంది జనాభాకు ఒక ఆహార పరిరక్షణాధికారి, పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రతి 50 వేల జనాభాకు ఒకరు ఉండాలి. ఈ లెక్కన రాష్ట్ర జనాభా దాదాపు 4 కోట్లు అయితే.. ఆహార భద్రత చట్టం ప్రకారం తెలంగాణలో దాదాపు 400 మంది అధికారులు అవసరమవుతారు. హైదరాబాద్‌లోనే 160 మంది ఆహార పర్యవేక్షకులు అవసరం. ఇంతకుముందు మంజూరైన పోస్టుల్లోనూ భారీగా ఖాళీలున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉప ఆహార నియంత్రణాధికారి పోస్టు ఖాళీగా ఉంది. రాష్ట్రంలో 10 మంది గుర్తింపు పొందిన ఆహార పరిరక్షణాధికారులకు గాను.. కేవలం ఆరుగురే ఉన్నారు. సహాయ ఆహార నియంత్రణాధికారి పోస్టులు కూడా ముగ్గురు ఉండాల్సిన చోట ఒక్కరే ఉన్నారు. 30 మంది ఆహార పరిరక్షణాధికారులకు కేవలం ఆరుగురే ఉన్నారు. ఇన్ని ఖాళీలుంటే ఇక ఆహార పరిరక్షణ ఎలా సాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతేడాది మొత్తం 958 కల్తీ ఆహారాలపై కేసులు నమోదు చేశారు. అయితే వాస్తవ పరిస్థితులతో పోల్చితే ఇది కనీసం 10 శాతానికంటే తక్కువనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తక్షణమే ఆహార పరిరక్షణాధికారుల భర్తీ ప్రక్రియ చేపట్టాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


కల్తీ నియంత్రణే లక్ష్యం

కల్తీ నియంత్రణే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆహార పరిరక్షణాధికారుల కొరతను అధిగమించేందుకు ఇటీవల పదోన్నతుల విధానంలో ముగ్గురిని నియమించాం. రాష్ట్రంలో 31 జిల్లాలకూ అధికారులను నియమించడంపై దృష్టి పెట్టాం. త్వరలోనే పూర్తి చేస్తాం.

-డాక్టర్‌ శంకర్‌
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ సంచాలకులు
- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.