close

ప్ర‌త్యేక క‌థ‌నం

మేల్కొనాల్సిన తరుణమిదే

పాఠాలు నేర్పుతున్న ఇటలీ, ఇరాన్‌లు
భారత్‌లో రాబోయే వారాలు అత్యంత కీలకం

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లో ఇప్పుడు కీలక దశలోకి చేరుకుంది. వైరస్‌ కేసులు దేశంలో నిలకడగా పెరుగుతున్నాయి. రాబోయే కొన్ని వారాలు మనకు అత్యంత కీలకం. జనతా కర్ఫ్యూ    తరహాలో ప్రజలు సామాజిక దూరాన్ని పాటించడం, స్వీయ ఏకాంత చర్యలతో సమీప భవిష్యత్‌లో మన దేశం కూడా చైనా తరహాలో విజయాన్ని సాధించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలా చేయకుంటే మాత్రం ఇటలీ, ఇరాన్‌ తరహాలో వ్యాధి ఉద్ధృతంగా వ్యాపించొచ్చని వారు హెచ్చరిస్తున్నారు. తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని  కారణంగా ఇటలీ, ఇరాన్‌లలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అక్కడ పరిస్థితి ఇప్పటికే అదుపుతప్పింది. దీన్ని నివారించాలంటే కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. మన దేశంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

వివిధ దేశాల్లో కొవిడ్‌-19 వ్యాప్తిని మ్యాప్‌ చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), అమెరికాలోని జాన్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం అందించిన డేటా ఆధారంగా భారత్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో గణితశాస్త్రవేత్తలు కొన్ని సంభావ్యత నమూనాలను రూపొందించారు. దీని ఆధారంగా వచ్చే 2-3 వారాల్లో దేశంలో కరోనా కేసులు 415-1,000కి చేరొచ్చని అంచనా వేశారు. చెన్నైలోని మేథమేటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సౌరిష్‌ దాస్‌.. ‘ట్రాన్స్‌ఫర్‌ లెర్నింగ్‌’ అనే విధానంతో విశ్లేషణ చేశారు. ఇటలీ, చైనా సహా వ్యాధి విజృంభణ ఎక్కువగా ఉన్న దేశాల్లో వైరస్‌ వ్యాప్తి తీరుతెన్నులను ఇందులో పరిశీలించారు. వాటిని భారత్‌లోని పరిస్థితులకు అనుకరించి చూశారు. ‘‘చైనా తరహాలో ఈ వ్యాధి భారత్‌లోనూ విస్తరించే వీలుందని మనం భావించి, స్వీయ ఏకాంత చర్యలు, సామాజిక దూరం వంటివి కట్టుదిట్టంగా పాటిస్తే.. భారత్‌లోనూ చైనా తరహా విజయాలు నమోదవుతాయి. వైరస్‌ వ్యాప్తిని నివారించడంలో విఫలమైతే ఇటలీ తరహా పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటప్పుడు ఏప్రిల్‌ 15 నాటికి కేసుల సంఖ్య 3500ను మించిపోతాయి. అయితే యువ జనాభా అధికంగా ఉన్నందువల్ల మన దేశంలో అంతపెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం లేదు. ఇటలీలో సరాసరి వయసు 45 కాగా.. భారత్‌లో అది 28గా ఉంది’’ అని సౌరిష్‌ దాస్‌ పేర్కొన్నారు. అయితే భారత్‌కు ప్రత్యేకమైన సమాజ వ్యవహారశైలి, వాతావరణం వంటి అంశాలను ఇందులో విస్మరించారని, ఇతర దేశాల నుంచి సేకరించిన డేటాపై ఆధారపడటం సరికాదని మరో శాస్త్రవేత్త సీతాభ్ర సిన్హా పేర్కొన్నారు.


నిర్లక్ష్యానికి ఇరాన్‌ మూల్యం!

