close

ప్ర‌త్యేక క‌థ‌నం

గరిష్ఠంగా వాడేస్తున్నారు!

విద్యుత్తు వినియోగంలో రికార్డు
  శుక్రవారం 199.9 మి.యూ.కి చేరిక
  రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్‌
ఈనాడు - అమరావతి

సుర్రుమంటున్న వేడి.. ఈడ్చికొడుతున్న వడగాలులు.. ఉడికించే ఉక్కపోత.. భానుడి భగభగలకు జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఎవరైనా ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు ఉపశమనమార్గాలను వెతుక్కొంటున్నారు. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు తిరుగుతూనేఉన్నాయి. పర్యావసానంగా రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం అమాంతం పెరిగిపోతోంది. విద్యుత్తు వినియోగం రోజుకు 199.929 మిలియన్‌ యూనిట్లు వాడేంత గరిష్ఠ స్థాయికి చేరింది.

మండుతున్న ఎండలు.. ఉక్కపోతల తీవ్రతకు రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం గరిష్ఠ స్థాయికి చేరింది. ముందెన్నడూ లేని విధంగా శుక్రవారం రికార్డు స్థాయిలో 199.929 మిలియన్‌ యూనిట్ల వాడకం నమోదైంది. ఉష్ణోగ్రతలు ఇదేస్థాయిలో కొనసాగితే రోజువారీ డిమాండ్‌ 200 మిలియన్‌ యూనిట్లు దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వేడి, ఈదురుగాలుల ప్రభావంతో ట్రాన్స్‌ఫార్మర్లు ఎక్కడికక్కడ దెబ్బతింటున్నాయి. సరఫరా నిలిచిపోతోంది.

అంతకంతకు అధికమై
రాష్ట్రవ్యాప్తంగా మార్చి నుంచే ఉష్ణోగ్రతల పెరుగుదల మొదలైంది.అప్పటి నుంచే విద్యుత్తు డిమాండ్‌ పెరుగుతూ వచ్చింది. మార్చి 6న 191.198 మిలియన్‌ యూనిట్లకు చేరింది. 30న డిమాండ్‌ 197.70 మిలియన్‌ యూనిట్లుగా ఉంది. ఏప్రిల్‌ 5 దాకా సగటున ఇదే స్థాయిలో వాడకం నమోదైంది. మే 6 నుంచి  ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరాయి. దీనికి అనుగుణంగానే విద్యుత్తు డిమాండ్‌ పెరుగుతూ వచ్చింది. అత్యధికంగా 199.929 మిలియన్‌ యూనిట్లకు చేరింది.

* 2016 మార్చి నాలుగో వారంలో గరిష్ఠంగా రోజువారీ వినియోగం 162 మిలియన్‌ యూనిట్లు మాత్రమే ఉంది. గతేడాది మార్చి 29న అత్యధికంగా 185 మిలియన్‌ యూనిట్లు మాత్రమే నమోదైంది. మే నెలలోనూ 178 మిలియన్‌ యూనిట్లకు మించలేదు.

ఏసీల వాడకమే
ఎండలు, ఉక్కపోతతో ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్‌ల వాడకం అధికం కావడంతో విద్యుత్తు డిమాండ్‌ అమాంతం పెరుగుతోంది. ఉదయం 10 గంటల నుంచే ఉష్ణోగ్రత పెరుగుతోంది. గతంలో రోజుకు ఒకటి రెండు గంటలు ఏసీ వినియోగించేవారు ఇప్పుడు 10 నుంచి 12 గంటలపాటు వేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తాళాలు తీయడంతోనే స్విచ్‌ ఆన్‌ చేస్తున్నారు. వీటన్నిటి మూలంగా వినియోగం తారస్థాయికి చేరుతోంది. దుకాణాల్లో శీతలపానీయాలు చల్లబడాలంటే రాత్రింబంవళ్లు ఫ్రిజ్‌ వేసి ఉంచాల్సి వస్తోందని వ్యాపారులు గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో వ్యవసాయ అవసరాలకు వినియోగం తగ్గడం వల్ల గ్రిడ్‌పై భారం తగ్గుతోంది. రాష్ట్రంలో 18 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనక్షన్లు ఉన్నాయి. భూగర్భ జలమట్టం పడిపోవడంతో బోర్లు అడుగంటాయి. ఖరీఫ్‌, రబీ పూర్తి కావడంతో సాగు అవసరాలు తగ్గాయి. ఉద్యాన పంటలకు మాత్రమే విద్యుత్తు వాడుతున్నారు.

ట్రాన్స్‌ఫార్మర్లలో మంటలు
* గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో విద్యుత్తు వినియోగం పెరిగి లైన్‌ లోడింగ్‌పై భారం పడి పలుచోట్ల సరఫరా నిలిచిపోయే పరిస్థితి తలెత్తుతోంది.
* అధిక ఉష్ణోగ్రతలు, పిడుగుపాటు కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటున్నాయి. గతంలోనూ ఇవి రోజువారీ కొన్ని కాలిపోయే పరిస్థితి ఉన్నా.. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, వేడి కారణంగా 20శాతం వరకు పెరిగాయి. చాలా చోట్ల అధిక ఉష్ణోగ్రతల కారణంగా లోడ్‌ పెరిగి మంటలు వస్తున్నాయి. వ్యవసాయ ఫీడర్ల పరిధిలో పిడుగులు పడి కాలిపోతున్నాయి. గ్రామాల్లో తాగునీటి సరఫరా దెబ్బతింటోది. వీటిని వెంటనే తక్షణం పునరుద్ధరిస్తున్నారు. దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలో మే 1 నుంచి 1,622 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నట్లు ఫిర్యాదులు అందాయి. ఇందులో 289 ఇంకా సరిచేయాల్సి ఉంది. శుక్రవారం 197, శనివారం మధ్యాహ్నానికే 73 పనిచేయడం లేదు. తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలో గత 10 రోజుల్లో 655 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఇందులో 107 ఇంకా సరిచేయాల్సి ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో 231 దెబ్బతిన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.