close

తెలంగాణ లోక్‌సభా స్థానాలు

వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం 

వరంగల్‌ లోక్‌సభ స్థానం 1952లో ఆవిర్భవించింది. ఈ స్థానాన్ని ఎస్సీకి రిజర్వ్‌ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో స్టేషన్‌ఘన్‌పూర్ (ఎస్సీ), వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పాలకుర్తి, వర్ధన్నపేట(ఎస్సీ), పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలు వరంగల్ (ఎస్సీ) లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ అసెంబ్లీ స్థానం ఒక్కటి మాత్రం భువనగిరి లోక్‌సభ పరిధిలో ఉంటుంది.

1978 నుంచి వరంగల్, హన్మకొండ లోక్‌సభ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి. హన్మకొండ లోక్‌సభ స్థానం పరిధిలో కరీంనగర్ జిల్లా కమలాపూర్ నియోజకవర్గం ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గతంలో జనరల్ స్థానాలుగా ఉన్న హన్మకొండ, వరంగల్ లోక్‌సభ స్థానాలు కాస్తా.. వరంగల్(ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) లోక్‌సభ స్థానాలుగా మార్పు చెందాయి. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు.. హన్మకొండ స్థానం నుంచి పీవీ నర్సింహారావు(కాంగ్రెస్), జంగారెడ్డి(భాజపా), కమాలొద్దీన్ అహ్మద్(కాంగ్రెస్), చాడ సురేష్‌రెడ్డి(తెదేపా), బోయినపల్లి వినోద్‌కుమార్(తెరాస) ప్రాతినిధ్యం వహించారు. వరంగల్ నియోజకవర్గం నుంచి రామసహాయం సురేందర్‌రెడ్డి(కాంగ్రెస్), కల్పనాదేవి(కాంగ్రెస్), చందూలాల్(తెదేపా), బోడకుంటి వెంకటేశ్వర్లు(తెదేపా), రవీంద్రనాయక్(తెరాస), ఎర్రబెల్లి దయాకర్‌రావు(తెదేపా), సిరిసిల్ల రాజయ్య(కాంగ్రెస్) ప్రాతినిధ్యం వహించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజయ్యపై తెరాస అభ్యర్థి కడియం శ్రీహరి 3,92,937 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

ప్రస్తుతం ఎన్నికల్లో అధికార తెరాస నుంచి సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ మరోసారి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ పార్టీ దొమ్మాటి సాంబయ్యను ఎంపిక చేసింది. భాజపా నుంచి చింతా సాంబమూర్తి ఎన్నికల బరిలో ఉన్నారు.

ఇప్పటివరకూ గెలిచిన అభ్యర్థులు వీరే!
* 1957-62- సాదత్ ఆలీ ఖాన్(కాంగ్రెస్‌)
* 1962-67- బకర్ అలీ మిర్జా(కాంగ్రెస్‌)
* 1967-71- రామసహాయం సురేందర్ రెడ్డి(కాంగ్రెస్‌)
* 1971-77- ఎస్.బి.గిరి(తెలంగాణా ప్రజా సమితి)
* 1977-80- జి.మల్లికార్జునరావు    (కాంగ్రెస్‌)
* 1980-84- కమాలుద్దీన్ అహ్మద్(కాంగ్రెస్‌)
* 1984-89- డా. టి. కల్పనాదేవి    (తెదేపా)
* 1989-91- రామసహాయం సురేందర్ రెడ్డి(కాంగ్రెస్‌)
* 1991-96- రామసహాయం సురేందర్ రెడ్డి(కాంగ్రెస్‌)
* 1996-98- చందూలాల్ అజ్మీరా(తెదేపా)
* 1998-99- చందూలాల్ అజ్మీరా(తెదేపా)
* 1999-04- బోడకుంటి వెంకటేశ్వర్లు(తెదేపా)
* 2004-08- ధరావత్ రవీందర్ నాయిక్(తెరాస)
* 2008-09- ఎర్రబెల్లి దయాకరరావు(తెదేపా)(ఉప ఎన్నిక)
* 2009-14- సిరిసిల్ల రాజయ్య(కాంగ్రెస్‌)
* 2014-15 కడియ శ్రీహరి(తెరాస), 
* 2015-19 పసునూరి దయాకర్‌(తెరాస)(ఉప ఎన్నిక)

 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net