తేలిగ్గా తీసుకుంటే కరోనా ఎంత ప్రమాదకరమో.. ఇరాన్‌లో ఈ వైరస్‌ పడగవిప్పిన తీరు తేటతెల్లం చేస్తోంది. పశ్చిమాసియాలో ప్రతి 10 కేసుల్లో 9 ఇక్కడే నమోదవుతున్నాయి. ఈ ప్రాంతంలోని మిగతా దేశాల్లో నమోదైన మరణాలు దాదాపు 60 కాగా.. ఇరాన్‌లో ఇంతవరకు 1,650 మందికి పైగా చనిపోయారు.  ఇరాన్‌లో కరోనా ఛాయలు మొదలైన కొత్తలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో క్రమేపీ ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చింది. ‘‘కరోనాతో ఇరాన్‌కు ముప్పేమీ లేదు.. వేరుగా ఉంచడం (క్వారంటైన్‌) అనేది రాతియుగపు నాటి చర్య..’’ ఇరాజ్‌ హారిర్చి కెమేరాల ముందు ఫిబ్రవరి చివరి వారంలో అన్న మాటలివి. మరుచటిరోజే ఆయనకు కరోనా సోకడంతో క్వారంటైన్‌ చేయాల్సి వచ్చింది. హారిర్చి ఈ దేశంలో కరోనాపై పోరాడుతున్న ప్రత్యేక కార్యదళానికి అధిపతి కూడా. ఇరాన్‌లో ఇప్పుడు 21 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో ఆ దేశం ఇప్పుడు చర్యలు చేపట్టింది.

ఇరాన్‌లో పర్షియన్‌ కొత్త సంవత్సరం(ఈనెల 20) వేడుకల నాటికి వైరస్‌ను కొంత కట్టడి చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా శ్రద్ధ చూపలేదు. ప్రధాన నగరాల మధ్య రాకపోకలను నిలిపివేయడం, ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో నిషేధం విధించడం వంటి చర్యలేవీ చేపట్టలేదు. ఖోమ్‌ నగరం నుంచే ఇరాన్‌లో కరోనా విస్తరించింది. తొలిసారి రెండు కరోనా కేసులు ఫిబ్రవరి 19న ఖోమ్‌లోనే వెలుగు చూశాయి. ఇరాన్‌ అధికారులు కరోనా సమాచారం బయటకు రానీయలేదు. ఇస్లామిక్‌ విప్లవ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న నేపథ్యంలో దీన్ని బయటపెట్టి ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్‌లో ఫిబ్రవరి 21న పార్లమెంటు ఎన్నికలు కూడా జరిగాయి. అంతకు కొద్ది రోజుల ముందే బాగ్దాద్‌లో అమెరికా డ్రోన్‌ దాడిలో ఇరన్‌ అగ్రశ్రేణి జనరల్‌ సులేమీనీ హతమయ్యారు. కరోనా ఉనికిని బయటకు రానివ్వకుండా చేయడానికి ఈ పరిణామాలన్నీ కారణాలు కావచ్చని భావిస్తున్నారు.

చర్యలకు దిగిన ఇరాన్‌
పరిస్థితి దిగజారిన నేపథ్యంలో ఇరాన్‌లో కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు. పర్షియన్‌ కొత్త సంవత్సర (ఫైర్‌ ఫెస్టివల్‌) వేడుకలను నిషేధించారు. షియాల కీలక ప్రాంతాలతో పాటు, అన్ని విద్యాసంస్థలను మూసివేశారు. అన్ని సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలను వాయిదా వేశారు. శుక్రవారం ప్రార్థనలను నిలిపివేయడంతో పాటు, రెండో దశ శాసన ఎన్నికలను కూడా వాయిదా వేశారు. నగరాలను విడిచి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించారు. 13 ప్రావిన్సుల్లో ప్రత్యేక బృందాలను ఇరాన్‌ నియమించింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా 85,000 మంది ఖైదీలను తాత్కాలిక సెలవుపై విడుదల చేశారు. ప్రజలు ప్రయాణాలను కొనసాగిస్తూ.. ఆరోగ్య సూచనలు పాటించకపోతే లక్షల సంఖ్యలో చనిపోయే ప్రమాదం ఉందని ఇరాన్‌ ప్రజలకు హెచ్చరించింది. అనవసర ప్రయాణాలను నిషేధిస్తూ ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతొల్లా అలీ ఖామెనెయ్‌ అరుదైన రీతిలో ఫత్వా జారీ చేశారు. అయితే ప్రార్థన ప్రాంతాలను మూసివేయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.


