‘కేర్‌’ళభళా
‘కేర్‌’ళభళా

ముందు జాగ్రత్తతో కరోనా కేసులకు కళ్లెం!
నివారణ చర్యల్లో ఇతరులకు స్ఫూర్తి
తొలికేసు నమోదైన రాష్ట్రంలో తగ్గిన వ్యాప్తి

భారత్‌లో కరోనా ఉనికి బయటపడిందీ, తొలి కేసు నమోదైందీ కేరళలోనే. కానీ ఈ రాష్ట్రం భయపడలేదు, మనో నిబ్బరాన్ని ఏమాత్రం కోల్పోలేదు. ప్రకృతి ప్రళయాలను, వైరస్‌ రక్కసులను గుండె ధైర్యంతో ఎదుర్కొన్న ఈ రాష్ట్రం ఇప్పుడు అదే స్థైర్యంతో కొవిడ్‌ మహమ్మారితోనూ గట్టిగా పోరాడుతోంది. గెలిచి తీరుతామన్న సంకేతాలిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తున్నా... కేరళలో మాత్రం దాని వేగానికి కళ్లెం పడటానికి ఇక్కడ తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలే కారణం....

 

రెండేళ్ల క్రితం నిఫా వైరస్‌ విజృంభిస్తే దాన్ని కేరళ రాష్ట్రం మట్టుపెట్టింది. ప్రకృతి.. బీభత్సం సృష్టిస్తే మొక్కవోని దీక్షతో ఎదురొడ్డింది. ఇప్పుడూ అదే దీక్ష, పట్టుదలతో కరోనాకు కళ్లెం వేస్తోంది. జనవరి 30న దేశంలోనే తొలి కరోనా కేసు ఇక్కడ నమోదైనప్పుడు కేరళ అప్రమత్తమైందే తప్ప ఆందోళన చెందలేదు. పటిష్ట చర్యల్ని పక్కాగా చేపట్టిందే తప్ప చేష్టలుడిగి కూర్చోలేదు. కేరళ రాష్ట్ర జనాభా 3.34 కోట్లు. ఇంతవరకు నమోదైన కరోనా కేసులు 336. అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్ర జనాభా 1.94 కోట్లు. కేరళలో కరోనా వచ్చిన నెల రోజుల తర్వాత అక్కడ వైరస్‌ ఆనవాళ్లు కనిపించాయి. ఏప్రిల్‌ 5 నాటికే న్యూయార్క్‌లో కరోనాతో చనిపోయిన వారు 3,218 మంది. ప్రస్తుతం అక్కడి ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. కొత్తవారికి చోటు లేదు. భారత్‌లోనూ మొత్తం కేసులు 6 వేలకు దగ్గరయ్యాయి. కరోనా వ్యాప్తి వేగాన్ని కేరళ ఎలా అదుపు చేస్తోందన్నది ఆసక్తికరం.

ఎలా అదుపుచేస్తోంది?
చైనాలో కరోనాకు కేంద్ర బిందువైన వుహాన్‌ నుంచి జనవరిలో తిరిగి వచ్చిన 20 మంది వైద్య విద్యార్థుల నమూనాలను పరీక్షల కోసం పుణెకు పంపితే... త్రిసూర్‌కు చెందిన విద్యార్థిని ఒకరికి కరోనా సోకినట్లు తేలింది. ఒక కేసే కదా అని అధికారులు అలసత్వం ప్రదర్శించలేదు. అదేరోజు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ, కార్యదర్శి రాజన్‌ గోబ్రగడె త్రిసూర్‌ వైద్య కళాశాలలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులకూ యుద్ధ ప్రాతిపదికన హెచ్చరికలు జారీచేశారు. అన్ని విమానాశ్రయాల్లోనూ ప్రయాణికులకు స్క్రీనింగ్‌ మొదలైంది. చైనా సహా ఇతర దేశాల నుంచి వచ్చిన వారితోపాటు, వారి బంధువుల్లో 1,036 మందిని హోం క్వారంటైన్‌కు తరలించగా... 15 మందిని ఆసుపత్రుల్లో చేర్చి పరిశీలనలో ఉంచారు. కరోనా కంట్రోల్‌ రూం ఏర్పాటుతోపాటు హెల్ప్‌లైన్‌ నంబర్లనూ అదేరోజు అందుబాటులోకి తెచ్చారు.

ఆదిలోనే అప్రమత్తత
మొదటి కేసు నమోదైన 5 గంటల్లోనే త్రిసూర్‌ వైద్య కళాశాలలో ఐసోలేషన్‌ వార్డును, 20 ప్రత్యేక గదులను అందుబాటులోకి తెచ్చారు. తొలి బాధితురాలిని అక్కడికి తరలించి చికిత్స ప్రారంభించారు. ఆమెతోపాటు ప్రయాణించిన మరో ఐదుగురు విద్యార్థులను త్రిసూర్‌ జనరల్‌ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. చైనా నుంచి వచ్చిన వారు ఎవరెవరిని కలిశారు? ఎక్కడ తిరిగారు? అనే వివరాల్ని ఆరోగ్యశాఖ అధికారులు సేకరించి, ఇతర ప్రభుత్వ శాఖలకు పంపి అప్రమత్తం చేశారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని, వేడుకల్లో పాల్గొనవద్దని హెచ్చరించారు.

