close

ప్ర‌త్యేక క‌థ‌నం

దివ్య దేశాలు.. జ్యోతిర్లింగాలు

  యాదాద్రిలో హరిహర ఆలయాలు
  సాలహారాలలో రూపాల పొందిక
యాదగిరిగుట్ట - న్యూస్‌టుడే

ఒకే క్షేత్రంలో హరిహరులను దర్శించుకోవడంతోపాటు ప్రాశస్త్యమున్న ఆయా క్షేత్రాలు సందర్శించిన అనుభూతి పొందేట్లు మహాదివ్య పుణ్యక్షేత్రంగా యాదాద్రిని రూపొందించనున్నారు. కృష్ణ శిలతో రూపొందిన దేవతా విగ్రహాలు, ఆళ్వారుల ముఖమండపం, కాకతీయ స్తూపాలు, దివ్య విమానం, ఆరు రాజగోపురాలతో సహా అష్టభుజ మండప ప్రాకారం రూపొందాయి. దక్షిణాదిలో ఎక్కడాలేని తరహాలో నిర్మితమవుతోన్న మండప ప్రాకారాన్ని మరింత శోభాయమాయంగా తీర్చిదిద్దనున్నారు. మాఢవీధులతో 4.3 ఎకరాల విస్తీర్ణంలో పునర్నిర్మితమవుతున్న ఆలయం చుట్టూ వివిధ ఆకృతులతో ఆవిష్కృతమయ్యే ప్రాకారంలో భక్తులకు ఆహ్లాదం కలగనుంది.

సరికొత్తగా..
పంచనారసింహుల దివ్య సన్నిధిని భక్తి, ముక్తిని సంప్రాప్తించే తీరులో మండప ప్రాకారాలపై 108 దివ్య దేశాలతో సాలహార రూపకల్పనకు యోచిస్తున్నారు. వైష్ణవత్వం ఉట్టిపడేట్లు పేరొందిన వైష్ణవ క్షేత్రాల రూపాలను సాలహారంలో పొందుపరచాలని చినజీయర్‌స్వామి గతంలోనే సూచించినట్లు స్తపతులు చెబుతున్నారు. వీటిని కృష్ణశిలతోనే రూపొందించనున్నారు. తొగుట మాధవానందస్వామి సూచనలతో శైవ భక్తులను ఆకట్టుకునేట్లు పర్వత వర్ధిని రామలింగేశ్వరుడి ఆలయాన్ని జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలతో కూడిన సాలహారంతో ఆవిష్కృతం చేయనున్నారు. ఆ మేరకు ఆలయ పునర్నిర్మాణంలో సాలహారాలను సిమెంట్‌తో రూపొందించారు. పరమేశ్వరుడి ఆలయ దివ్య విమానంపై రుద్రాక్ష మాలను కృష్ణశిలతో సిద్ధం చేయనున్నారు. స్తపతి డాక్టర్‌ వేలు ఆధ్వర్యంలో శివాలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

గర్భాలయ ప్రవేశంలో నారసింహ రూపాలు
అధునాతన, సంప్రదాయాలకు అనుగుణంగా యాదాద్రి క్షేత్రాన్ని రూపొందించేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. స్తంభోద్భవుడి సన్నిధిలో భక్తులను అబ్బురపరిచేలా గర్భాలయంలోకి ప్రవేశించక ముందే ద్వారం పక్కన పంచనారసింహుల రూపాలను పొందుపరచనున్నారు. ఆలయ పరిసరాలే కాకుండా ముఖమండపం, గర్భాలయ ప్రవేశమార్గం పక్కన ఖాళీ గోడ కనపడకుండా ఆలయ దేవుడు యాదవ మహర్షికి సాక్షాత్కరించిన దివ్య రూపాలను పొందుపరచాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశంతో ‘యాడా’ సన్నద్ధమవుతోంది. చేర్పులు, మార్పులతో సిద్ధమైన తుది ప్రణాళికల ద్వారా ఆలయ శిల్పి ఆనందసాయి నమూనాల తయారీని చేపట్టారు. గర్భాలయ ద్వారం కుడివైపులో జ్వాల, గండభేరుండ, ఉగ్ర, యోగానంద, శ్రీ లక్ష్మీనారసింహరూపాలను కృష్ణ శిలతో రూపొందించనున్నారు. తోరణం, శయన మండపం నిర్మితం కానున్నాయి.
గర్భాలయ ద్వారం పైభాగంలో ప్రహ్లాద చరిత్ర రూపొందించనున్నారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి, మహావిష్ణువుకు ప్రీతిపాత్రుడైన గరుడ ఆళ్వారుడి విగ్రహాలను పొందుపరిచే పనులు కొనసాగుతున్నాయి.

ఆలయనగరిలోనే ఆంజనేయస్వామి భారీ విగ్రహం
చినజీయర్‌ స్వామి సలహాతో యాదాద్రిలోని పెద్దగుట్టపై ఆలయనగరిలో క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇందుకోసం 153 అడుగుల ఎత్తులో కాంస్య విగ్రహాన్ని రూపొందించనున్నారు. గత ప్రణాళికలో యాదాద్రిపై ప్రతిష్ఠించాలనుకున్నా తాజాగా చోటు చేసుకున్న మార్పులతో ఆలయనగరిలోనే ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్ఠించాలని నిర్ణయించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.