ఇటలీలోచావుకేక
అంత్యక్రియలకూ నోచుకోని మృతదేహాలు

అది ఇటలీ ఉత్తర ప్రాంతంలోని లోంబార్డీ ప్రావిన్సులో ఉన్న బెర్గామో పట్టణం. ఇక్కడ విటోరియా(79) అనే వ్యక్తి కరోనా మహమ్మారి బారినపడి కన్నుమూశాడు. కూతురు లూకా డి పాల్మా తండ్రి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ అంత్యక్రియల కోసం అనేక మృతదేహాలు క్యూలో ఉన్నాయి. విటోరియా మృతదేహాన్ని ఉంచడానికి అక్కడ స్థలం లేదు. అధికారులు అతని భౌతిక కాయాన్ని ఇంటికి తిప్పిపంపారు. దీంతోపాటు ఓ శవపేటిక, కొన్ని కొవ్వొత్తులు, ఓ శిలువ, మృతదేహాన్ని భద్రపరిచే రిఫ్రిజిరేటర్‌ను లూకాకు ఇచ్చి పంపారు. కొన్ని రోజులు ఇంట్లోనే భద్రపరచాలని సూచించారు.

రెంజో(85) కరోనా వైరస్‌కు బలయ్యారు. ఆయన మృతదేహాన్ని బెర్గామోలోని చర్చి వద్ద రోజుల తరబడి అంత్యక్రియల కోసం వదిలేయాల్సిన పరిస్థితి.. ఇతని భార్యకూ వైరస్‌ సోకింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వీరితో కలిసి తిరిగిన కూతురు మార్తా తీస్తా(43) ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నారు. తీస్తాకు ఆమె పిల్లలు బయటి నుంచే ఆహారం అందించి వెళుతున్నారు. రెంజోకు నివాళి అర్పించేవారు లేరు.

టలీలోని బెర్గామో పట్టణం ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతోంది. సునామీలా వచ్చి పడిన మహమ్మారి దెబ్బకు వందల మంది ఇక్కడ పిట్టల్లా రాలిపోయారు. ఈ ఉత్పాతాన్ని 11 లక్షల మంది నివసించే ఈ సుసంపన్న పట్టణం కలలో కూడా ఊహించి ఎరుగదు. ఒక్కసారిగా మృతదేహాల సంఖ్య పెరగడంతో వాటికి అంత్యక్రియలు నిర్వహించలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండు ఆసుపత్రుల వద్ద, ఒక శ్మశానవాటిక వద్ద, మరో చర్చి సమీపంలో మృతదేహాల్ని భద్రపరిచే గదులు నిండిపోయి, ఇంకా వస్తున్న వాటిని లోపలికి తీసుకునే పరిస్థితి లేక, వాటిని క్యూలైన్లలో ఉంచుతున్నారు. లేదా ఇళ్లకు తిప్పిపంపి, కొద్దిరోజులు అక్కడే భద్రపరచాలని సూచిస్తున్నారు. కరోనా ఆనవాళ్లు వెలుగుచూసిన కొత్తలోనే ఇటలీలో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

కరోనా అనుమానితుల సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్సులు సైరన్లు మోగించుకుంటూ వెళ్లి.. ఆ వ్యక్తుల్ని ఆసుపత్రికి తరలిస్తున్నాయి. అక్కడ అదుపులోకి రాని కేసులు చివరికి కవర్లు కప్పి ఉంచిన మృతదేహాల రూపంలో బయటికి వస్తున్నాయి. బెర్గామో ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసి ఉన్నాయి. ఇక కొత్త రోగుల్ని తీసుకునే పరిస్థితి లేదని డాక్టర్లు వాపోతున్నారు. సైనిక డాక్టర్లు 24 గంటలూ సేవలు అందిస్తున్నారు. ఇలా చికిత్స అందిస్తున్న 10 మంది డాక్టర్లకూ వైరస్‌ సోకింది. మృతదేహాల్ని తీసుకువెళ్లే అంబులెన్సులు, గుర్రపు బండ్ల చప్పుళ్లు మాత్రమే బెర్గామోలో రాత్రివేళల్లో వినపిస్తున్నాయి.

పత్రికల నిండా స్మృత్యంజలులే!
పత్రికల్లో స్మృత్యంజలి ప్రకటనలు విపరీతంగా పెరిగిపోయాయి. కేవలం రెండు పేజీల స్మృత్యంజలి ప్రకటనలు ప్రచురించే పత్రికలు సైతం ప్రస్తుతం 10 పేజీల దాకా.. దాదాపు 150 మంది పేర్లను ప్రచురిస్తున్నాయి. ‘ఎల్‌ఎకోడీ బెర్గామో’ అనే పత్రికలో అయితే ఎటుచూసిన స్మృత్యంజలి ప్రకటనలే.


భారత్‌లో సవాళ్లెన్నో!