‘గొలుసు’ తెంచాలని...
అలప్పుజ, కాన్హన్‌గోడ్‌లో మరో రెండు కరోనా కేసులు బయటపడగానే రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కరోనాను రాష్ట్రస్థాయి విపత్తుగా ప్రకటించింది. ఆరోగ్యపరమైన అంశాన్ని విపత్తుగా ప్రకటించడం కేరళలో ఇదే తొలిసారి. మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి సోకకుండా అడ్డుకునేందుకు ‘బ్రేక్‌ ద చైన్‌’ పేరిట ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వ యంత్రాంగం నడుం బిగించింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రం నలుమూలలా రాత్రింబవళ్లూ ప్రచారం చేసింది. చేతుల్ని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుపుతూ బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లను, హోర్డింగ్‌లను ఏర్పాటు చేసింది. దిన పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. రద్దీ ప్రదేశాలు, బస్‌స్టాండ్లు, మార్కెట్లలో, రహదారుల పక్కన చేతులు శుభ్రం చేసుకునేందుకు సబ్బులు, నీటిని సిద్ధంచేశారు.

భారీగా వైద్యుల నియామకం
రాష్ట్ర అవసరాల రీత్యా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఒక్కరోజులో 300 మంది వైద్యులు, పెద్ద సంఖ్యలో నర్సుల నియామకాలు శాశ్వత ప్రాతిపదికన పూర్తయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అనుమానితుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపే ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు.

భౌతిక దూరం... సామాజిక ఏకత
‘భౌతికంగా దూరం.. సామాజిక ఏకత’ నినాదంతో ప్రభుత్వం ప్రజలను చైతన్య పరిచింది. విదేశీ యానం చేసినవారు 14 రోజుల హోం క్వారంటైన్‌ తర్వాతే బయటకు రావాలని కఠినమైన ఆదేశాలిచ్చింది. కరోనా ఉన్న దేశాల నుంచి కేరళ వచ్చిన వారి పేర్లు, ఫోన్‌ నంబర్లు సహా సమీకరించి వాటిని ఆరోగ్య శాఖ సిబ్బందికి అందించారు. తద్వారా వారిని గుర్తించడం, అప్రమత్తం చేయడం, నిఘా వేయడం వంటి కార్యక్రమాల్ని నిర్వహించారు. కరోనా పరిస్థితి, నివారణ చర్యలపై జిల్లాల కలెక్టర్లు ప్రతిరోజూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. కరోనా బాధితులతోపాటు సెల్ఫ్‌క్వారంటైన్‌లో ఉన్నవారు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్యను ప్రతిరోజూ ప్రజలకు తెలుపుతున్నారు.

‘అతిథు’లకు అండదండలు
ఇతర రాష్ట్రాల నుంచి పనుల కోసం కేరళ వలస వచ్చిన వారిని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంది. వారిని ‘అతిథి కూలీలు’గా సంబోధిస్తోంది. పరిశుభ్ర ప్రదేశాల్లో ఉంచి, మంచి ఆహారం ఇస్తూ అవసరమైన వారికి వైద్య సదుపాయాలను కల్పిస్తోంది. రేషన్‌ కార్డులున్న అందరికీ ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. ప్రతి పంచాయతీలోనూ కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటుచేసి అన్నార్థులకు వండి పెడుతోంది.

ప్రాణాల్ని నిలుపుతూ...

దేశంలో కెల్లా ఎక్కువ వయసున్న బాధితుడు(93) ఒకరు కరోనాను జయించడం కేరళకు గర్వకారణంగా నిలిచింది. ఏడుగురు విదేశీ పర్యాటకులూ కోలుకుని తమ దేశాలకు క్షేమంగా వెళ్లారు. ఎంతోమంది కరోనా రోగులకు సేవలందించిన ఓ నర్సుకూ వైరస్‌ సోకింది. చెక్కు చెదరని గుండె నిబ్బరంతో ఆమె కరోనాను ఓడించింది. మళ్లీ రోగులకు చికిత్సలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ‘కేరళ నేటి ఆలోచనలే.. దేశం రేపటి ఆలోచనలు’ అని జాతీయ మీడియా ప్రశంసించే స్థాయిలో రాష్ట్రంలో ఆరోగ్య, విద్య తదితర వ్యవస్థలు పటిష్టంగా ఉన్నాయి.


కరోనా కరాళ నృత్యానికి కేరళ వేదిక కారాదు. మహమ్మారిని అడ్డుకునే క్రమంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించరాదు. అందరమొక్కటై నిలుద్దాం.

-పినరయి విజయన్‌ కేరళ ముఖ్యమంత్రి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని