close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దక్షిణాది వైరస్‌లో సింగపూర్‌ మూలాలు

చైనా కరోనాకు ఇది పూర్తి భిన్నం
‘ఈనాడు’తో సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా

కరోనా వైరస్‌ జన్యుక్రమాన్ని కనుగొనడంలో సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) పురోగతి సాధించింది. భారత్‌లో సోకిన వైరస్‌ ప్రత్యేకమైనదని గుర్తించిన ఆ సంస్థ.. దక్షిణాదిలో ఎక్కువగా సింగపూర్‌, ఆసియా దేశాల్లోని వైరస్‌ మూలాలు ఉన్నాయని వెల్లడించింది. కొవిడ్‌-19కు సంబంధించి 72 జన్యుక్రమాలను అంతర్జాతీయ డేటాబేస్‌లో తాజాగా పొందుపరిచింది. ఈ సందర్భంగా సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రాతో ‘ఈనాడు’ ముఖాముఖి జరిపింది.

భారత్‌ నుంచి ఎన్ని డేటాబేస్‌కు చేరాయి
మనదేశం నుంచి దాదాపు 300 వైరస్‌ జన్యుక్రమాలను వేర్వేరు పరిశోధన సంస్థలు పంపించాయి. సీఎస్‌ఐఆర్‌ ప్రయోగశాలలు సీసీఎంబీతో పాటు ఐజీఐబీ కలిసి ఇప్పటివరకు 160 సమర్పించాయి. గుజరాత్‌లోని మరో పరిశోధన సంస్థ 100 వరకు సమర్పించింది. అంతర్జాతీయ జీనోమ్‌ డేటాబేస్‌లో ప్రపంచవ్యాప్తంగా 30 వేల వైరస్‌ జన్యుక్రమాలు ఇప్పటివరకు పొందుపర్చారు.

వైరస్‌ జన్యుక్రమాల విశ్లేషణలో ఏం గుర్తించారు
సీసీఎంబీలో కనుగొన్న వైరస్‌ జన్యుక్రమాలు ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలకు చెందినవి. తెలంగాణ, తమిళనాడు, పుణేకు చెందిన వైరస్‌ నమూనాలు ఎక్కువగా మాకు అందాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవి పరిమితం. భారత్‌లో సోకిన వైరస్‌లో ప్రత్యేకమైన జన్యుమార్పులు ఉన్నట్లు గుర్తించాం. దక్షిణాదిలోని కరోనా మూలాలు ఎక్కువగా సింగపూర్‌, భారత్‌ సమీప ఆసియా దేశాల్లో కనిపించాయి. దిల్లీ, గుజరాత్‌లో సోకిన వైరస్‌ మూలాలు ఇక్కడికి భిన్నంగా ఉన్నాయి. కొవిడ్‌-19 చైనా నుంచి వివిధ దేశాల్లో వ్యాపించినా.. దక్షిణాదిలోని కరోనా జన్యుక్రమాల్లో నేరుగా చైనా వైరస్‌ మూలాలు లేవు. భారత్‌కు సమీపంలోని ఆసియా దేశాల నుంచి కొవిడ్‌ ఇక్కడికి పాకింది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో సోకిన వైరస్‌ ప్రమాదకరమైనదా కాదా నిర్ధారణకు రావాలంటే మరిన్ని వైరస్‌ జన్యుక్రమాలను విశ్లేషించాలి. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నమూనాల లభ్యత క్లిష్టంగా ఉంది. అన్ని ఆసుపత్రులు వైరస్‌ నమూనాలను అందజేయాలని భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) తాజాగా ఆదేశించింది. ఆ మేరకు హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రి నుంచి కూడా వైరస్‌ నమూనాలు మా దగ్గరకు వస్తున్నాయి. పెద్ద సంఖ్యలో జన్యుక్రమాలను కొనుగొన్న తర్వాతే భారత్‌లోని వైరస్‌పై మరింత స్పష్టత వస్తుంది.

సీసీఎంబీ ఎన్ని జన్యుక్రమాలను కనుగొంది
కొవిడ్‌-19కు సంబంధించి 72 జన్యుక్రమాలు పూర్తయ్యాయి. వీటిని ‘గ్లోబల్‌ ఇనీషియేటివ్‌ ఆన్‌ షేరింగ్‌ ఆల్‌ ఇన్‌ఫ్లూయంజా డేటా’ అనే అంతర్జాతీయ జీనోమ్‌ డేటాబేస్‌కు సమర్పించాం. సమగ్రంగా వచ్చాక కనీసం 120 జన్యుక్రమాలు పూర్తయ్యాకే సమర్పించాలని మొదట అనుకున్నా జాప్యమవుతుండటంతో ఇప్పటివరకు ఉన్నవాటిని ఇచ్చాం. ప్రస్తుతం మరో 90 వరకు  విశ్లేషణ దశలో ఉన్నాయి. వీటిల్లోంచి 70 వరకు వచ్చేవారం డేటాబేస్‌కు పంపిస్తాం. అంతర్జాతీయ డేటాబేస్‌కు త్వరగా చేరితే ఎక్కువ సంస్థలు వైరస్‌పై పరిశోధించేందుకు ఉపయోగపడుతుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.