close

ప్ర‌త్యేక క‌థ‌నం

బదిలీలు ఏకపక్షమైతే.. అపశ్రుతి దొర్లినట్టే

ఎన్నికల సంఘం జవాబుదారీగా ఉండాలి 
పోలింగ్‌కు ఎందుకంత సమయం? 
ఓట్ల తొలగింపు వైఫల్యమే

ఈవీఎంలు, వీవీప్యాట్‌లు బాగానే పనిచేస్తున్నాయి 
ఓడినప్పుడే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు 
‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ 
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

‘‘ఒక పార్టీ చేసిన ఫిర్యాదును బట్టి, ఎలాంటి స్వతంత్ర విచారణ లేకుండా, సంబంధిత అధికారుల వివరణ తీసుకోకుండా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని అడగకుండా.. ఎన్నికల సంఘం ఏకపక్షంగా ఏపీ ఉన్నతాధికారులను బదిలీ చేసిందని వార్తలు వస్తున్నాయి.. అదే నిజమైతే కచ్చితంగా అపశ్రుతి దొర్లినట్లే’’ అని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. ‘ఎన్నికల సంఘానికి స్వయంప్రతిపత్తి ఉంది.. ప్రజలు, పార్టీలు, పత్రికలు దానికి మద్దతునిస్తున్నాయి. కోర్టులు అసాధారణ సమయాల్లో తప్ప జోక్యం చేసుకోకుండా గౌరవమిస్తున్నాయి. దాన్ని కాపాడుకోకుండా ఎవరో చేసిన ఫిర్యాదును బట్టి అధికారులపై చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి లేదు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన విచక్షణాధికారాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటాం.. మేమే రాజులం.. చక్రవర్తులం ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటే పొరపాటని, కచ్చితంగా ప్రజాస్వామ్యానికి, న్యాయవ్యవస్థకు జవాబుదారీతనంగా ఉండాల్సిందేనన్నారు. ప్రభుత్వ అధికారుల వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తికి, ప్రజాస్వామ్యానికి, ఎన్నికల నిర్వహణకు ప్రమాదకరం అన్నారు. ఇప్పటికైనా పొరపాటును సరిదిద్దుకొని, ఘటనపై స్వతంత్ర విచారణ చేసి, పారదర్శక నిర్ణయం తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన తన నివాసంలో ‘ఈనాడు-ఈటీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో మాట్లాడారు. ముఖ్యాంశాలివి.. 
తొలగింపు దరఖాస్తులు పునరావృతం కావొద్దు 
ప్రతి ఎన్నికల్లో నగర, పట్టణ ప్రాంతాల్లో 7-8శాతం మంది అర్హత ఉన్నా ఓటు వేయలేకపోతున్నారు. లోక్‌సత్తా చేసిన పరిశీలనలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8.4శాతం ఓట్లు ఉండాల్సినవి లేకుండా పోయినట్లు గుర్తించాం. ఓటరు జాబితాతో ఇంటింటికెళ్లి 2217 ఓట్లను పరిశీలిస్తే, దానిలో 186 మంది ఓటు కోల్పోయారు. 272 మంది లేనివాళ్ల పేర్లు జాబితాలో ఉన్నట్లు తేలింది. ఇదంతా పొరపాటున జరిగిందా? కావాలని చేస్తున్నారా? అధికార యంత్రాంగం అవినీతా? అసమర్థతా? అనేది పక్కన పెడితే.. ఈ విషయంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైంది. ఓట్ల నమోదు, తొలగింపులు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంది. ఇటీవల వివిధ పార్టీల తరఫున కొన్ని ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు వచ్చాయి. ఇలాంటి ప్రయత్నాలను అడ్డుకొని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఏం చేయాలో ఆలోచించాలి. తపాలా కార్యాలయాలను నోడల్‌ ఏజెన్సీగా పెట్టి ఓటర్ల నమోదు, తొలగింపు చేపట్టాలి. అలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఎన్నికలు అయిపోయాక క్షమించండి.. పొరపాటైపోయిందని నాలిక కరచుకోవడం అలవాటైపోయింది. ఇతర దేశాల్లో మాదిరిగా ఎక్కడికక్కడ ఓటరు నమోదు విధానాన్ని మన దగ్గరా తీసుకురావాల్సిన అవసరం ఉంది. లోక్‌సత్తా తరఫున ఎన్నిసార్లు కోరినా ఫలితం ఉండటం లేదు. నగర ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు భయంకరంగా ఉన్నాయంటే ఆ పాపం నూటికి నూరు శాతం ఎన్నికల సంఘానిదే తప్ప పార్టీలది, ప్రభుత్వానిది కాదు. 

ఎన్నికలకు అన్ని రోజులెందుకు 
ఎన్నికల్లో విశృంఖల ధన ప్రవాహం ఉందని తెలిసినా ఏం చేయలేకపోవడం.. చెల్లింపు వార్తలను పట్టించుకోకపోవడం ఎన్నికల సంఘం నిర్లక్ష్యానికి నిదర్శనం. చేయాల్సిన పనిని వదిలిపెట్టి పైపై ఆర్భాటాలకు పోతోంది. 1977లో జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు కేవలం మూడు రోజుల్లో ఎన్నికలు అయిపోయాయి. దేశం మొత్తం చైతన్యం వచ్చి ప్రభుత్వమే మారిపోయిన అంతపెద్ద ఎన్నికలు మూడు రోజుల్లో అయిపోతే.. ఈసారి ఏడు విడతల్లో ఎన్నికలు ఎందుకో అర్థం కావడం లేదు. ఏప్రిల్‌ 11న ఎన్నికలైతే మే 23 వరకు ఫలితాలు రాకపోవడం ఏంటి? ఎన్నికలను సాగదీసి తమ ప్రాభవాన్ని చాటుకోవాలి? ప్రచారం చేసుకోవాలని తప్పితే సమర్థంగా, సజావుగా నిర్వహించాలనే విషయాన్ని గుర్తించడం లేదు. ఈ విషయంలో ప్రపంచంలోని ఇతర దేశాలను చూసి నేర్చుకోవాలి. 
ఎన్నికలపై నమ్మకం పెరగాలి 
ఈవీఎంలు, వీవీప్యాట్‌లు బాగానే పనిచేస్తున్నాయి. పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయన్న దానికి ఆధారాల్లేవు. ఆ భయాన్ని వదిలేసి.. ఎన్నికల నిర్వహణపై నమ్మకాన్ని పెంచుకోవాలి. ఇదే సమయంలో అనుమానాలున్న చోట కనీసం 5-10శాతం వీవీప్యాట్‌ స్లిప్‌లను లెక్కించాల్సిన అవసరం ఉంది. ఆచరణ సాధ్యమైతే ఎన్నికల సంఘం ఈ విషయంలో ముందుకు వస్తుందనే నమ్ముతున్నా. ఓడిపోయిన ప్రతి పార్టీ ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నాయి. అదే యంత్రాలతో మళ్లీ గెలుస్తున్నారంటే వాటిని ట్యాంపర్‌ చేయడానికి వీలులేదనే విషయం స్పష్టం అవుతుంది. 
నిజామాబాద్‌లో 185 మందికి ఎన్నికలు పెట్టాల్సిందే 
నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బరిలో నిలిచిన 185 మందికి బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు పెట్టాల్సిందే. ఇప్పుడు రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకత గతంలోనూ వచ్చినప్పుడు ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికలపై ప్రభావం ఉంటుందని అనుకోవడం లేదు. భవిష్యత్తులో ఇలాంటివి జరగొద్దంటే పార్లమెంట్‌ బరిలో నిలిచే వారు ఐదు నుంచి పదివేల మంది ఓటర్ల సంతకాలు తీసుకురావాలనే నిబంధన పెట్టాలి. ఇది వీలుకాకుంటే ఆచరణ సాధ్యమయ్యే ప్రత్యామ్నాయాల దిశగా ఆలోచనలు చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.