ఇప్పటి వరకు మన ప్రభుత్వాలు వైరస్‌ వ్యాప్తి కట్టడికి ప్రశంసనీయ కృషి చేశాయి. గతంలో ఎన్నో అంటువ్యాధులను సమర్థంగా ఎదుర్కొన్న చరిత్ర మనకుంది. కరోనా నియంత్రణలో పౌరుల బాధ్యత కూడా చాలా ముఖ్యం. అయితే మన దేశంలో కొన్ని సవాళ్లు ఉన్నాయి. అవి ఏమిటంటే..


లక్షణాలను దాచొద్దు

విదేశాల నుంచి వచ్చేవారిని విమాన, నౌకాశ్రయాల్లో పరీక్షిస్తున్నారు. 14 రోజులపాటు ఏకాంతం(క్వారంటైన్‌)లో ఉంచుతున్నారు. అయితే... వైరస్‌ సోకిన కొందరిలో 24 రోజుల వరకు లక్షణాలు బయటకు కనిపించవు. అలాంటి వ్యక్తులు ముందుగానే ఏకాంతం నుంచి బయటకు వస్తే ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే ముప్పుంది. పరీక్షల్లో జ్వరం వంటి లక్షణాలు బయటపడకుండా కొందరు ఉద్దేశపూర్వకంగా మాత్రలు వేసుకుంటున్నారు. పరీక్షల సమయంలోనూ తమ ఆరోగ్య పరిస్థితిపై తప్పుడు సమచారం ఇస్తున్నారు. మరికొందరు ఏకాంతం నుంచి పారిపోతున్నారు. ఏకాంతం నుంచి బయటకు రాని విధంగా పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.


సెలవులిచ్చింది విహారానికి కాదు

దేశవ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూసేశారు. విద్యార్థులు ఎవరిళ్లలో వారుంటే వైరస్‌ వ్యాప్తి అవకాశాలు తగ్గుతాయన్నది లక్ష్యం. అయితే... చాలామంది బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. ఇది సరికాదు.వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ‘ఇంటి నుంచే పని(వర్క్‌ ఫ్రం హోం)’ బాగా ఉపయోగపడుతుంది. పలు సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఇప్పటికే అనుసరిస్తున్నాయి.


అల్పాదాయ వర్గాలకు అండగా నిలవాలి

మన పట్టణాలన్నీ మురికివాడలు, అల్పాదాయ వర్గాల సమూహాలతో కిక్కిరిసిపోయాయి. పేదలంతా పొట్టకూటి కోసం నిత్యం పనిచేయాల్సిందే. వీరి ఇళ్లు, పని ప్రదేశాలు, వీధుల్లో శుభ్రత ప్రమాణాలు అంతంతమాత్రమే. ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. అవసరమయితే ఆరు నెలలకు సరిపడా రేషన్‌ సరకులను ఒక్కసారిగా తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ఈ దిశగా ప్రజాపంపిణీ వ్యవస్థను ఆగమేఘాల మీద సిద్ధం చేస్తే అల్పాదాయ వర్గాల వారూ పరిమితంగా అయినా ఇళ్ల వద్దే ఉండేట్లు చూడొచ్చు. పలు  రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి.


పరీక్షల కిట్‌ల కొరత

కరోనా విజృంభిస్తే... బాధితులను పరీక్షించేందుకు కోట్ల కొద్దీ కిట్లు అవసరమవుతాయి. వాటిని మనదేశంలో తయారుచేయడం లేదు. ప్రస్తుతం లక్ష కిట్లు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. ఇక దేశవ్యాప్తంగా నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో రోజుకు తక్కువ సంఖ్యలో నమూనాలనే పరీక్షించొచ్చు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్‌లను అనుమతించడం కొంత ఊరట. ఎక్కువ కిట్లను అందుబాటులోకి తెచ్చి ఎక్కువ ల్యాబ్‌లను సిద్ధం చేయడం అత్యవసరం


అసత్య ప్రచారాన్ని కట్టడి చేయాలి

కరోనా వ్యాప్తిపై అసత్య ప్రచారాలు, బూటకపు వార్తలను అడ్డుకోవడం మరో సవాల్‌. వీటితో జనం భయాందోళనకు లోనవుతారు. రష్యాలో అధికారులు కృత్రిమ మేధస్సు(ఏఐ) సాయంతో సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టారు. మనదేశంలోనూ అలాంటి పర్యవేక్షణ అవసరం.

-ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.