close

ప్ర‌త్యేక క‌థ‌నం

పట్టణాల్లో గొంతెండుతోంది!

 మార్చి నెల రాకుండానే మొదలైన తాగునీటి ఎద్దడి
 అడుగంటుతున్న జలాశయాలు
 పడిపోతున్న భూగర్భ జలాలు.. మొరాయిస్తున్న బోర్లు
 7 జిల్లాల్లోని 32 పట్టణాల్లో సమస్య తీవ్రంగా ఉంటుందని అంచనా

వేసవి ప్రారంభంలోనే పట్టణ ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గత ఏడాది తక్కువ వర్షపాతం నమోదవడంతో జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటిపోతున్నాయి. భూగర్భ జలాలు సైతం పడిపోవడంతో వచ్చే మూడు, నాలుగు నెలలూ నీటి సమస్యలను ఎదుర్కోవడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారనుంది.

ఏడు జిల్లాలో తీవ్రంగా..
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ ఏడాది తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని అంచనా. ఏడు జిల్లాల్లోని 32 పట్టణాల్లో తాగునీటి కొరత ఈ ఏడాది కూడా తప్పకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది ఏప్రిల్‌ తరువాత నుంచి సమస్య తీవ్రత కనిపిస్తే.. ఈ ఏడాది మార్చి నుంచే మొదలయ్యేలా ఉంది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరులో ట్యాంకర్లతో చేస్తున్న నీటి సరఫరాను పెంచనున్నారు. అనంతపురం జిల్లాలోని హిందూపురంలో రెండు, మూడు రోజులకోసారి నీరు సరఫరా చేస్తున్నారు. విజయనగరంలో గతంలో కంటే సరఫరా మెరుగైనా రాబోయే రెండు, మూడు నెలల్లో ఎద్దడి తప్పకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నానికి నీటిని సమీకరించే ముడసర్లోవ, గంభీరం, మేఘాద్రిగెడ్డ జలాశయాల్లో క్రమంగా నీరు అడుగంటుతోంది.

తలసరి సరఫరా 70 లీటర్లలోపే...
రోజుకు తలసరి 130 లీటర్ల సరఫరా చేయాల్సిన పట్టణ స్థానిక సంస్థలు నీటి కొరతతో 55 నుంచి 70 లీటర్లలోపే  అందిస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమహేంద్రవరం, తిరుపతి వంటి ముఖ్య నగరాల్లో తప్పితే మిగతా చోట్ల గరిష్ఠంగా తలసరి 50 లీటర్లే సరఫరా చేస్తున్నారు. అమృత్‌ పథకంలో రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రస్తుతం చేస్తున్న పనులు పూర్తయితే లక్షపైబడి జనాభా కలిగిన పట్టణాల్లో తలసరి రోజూ 80 నుంచి 100 లీటర్ల నీటిని సరఫరా చేసే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.

రూ.155.64 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక
వేసవిలో పట్టణాల్లో తలెత్తే తాగునీటి సమస్య పరిష్కారానికి  రూ.115.64 కోట్లతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. గత వేసవి అనుభవాలు, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏయే పట్టణాల్లో సమస్య తీవ్రంగా ఉంటుందో అంచనాలు వేశారు. కొత్తగా బోర్లు వేయడం, ట్యాంకర్లతో నీటి సరఫరా, జలాశయాల్లో నుంచి నీటిని తాత్కాలిక మోటార్లతో పంపింగ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నిధులు విడుదల చేయగానే పనులు ప్రారంభించేలా సన్నద్ధమవుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో తాగునీటి సమస్య నిత్యకృత్యమవుతోంది. వేసవి మొదలైదంటే ప్రజలు దాహార్తితో అల్లాడాల్సిందే. ప్రత్యేకించి ఏఎస్‌పేట, పురుషోత్తంపేటలో ప్రస్తుతం రోజు విడిచి రోజు ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. మార్చి నుంచి జూన్‌ మధ్య నాలుగు రోజులకోసారి నీరు అందిస్తుంటారు. శాశ్వత పరిష్కార చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. బాహుదా నది నుంచి కొత్తగా పైపులైన్లు వేయాలన్న ప్రతిపాదనలు అటకెక్కుతున్నాయి.

చిత్తూరు పట్టణ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పేలాలేవు. ప్రజల అవసరాలు తీర్చే ఎన్టీఆర్‌ జలాశయంలో నీటి నిల్వలు 110 మిలియన్‌ క్యూబిక్‌ అడుగుల (ఎంసీఎఫ్‌టీ) నుంచి ప్రస్తుతం 5 ఎంసీఎఫ్‌టీకి పడిపోవడంతో మార్చి మొదటి వారం తరువాత పంపింగు నిలిపివేయక తప్పని పరిస్థితి. అద్దె ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

ప్రకాశం జిల్లా కనిగిరిలో వేసవి ప్రారంభానికి ముందే భూగర్భ జలాలు అడుగంటి 40 శాతానికిపైగా బోర్లు మొరాయిస్తున్నాయి. మోటార్లకు నీరందకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాలుగు డీప్‌ బోర్లు నుంచి 20 ట్యాంకర్లతో రోజూ 200 ట్రిప్పుల్లో పురపాలకశాఖ నీటిని సరఫరా చేస్తోంది. ఫ్లోరైడ్‌ కారణంగా ఈ నీటిని వాడకానికే వినియోగిస్తున్నారు. తాగునీటిని కొనుక్కోవడం తప్పనిసరి అవుతోంది.

- ఈనాడు, అమరావతి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.